ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌కు రూ.26,145 కోట్లు

Rs 26,145 crores to SC ST and SDF  - Sakshi

గతేడాది కన్నా 12 శాతం ఎక్కువగా నిధులు  

ఎస్సీలకు రూ.16,452 కోట్లు, ఎస్టీలకు రూ.9,693 కోట్లు

ఆడిట్‌ తర్వాతే గతేడాది నిధుల ‘క్యారీ ఫార్వర్డ్‌’పై స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌: షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల అభ్యున్నతి కోసం అమల్లోకి తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌)కి తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాది కన్నా దాదాపు 12 శాతం నిధులు పెంచింది. 2018–19 వార్షిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.26,145.90 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.16,452.79 కోట్లు, ఎస్టీలకు రూ.9,693.11 కోట్లు చొప్పున ఖర్చు చేయనుంది.

ఈ నిధులను 42 ప్రభుత్వ శాఖలకు విడదీస్తూ శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించింది. వ్యవసాయం, పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా విభాగాలకు ఎక్కువగా నిధులిచ్చింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చుల్లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలున్నాయి. ఎస్సీ ఎస్‌డీఎఫ్‌లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రూ.2,551.67 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిలో రూ.2,800.15 కోట్లు ఖర్చు చేయనున్నారు.  

కేటగిరీల వారీగా ఎస్‌డీఎఫ్‌ రూ.కోట్లలో
కేటగిరీ    2017–18     2018–19
ఎస్సీ     14,375.12    16,452.79
ఎస్టీ        8,165.87    9,693.11

ఫిబ్రవరి నెలాఖరు నాటికి 54 శాతమే
బడ్జెట్‌ మార్పుల్లో భాగంగా 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు బదులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలో మార్పులు చేసిన సర్కారు.. కేటాయించిన ప్రతి పైసా ఖర్చు చేయాలని, పూర్తిస్థాయిలో ఖర్చవకపోతే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్‌ చేయాలని నిర్ణయించింది.

2017–18కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఫిబ్రవరి నెలాఖరునాటికి 54 శాతం నిధులే ఖర్చు చేసినట్లు ప్రభుత్వ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి వార్షిక ఖర్చుల నివేదికపై స్పష్టత రానుంది. ఖర్చులపై ఆడిట్‌ ముగిసిన తర్వాత ఎంత మొత్తం క్యారీ ఫార్వర్డ్‌ చేయాలో లెక్క తేలనుంది. ఈ ప్రక్రియంతా మే నెలాఖరులో లేదా జూన్‌ మొదటి వారంలో తేలుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top