
ప్రభుత్వానికి బీసీసీఐ ప్రతిపాదన
సహకారం అందించేందుకు క్రికెట్ బోర్డు సిద్ధం
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన దేశంలో ఇతర క్రీడలకు అండగా నిలవాలని యోచిస్తోంది. కనీసం రెండు లేదా మూడు ఒలింపిక్ క్రీడలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు బీసీసీఐ తమ ఆలోచనను కేంద్ర క్రీడా శాఖకు తెలియజేసింది. మంత్రి మన్‌సుఖ్ మాండవియాతో గురువారం బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీసీఐ ఈ ప్రతిపాదన చేసింది ‘మా ప్రతిపాదనను బీసీసీఐ స్వాగతించింది.
ఏ క్రీడలను ఎంచుకుంటే బాగుంటుందనే విషయం తుది నిర్ణయం కేంద్ర క్రీడాశాఖకే వదిలేశాం. ఆయా క్రీడల్లోనూ ఒలింపిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి కనీసం 100 నుంచి 200 మందికి అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తాం. ఒలింపిక్ క్రీడలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రీడల సన్నాహాలు ఉంటాయి’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సమావేశంలో 58 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
క్రికెట్ బోర్డు తాజా ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన వీరు తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 23 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిక్షణా కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో బాక్సింగ్ (రోహ్‌టక్), స్విమ్మింగ్, షూటింగ్ (న్యూఢిల్లీ)లలో మాత్రం ఒకే క్రీడాంశంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. విభిన్న క్రీడాంశాలకు కేంద్రంగా పటియాలా, బెంగళూరులలో ‘సాయ్’ కేంద్రాలు నడుస్తున్నాయి.
గతంలోనూ పలు మార్లు బీసీసీఐ ఆరి్థకపరంగా ఇతర క్రీడలకు సహకారం అందించింది. ఆటలను దత్తత తీసుకోవాలనే తాజా ప్రతిపాదనపై మున్ముందు మరింత స్పష్టత రానుంది. భారత సంతతికి చెందిన విదేశాల్లో స్థిరపడిన ఓవర్సీస్ సిటిజన్ (ఓసీఐ)లు క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించరాదనే నియమం ప్రస్తుతం అమల్లో ఉంది. దీనిని తొలగించాలని కూడా కేంద్ర క్రీడాశాఖ యోచిస్తోంది. అక్కడ ఆటలో నిష్ణాతులైన తర్వాత మన దేశం తరఫున వచ్చి ఆడితే ఇక్కడి ప్లేయర్లకు కూడా మేలు జరుగుతుందని, వ్యవస్థలో కొత్త మార్పులు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
మరోవైపు వివిధ క్రీడా సమాఖ్యలు తమలోని వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించుకుంటేనే ఆట బాగుపడుతుందని... క్రీడలను కోర్టులు నడపడం సరైందని కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. వారందరితో సమావేశంపై సమస్యను పరిష్కరించేందుకు మంత్రి స్వయంగా సిద్ధమయ్యారు.