సాగుబడి: నీటి భద్రత కోసం.. బోరుకు నీరు తాపండి! | Sagubadi: Measures To Be Taken Around Boreholes For Water Safety | Sakshi
Sakshi News home page

సాగుబడి: నీటి భద్రత కోసం.. బోరుకు నీరు తాపండి!

May 29 2026 9:17 AM | Updated on May 29 2026 9:17 AM

Sagubadi: Measures To Be Taken Around Boreholes For Water Safety

సాగుబడి

పంట పొలాల్లో లేదా ఇళ్ల దగ్గర ఉన్న బావులు లేదా బోర్ల ద్వారా ఎప్పుడూ నీటిని తీసుకోవటమే కాకుండా.. వర్షాకాలంలో నీటిని తాపి వాటి దాహం తీర్చితే అవి ఎండిపోకుండా ఉంటాయి. పెద్ద వర్షాలు పడినప్పుడు వాన నీటిని వృథాగా మురుగు కాలువల్లోకి, వాగులు వంకల్లోకి పోనివ్వకుండా ఎక్కడివక్కడ ఇంకింపజేసుకుంటే.. అక్కడి బావులు, బోర్లలో కరువు కాలంలో కూడా పంటలకు లేదా ఇంటి అవసరాలకు నీటి కరువే ఉండదు అని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.

నీరు ఎండిపోయిన బోర్ల ద్వారా అయినా లేదా నీరు కొద్దోగొప్పో పోస్తున్న బోర్ల ద్వారా అయినా వర్షపు నీటిని ఇంకింపజేసుకునే అవకాశం ఉంది. నీటికి ఇంకింపజేసుకోవటం చెప్పినంత సులభం కాదు. అలాగని, అసాధ్యమూ కాదు. కొంచెం మనసు పెట్టి బోరు చుట్టూతా గుంత తీసి రాళ్లు, చిప్స్, ఇసుకతో పూడ్చ వలసి వుంటుంది.

అయితే, బోరు చుట్టూతా ఇంకుడుగుంత తవ్వుకోవడానికి ముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే.. అది ఇంటి దగ్గరైనా, పొలంలో అయినా.. మన బోరుకు– నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. ఆ సామర్థ్యం ఉంటే, ఎంత మేరకు ఉంది? అనే విషయాలను నిపుణులను సంప్రదించి తెలుసుకోవాలి.


మన బోరుకు నీటిని రీచార్జ్‌ చేయటానికి అవకాశం ఉందని పరీక్షలో తేలితే.. బోరు చుట్టూతా గుంత తవ్వి రాళ్లు, చిప్స్, ఇసుకతో నింపి ఇంకుడుగుంత తయారు చేయాలి. దాని చుట్టూ సిమెంటు పిట్ట గోడ కట్టాలి. వాన నీరు వాలును బట్టి బోరు చుట్టూ నిర్మించిన ఇంకుడుగుంతలోకి వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తే.. వర్షాలు పడినప్పుడు పారే నీరు బోరు దగ్గరకు చేరి భూమి లోపలికి ఇంకుతుంది. బోరు కరువు కాలంలో కూడా ఎండిపోకుండా నీటిని అందిస్తుంది. నీటి భద్రత చేకూరుతుంది.  

బోరు చుట్టూ రీచార్జ్‌ పిట్‌
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బోరు చుట్టూ ఇంకుడు గుంత నిర్మించుకునే విధానం తెలుసుకుందాం. నిర్మాణంలో వివిధ పద్ధతులు ఉన్నాయి. బోరు చుట్టూ గుంత తవ్వాలి. కేసింగ్‌ పైపుకు సన్నని గాట్లు పెట్టాలి. గుంతను రాళ్లు, చిప్స్, ఇసుకతో దొంతర్లుగా నింపాలి. రాళ్ళపై మెష్‌ని పరచాలి. గుంత చుట్టూ రాతి గోడను నిర్మించాలి. వర్షపు నీటిని వాలుకు అనుగుణంగా గుంత వైపు మళ్ళించాలి. బోరు చుట్టూ ఇంకుడుగుంతను నిర్మించిన తర్వాత ఏడాదికోసారి దానిపై మొక్కలు తీసేసి శుభ్రం చేసుకోవటం ద్వారా నీటి సంరక్షణ సక్రమంగా జరుగుతుంది.

- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement