రైతులు అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం బడా కంపెనీల వేలకోట్ల అప్పులను
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏఐసీసీ నేత శుక్లా ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రైతులు అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం బడా కంపెనీల వేలకోట్ల అప్పులను మాఫీ చేస్తోందని ఏఐసీసీ అధికారప్రతినిధి రాజీవ్ శుక్లా విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావుతో కలసి సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో రోజుకు 35 మంది రైతులు సగటున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని శుక్లా చెప్పారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని, పంటలకు సబ్సిడీ ఇవ్వకుండా, పండించిన పంటలకు గిట్టుబాటుధర కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయరంగంలో స్వామినాథన్ సిఫారసులను అమలుచేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. వ్యవసాయపెట్టుబడులపై 50 శాతం లాభానికి పంటలను అమ్ముకునే విధంగా రైతులను తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడంలేదన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకం రైతులకు కాకుండా బీమా కంపెనీలకే ఉపయోగపడు తోందని ఆరోపించారు. ఈ పథకం వల్ల కంపెనీలు రైతుల నుంచి రూ.10,376 కోట్ల లాభం పొందాయని వివరించారు. రాష్ట్రప్రభుత్వం కూడా రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్నారు. మద్దతు ధరలు ఇవ్వాలని అడిగిన పాపానికి రైతులపై కేసులు పెట్టడం, చేతులకు బేడీలు వేయడం వంటి కిరాతకాలకు పాల్పడుతోందని రాజీవ్ శుక్లా ధ్వజమెత్తారు. రైతుల పట్ల అనుచితుంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీకి, టీఆర్‌ఎస్‌కు రైతులే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.