ఇక వానలే వానలు! | rains for coming three days | Sakshi
Sakshi News home page

ఇక వానలే వానలు!

Jun 10 2016 1:34 AM | Updated on Sep 4 2017 2:05 AM

ఇక వానలే వానలు!

ఇక వానలే వానలు!

రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించనప్పటికీ జోరుగా వానలు కురవనున్నాయి.

  • మూడు రోజుల్లో భారీ వర్షాలు
  • ఇప్పుడే విత్తుకోవద్దు.. దుక్కి సిద్ధం చేసుకోండి..
  • రైతులకు వ్యవసాయ శాఖ సూచన
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించనప్పటికీ జోరుగా వానలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక మరో నాలుగు రోజుల్లో రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి.  అయితే రుతు పవనాలతో కూడిన వానలు.. అల్ప పీడనం ప్రభావంతో కురుస్తున్న వానలకు తేడాలను రైతులు గుర్తించాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం అల్ప పీడన ప్రభావంతో వానలు కురుస్తున్నందున వాటిని నమ్ముకుని విత్తనాలు విత్తుకోవద్దని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రైతులను వ్యవసాయ శాఖ కోరింది. కేవలం దుక్కి సిద్ధం చేసుకోవాలని సూచించింది.  

    అల్పపీడన ప్రభావంతో కురిసే వానలు ఉన్నట్టుండి మాయమవుతాయి. వాటిని నమ్మి విత్తుకుంటే.. మొలకెత్తే అనువైన వాతావరణం లేక రైతులు నష్టపోవాల్సి ఉంటుంది. రుతుపవనాలు తాకిన తర్వాత తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు నేలల్లో 60 నుంచి 75 మి.మీ. మేర వర్షపాతం నమోదైన అనంతరం విత్తుకునేందుకు అనువైన వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 15 నుంచి 20 సెం.మీ. మేర నేల తడిస్తేనే వర్షాధార పంటలైన సోయాచిక్కుడు, జొన్న, మొక్కజొన్న, కంది, పెసరతోపాటు పత్తి పంటలకు అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక వరిలో సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048) రకం నారు వేసుకునేందుకు జూన్ మాసం అనుకూలంగా ఉండదని, కేవలం జులైలోనే నారు పోసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గురువారం నిజామాబాద్, హైదరాబాద్, భద్రాచలం తదితర ప్రాంతాల్లో వానలు కురిశాయి.

    ఏపీలోకి నైరుతి ప్రవేశం
    సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు గురువారం ఏపీలోకి ప్రవేశించాయి. బుధవారం కేరళను తాకిన ఈ రుతుపవనాలు 24 గంటల్లోనే ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలను తాకాయి. రానున్న 24 గంటల్లో ఇవి కోస్తాంధ్ర, రాయలసీమల్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement