ఎస్‌ఆర్‌డీపీని ఆపండి...కేబీఆర్‌ను రక్షించండి | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌డీపీని ఆపండి...కేబీఆర్‌ను రక్షించండి

Published Wed, Jun 8 2016 3:33 AM

ఎస్‌ఆర్‌డీపీని ఆపండి...కేబీఆర్‌ను రక్షించండి

పర్యావరణ వాదులు, వాకర్స్ డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: ‘ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టును నిలిపేయండి.. కేబీఆర్ జాతీయ పార్క్‌ను రక్షించండి..’ ఇప్పుడు పర్యావరణవాదులు, వాకర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరిదీ ఇదే నినాదం! ఈ ప్రాజెక్టు పనులతో పార్కులోని అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొం డిగా ముందుకు వెళ్తోందని మండిపడుతున్నారు. సుమారు 400 ఎకరాల్లో విస్తరించిన కేబీఆర్ పార్కులో.. 500 అరుదైన వృక్షజాతులు, 120 అరుదైన పక్షి జాతులు, 20 క్షీరదజాతులు, సరీసృపాలు, ఉభయచరాలతోపాటు వందలాది కీటకజాతులు ఉన్నాయి. వీటన్నింటి కలయికతో పార్కు జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన ఎస్‌ఆర్‌డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్)తో పార్క్‌లోని రమణీయ దృ శ్యాలు, పక్షులు, సీతాకోక చిలుకలు, ఇతర జీవజాలం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుం దన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 
 చెట్లు కొట్టివేయడం అవివేకం
 నగరంలో కాలుష్య భూతం పెరుగుతున్న తరుణంలో ఉన్న చెట్లను నరికివేయడం అవివేకం. గ్రేటర్ పరిధిలో 33 శాతం హరితం పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎస్‌ఆర్‌డీపీపై చూపే ఉత్సాహం చెట్లు నాటడంలో చూపాలి.
 - జీవానందరెడ్డి, ఫోరం ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్‌మెంట్
 
 పక్షి జాతులకు ముప్పు
 నగరం నడిబొడ్డున స్థానికులు, వాకర్స్‌కు ప్రాణవాయువును అందించే పార్కు ఇదొక్కటే. ఈ పార్కును విధ్వంసం చేస్తూ ఎస్‌ఆర్‌డీపీ పనులను చేపడితే అరుదైన పక్షి జాతులు, వృక్ష జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.
 - అంబిక, హైదరాబాద్ రైజింగ్ సంస్థ ప్రతినిధి
 
 పార్కును పరిరక్షించాల్సిందే
 ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు పనుల నుంచి కేబీఆర్ పార్కును మినహాయించాలి. పార్కు పరిరక్షణ విషయంలో అందరం ముందుంటాం. ప్రభుత్వం మొండిగా ముందుకె ళ్తే పార్కు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.  
 - మహేశ్, వ్యాపారి
 
 జీవవైవిధ్యం దెబ్బతింటుంది
 పార్కు వద్ద ఎస్‌ఆర్‌డీపీ పనులతో పార్కులో జీవవైవిధ్యం దెబ్బతింటుంది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ఈ పార్కు స్థానికులకు ఎంతో మానసిక ఉల్లాసాన్నిస్తోంది.
 -ప్రీతి, గృహిణి
 
 ఎస్‌ఆర్‌డీపీతో ట్రాఫిక్ తగ్గదు
 బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గదు. పలు అభివృద్ధి చెందిన నగరాల్లోనూ ఇదే విషయం నిరూపితమైంది. స్మార్ట్ సిటీ అంటే నగరంలో ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి. వాక్‌వేస్‌ను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లడం దారుణం.
 - కాజల్ మహేశ్వరి, పర్యావరణ నిపుణులు
 
 పచ్చదనం తగ్గిపోతోంది
 ఇప్పటికే నగరంలో పచ్చదనం కనుమరుగవుతోంది. ఇక్కడి పచ్చదనాన్ని మాయం చేస్తూ ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపట్టడం అవివేకం. తక్షణం పనులు నిలిపివేయాలి.
 - ఎస్.ఎం.రెడ్డి, వాకర్
 
 పర్యావరణాన్ని నాశనం చేయడమే
 కాంక్రీట్ నిర్మాణాలతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. వాక్‌వేను తొలగించి చేపట్టే పనులతో ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. పార్కులోని జంతుజాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.
 -అనిత, పర్యావరణవాది

Advertisement
 
Advertisement
 
Advertisement