2011–12లో 52.8 శాతం నుంచి 2023–24 నాటికి 62.4 శాతానికి పెరుగుదల
జాతీయ సగటు 54.5 శాతంతో పోలిస్తే రాష్ట్ర వాటానే అధికం
నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా మారిన సేవల రంగం నుంచి ఆదాయాన్ని ఆర్జించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. దేశ సేవల రంగం స్వరూపం, ఎదుగుదల, ఉపాధి కల్పన సరళిపై నీతి ఆయోగ్ మంగళవారం ఢిల్లీలో విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. భారత సేవల రంగం: స్థూల విలువ జోడింపు (జీవీఏ) ధోరణులు–రాష్ట్ర స్థాయి డైనమిక్స్ నివేదిక ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్‌వీఏ)లో సేవల వాటా 2011–12లో ఉన్న 52.8% నుంచి 2023–24 నాటికి 62.4 శాతానికి పెరిగింది. ఇది జాతీయ సగటు (54.5%) కంటే అధికం కావడం విశేషం.
మొత్తంగా చూస్తే తెలంగాణ సగటు సేవల రంగం వాటా 60.3 శాతంగా నమోదైంది. హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెందిన ఐటీ, స్టార్టప్‌ల వ్యవస్థ, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు (సగటు జీఎస్‌వీఏ వాటా 34.1%), ఆర్థిక సేవలు (11.1%) ఈ వృద్ధికి కారణమని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. అధిక ఉత్పాదకత, ఆధునిక సేవలపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని పేర్కొంది.ఉపాధి కల్పనలో చూస్తే 2023–24లో తెలంగాణ శ్రామిక శక్తిలో 34.8% మంది (62 లక్షల మంది) సేవల రంగంలో పనిచేస్తున్నట్లు నివేదిక వివరించింది.
ముఖ్యంగా ఐటీ రంగం (12 శాతం వాటాతో) ఉపాధిలోనూ గణనీయ పాత్ర పోషిస్తోందని తెలిపింది. తెలంగాణ తన ఐటీ బలాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని.. అప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్రం కీలకపాత్ర పోషించగలదని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిని పరిశీలిస్తే జీఎస్‌వీఏలో సేవల రంగం వాటా తెలంగాణ కంటే తక్కువగా ఉంది. 2011–12లో 40.9% ఉన్న వాటా 2023–24 నాటికి 42 శాతానికి పెరిగింది.
ఇది జాతీయ సగటు కంటే తక్కువ. మరోవైపు ఉపాధి కల్పనలో 2023–24 నాటికి ఏపీ శ్రామిక శక్తిలో 31.8% మంది (78 లక్షల మంది) సేవల రంగంలో పనిచేస్తున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. ఏపీ ఓడరేవులు, వ్యవసాయ అనుబంధ సేవలు, లాజిస్టిక్స్‌ను బలోపేతం చేసుకోవాలని నీతిఆయోగ్ నివేదిక సూచించింది.
వృద్ధిలో సమతుల్యత.. నాణ్యతే సవాల్
దేశవ్యాప్తంగా సేవల రంగం వృద్ధి ప్రాంతీయంగా సమతౌల్యంగా మారుతోందని.. వెనుకబడిన రాష్ట్రాలు సైతం పుంజుకుంటున్నాయని నీతి ఆయోగ్ పేర్కొంది. అయితే ఉపాధి కల్పనలో ఆధునిక రంగాలు అధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నా తక్కువ మందికే ఉద్యోగాలిస్తుంటే సంప్రదాయ రంగాలు ఎక్కువ మందికి ఉపాధినిస్తున్నా అవి అసంఘటితంగా, తక్కువ వేతనాలతో కొనసాగుతున్నాయని తెలిపాయి.
ఉపాధి కల్పనలో లింగ వివక్ష, ప్రాంతీయ వ్యత్యాసాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని నీతి ఆయోగ్ గుర్తించింది. ఈ సవాళ్లను అధిగమించడానికి గిగ్, స్వయం ఉపాధి, ఎంఎస్‌ఎంఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, మహిళలు, గ్రామీణ యువతకు డిజిటల్ నైపుణ్యాలు అందించాలని, నూతన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టాలని, టైర్–2, టైర్–3 నగరాల్లో సేవా కేంద్రాలను అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ సూచించింది.


