మన మెదడులోనూ.. స్పీడోమీటర్! | Scientists discover speedometer in brain | Sakshi
Sakshi News home page

మన మెదడులోనూ.. స్పీడోమీటర్!

Jun 5 2015 1:15 AM | Updated on Sep 3 2017 3:13 AM

మన మెదడులోనూ.. స్పీడోమీటర్!

మన మెదడులోనూ.. స్పీడోమీటర్!

కార్లు, బైకుల వేగాన్ని చెప్పేందుకు స్పీడోమీటర్లు ఉన్నాయి. మరి మనుషుల వేగం సంగతో?

కార్లు, బైకుల వేగాన్ని చెప్పేందుకు స్పీడోమీటర్లు ఉన్నాయి. మరి మనుషుల వేగం సంగతో? మనకు కూడా మెదడులో ఓ స్పీడోమీటర్ ఉంటుందట! అవును. మనం నడుస్తున్నప్పుడు నెమ్మదిగా పరిసరాలను గమనిస్తూ వెళుతుంటాం. అదే పరుగెత్తితే? మరింత వేగంగా పరిసరాలను గమనిస్తూ దూసుకెళుతుంటాం. ఇంత కచ్చితంగా నడవటం, పరుగెత్తటం ఎలా సాధ్యం? అంటే.. అది మన మెదడులోని స్పీడోమీటర్ నేర్పరితనమేనని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బోన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు!
 
భూమిపై దిక్కుల్ని తెలియజేసే దిక్సూచీ మాదిరిగా పరిసరాల్లో మన శరీర స్థానాన్ని తెలియజేసే దిక్సూచీ వ్యవస్థ కూడా మన మెదడులో ఉంటుందని శాస్త్రవేత్తలు ఇదివరకే కనుగొన్న విషయం తెలిసిందే. అయితే, ఎలుకల గమనంపై పరిశోధన చేపట్టిన జర్మనీ శాస్త్రవేత్తలు.. ఎలుకల్లో గమనానికి తోడ్పడుతూ, వేగాన్ని అంచనా వేసే నాడీకణాలు ఉన్నట్లు కనుగొన్నారు. మెదడు పనితీరు పరంగా మనిషికి, ఎలుకలకు చాలా సారూప్యం ఉంది కాబట్టి.. మనిషిలోనూ ఇలాంటి నాడీకణాలే ఉంటాయని పరిశోధన బృందం సారథి స్టెఫాన్ రెమీ వెల్లడించారు. మనిషిలోని స్పీడోమీటర్‌ను అర్థం చేసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మనిషి కదలికలపై పడే ప్రభావాన్ని నివారించవచ్చనీ భావిస్తున్నారు.
 
మెదడు స్పీడోమీటర్ ఇలా...
మెదడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే హిప్పోక్యాంపస్ భాగం.. పరిసరాలను గుర్తుపెట్టుకుంటూ, అంచనా వేస్తూ, గమనాన్ని నియంత్రిస్తుంది. మనం వేగం పెంచితే హిప్పోక్యాంపస్ కూడా వేగంగా స్పందిస్తుంది. కానీ వేగం పెంచినట్లు, తగ్గించినట్లు మెదడుకు ఎలా తెలుస్తోంది? మనం ఎంత వేగంతో వెళుతున్నామన్నది ఎలా గ్రహిస్తోంది? అన్నది మాత్రం ఇంతకాలం అంతుచిక్కలేదు. కానీ పరిసరాల అంచనా, గమన వేగాలకు మధ్య అనుసంధానమై పనిచేసే నాడీకణాలను ఎలుకల్లో కనుగొనడంతో ఈ చిక్కుముడి వీడినట్లయింది.

ఎలుకల మెదడులో హిప్పోక్యాంపస్ భాగానికి అనుసంధానమై ఉండే ‘మిడియల్ సెప్టమ్’ అనే భాగంలోని కొన్నివేల నాడీకణాలే వేగాన్ని కచ్చితంగా అంచనా వేసి హిప్పోక్యాంపస్‌కు సమాచారం అందిస్తున్నాయని స్టెఫానీ బృందం గుర్తించింది. మిడియల్ సెప్టమ్ భాగంలోని నాడీకణాలు జ్ఞానేంద్రియాలు, కండరాల నుంచి గమనం, వేగాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రహించి వేగాన్ని అంచనా వేస్తున్నాయని వీరు కనుగొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement