నిలిచిన భూముల క్రమబద్ధీకరణ | Regulation of land to be placed | Sakshi
Sakshi News home page

నిలిచిన భూముల క్రమబద్ధీకరణ

May 21 2016 4:17 AM | Updated on Sep 4 2017 12:32 AM

రెండు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయలేమి.. భూముల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లకు ప్రతిబంధకంగా మారింది..

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల
మధ్య కొరవడిన సమన్వయం

సాక్షి, హైదరాబాద్: రెండు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయలేమి.. భూముల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లకు ప్రతిబంధకంగా మారింది. చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవో 59, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కోసం ఇచ్చిన జీవో 12 ప్రతులను చూపినా సబ్ రిజిస్ట్రార్లు ససేమిరా అంటున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు విషయమై తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాల అందలేదని సబ్‌రిజిస్ట్రార్లు చెబుతున్నారు.

దీంతో సొమ్ము చెల్లించి ఏడాది గడచినా భూముల రిజిస్ట్రేషన్ కాకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రెవెన్యూ శాఖ ఉత్తర్వులు తమకు అందలేదని, దీంతో సబ్ రిజిస్ట్రార్లకు తాము ఆదేశాలివ్వలేదని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సాంకేతిక ఇబ్బందులతో అస్తవ్యస్తంగా తయారైన క్రమబద్ధీకరణ ప్రక్రియ, తాజాగా ఉన్నతాధికారుల సమన్వయలోపంతో మరింత అధ్వానంగా మారింది.

మరో 10 రోజుల్లో గడువు ముగుస్తుండగా, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడం లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ‘‘స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజు మినహాయింపు విషయమై రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సబ్ రిజిస్ట్రార్లకు ఎటువంటి ఆదేశాలందలేదు. రిజిస్ట్రేషన్ల శాఖ నోటిఫికేషన్లు వచ్చేవరకు క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్లందరికీ సూచించాం’’ అని  తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ల సంఘం అధ్యక్షుడు కె.విజయ భాస్కర్‌రావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement