ఖమ్మం ఎన్నికల్లో ఓటుకు రశీదు | Receipt to vote in Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మం ఎన్నికల్లో ఓటుకు రశీదు

Mar 2 2016 4:11 AM | Updated on Sep 3 2017 6:46 PM

ఖమ్మం ఎన్నికల్లో ఓటుకు రశీదు

ఖమ్మం ఎన్నికల్లో ఓటుకు రశీదు

దేశంలోనే తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లను వినియోగించనున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లు అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

♦ ఈవీఎంలకు ప్రింటర్ల అనుసంధానం
♦ ప్రయోగాత్మకంగా 35 పోలింగ్ కేంద్రాల్లో అమలు
♦ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం
♦ అందుకు అనుగుణంగా చట్ట సవరణ చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లను వినియోగించనున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లు అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 35 పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంతో ఓటరు తాను ఎవరికి ఓటు వేశారో తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది.

ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)గా పిలిచే ఈ విధానంలో ఈవీఎంలకు అమర్చిన ప్రింటర్ల ద్వారా ఓటరు అక్కడికక్కడే తమ ఓటు రశీదును తీసుకోవచ్చు. ఈవీఎంలతోపాటే ఈ ప్రింటర్ ఉంటుంది కనుక ఓటు వేసిన వెంటనే ఓటరు ప్రింటర్ నుంచి రశీదు తీసుకోవచ్చు. ఈ రశీదులో ఓటరు సీరియల్ నంబర్‌తోపాటు తాను ఎవరికి ఓటు వేశారో ఆ అభ్యర్థి పేరు, గుర్తు ఉంటాయి. అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఓటరు అక్కడికక్కడే పరిశీలించుకొని.. రశీదును పక్కన ఉండే డ్రాప్ బాక్స్‌లో పడేసి వెళ్లాల్సి ఉంటుంది. ఒకరికి ఓటు వేస్తే మరొకరికి వేసినట్లుగా రశీదులో వస్తే.. అక్కడికక్కడే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

ఆ ఓటరు తన ఫిర్యాదు నిజమని రాతపూర్వకంగా వాంగ్మూలం ఇస్తే.. అక్కడికక్కడే ఆ అధికారి మరోసారి ‘టెస్ట్ ఓటు’ వేసేందుకు అవకాశం కల్పిస్తారు. అక్కడ అందుబాటులో ఉన్న పోలింగ్ ఏజెంట్లు లేదా అభ్యర్థుల సమక్షంలో ఈ టెస్ట్ ఓటు వేయాలి. అప్పుడు కూడా రశీదు తప్పుగా వస్తే ఓటింగ్ ప్రక్రియను నిలిపేస్తారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారికి తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటారు. ఓటరు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలితే.. ఓటింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగిస్తారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్లు ఓటరు నుంచి రాతపూర్వక వాంగ్మూలం కూడా తీసుకుంటారు. ఈ టెస్ట్ ఓటు వివరాలను ప్రత్యేక ఫామ్‌లో పొందుపరుస్తారు. పోలింగ్ సందర్భంగా నమోదైన టెస్ట్ ఓట్లన్నింటినీ.. కౌంటింగ్ సందర్భంగా పక్కనబెట్టి మిగతా ఓట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement