
ట్రయల్‌కు రెడీ!
గోదావరి మంచినీటి పథకం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సుజల స్రవంతి) మొదటి దశ ప్రయోగ పరీక్షకు జలమండలి సన్నాహాలు పూర్తి చేసింది
గోదావరి మొదటి దశకు సన్నాహాలు
సర్కారు అనుమతికి జలమండలి ఎదురుచూపు
ముర్మూరు నుంచి బొమ్మకల్ వరకు ట్రయల్ రన్
నగరంలో పూర్తి కాని రింగ్ మెయిన్ పనులు
సాక్షి, సిటీబ్యూరో : గోదావరి మంచినీటి పథకం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సుజల స్రవంతి) మొదటి దశ ప్రయోగ పరీక్షకు జలమండలి సన్నాహాలు పూర్తి చేసింది. తొలి దశలో కరీంనగర్ జిల్లా ముర్మూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 54 కి.మీ. దూరంలో ఉన్న బొమ్మకల్‌కు 20 ఎంజీడీల నీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ట్రయల్ రన్‌లో పైప్‌లైన్ల సామర్థ్యం, హైడ్రాలిక్ టెస్టులు, పైప్‌లైన్ల జాయింట్లను పరిశీలించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నెలాఖరులో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఎల్లంపల్లి బ్యారేజి నుంచి 1.5 కి.మీ. దూరంలోని ముర్మూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు ఇప్పటికే నీటిని గ్రావిటీ ద్వారా తరలించారు. అక్కడి నుంచి బొమ్మకల్- మల్లారం- కొండపాక- ఘన్‌పూర్ మార్గంలో రూ.3,800 కోట్ల అంచనాతో రిజర్వాయర్లతో పాటు సుమారు 186 కి.మీ. పైప్‌లైన్లు పూర్తయిన విషయం విదితమే. గోదావరి తొలిదశలో గ్రేటర్‌కు 172 ఎంజీడీల నీటిని తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా బసంత్‌నగర్ వద్ద రైల్వే పట్టాల కింద నుంచి 20 మీటర్ల మార్గంలో 3000 డయా మీటర్ల వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మరో రెండు రోజుల్లో పూర్తి చేసి...
ట్రయల్ రన్‌కు మార్గం సుగమం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి పథకానికి నెలకు సుమారు 70 మెగావాట్ల విద్యుత్ అవసరం. దీనికి జలమండలి రూ.30 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది.
నగరంలో సరఫరాకు మరో రెండు నెలలు..
ప్రస్తుతం ప్రయోగ పరీక్షలో కేవలం ముర్మూరు నుంచి బొమ్మకల్ రిజర్వాయర్ వరకే నీటి పంపింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి మల్లారం, కొండపాక, ఘన్‌పూర్ రిజర్వాయర్ల మార్గంలో ప్రయోగ పరీక్షలకు 50 రోజుల సమయం పడుతుంది. నగర వ్యాప్తంగా గోదావరి జలాల సరఫరాకు మరో రెండు నెలల సమయం పట్టనుంది.
అడ్డంకులివే..
ఘన్‌పూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నుంచి నగర వ్యాప్తంగా గోదావరి జలాల సరఫరాకు అవసరమైన 67 కి.మీ. మార్గంలో చేపట్టిన రింగ్‌మెయిన్ పైప్‌లైన్ పనుల పూర్తికి పలు చోట్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి.
రింగ్‌మెయిన్-1...
గుండ్లపోచంపల్లి రైల్వే ట్రాక్ ప్రాంతంలో 30 మీటర్ల మేర పనులు పూర్తి కావాల్సి ఉంది. గుండ్లపోచంపల్లి గ్రామస్తులు పైప్‌లైన్ మార్గం మార్చాలని ఒత్తిడి చేస్తుండడంతో సుమారు 1420 మీటర్ల మేరకు పనులు నిలిచాయి.
రింగ్‌మెయిన్-2...
శామీర్‌పేట్ నుంచి కరీంనగర్ జాతీయ రహదారిలో సుమారు 2.5 కి.మీ. మార్గంలో పనులకు జాతీయ రహదారుల సంస్థ నుంచి అనుమతులు అవసరం. కౌకూర్ వద్ద రక్షణ శాఖకు సంబంధించిన 1.20 ఎకరాల స్థలంలో పైప్‌లైన్ పనులకు సంబంధిత శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. వాణీనగర్, మెట్టుగూడ, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో పైప్‌లైన్ పనులకు రైల్వే శాఖ అనుమతించాల్సి ఉంది.