
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న కీలక సూత్రధారి జగిత్యాల జిల్లాకు చెందిన రైస్ మిల్లు యజమాని కొండా లక్ష్మణ్‌పై పీడీ కేసు నమోదైంది. పౌరసరఫరాల శాఖ నిఘా బృందం నివేదికల ఆధారంగా గత ఏడాది కాలంలో నలుగురు బియ్యం వ్యాపారులపై పీడీ కేసులు నమోదు కాగా, తొలిసారిగా రైస్ మిల్లు యజమానిపై పీడీ కేసు నమోదు చేసినట్లు ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి రోడ్డులోని హనుమాన్ సాయి ట్రేడర్స్ యజమాని కొండా లక్ష్మణ్.. కరీంనగర్ జిల్లా కేంద్రంగా 15 ఏళ్లుగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడని వివరించారు. లక్ష్మణ్‌పై ఇప్పటి వరకు 8 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు. నిఘా బృందం అతనిపై ఉన్న కేసుల జాబితాను కలెక్టర్ శరత్‌కు సమర్పించగా, ఆదివారం లక్ష్మణ్‌పై కలెక్టర్ పీడీ కేసు నమోదు చేశారన్నారు. రాయకల్లు, కోరుట్ల, లాటిపెల్లిలో రైస్ మిల్లులను లక్ష్మణ్ బినామీ పేర్లతో నిర్వహిస్తూ రేషన్ బియ్యం అక్రమ దందా చేస్తున్నాడన్నారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, జగిత్యాల జిల్లాల నుంచి పెద్దఎత్తున రూ.8 నుంచి రూ.12 వరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అదే బియ్యాన్ని ప్రభుత్వానికి రూ. 25 చొప్పున అప్పగిస్తున్నాడన్నారు. నెలకు దాదాపు 800 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నాడన్నారు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా నెలకు రూ. 50 లక్షల నుండి రూ. 70 లక్షల వరకు అక్రమార్జన చేస్తున్నాడన్నారు. మిగిలిన బియ్యాన్ని మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు తరలిస్తున్నాడని ఆనంద్ వివరించారు.
జిల్లాల వారీగా జాబితా...
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతూ రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్న రైస్ మిల్లర్ల, వ్యాపారుల జాబితాను జిల్లాల వారీగా రూపొందించామని ఆనంద్ తెలిపారు. ఇందులో కీలక సూత్రధారులను గుర్తించామని, వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల పూర్తి సహకారంతో త్వరలోనే మరికొంతమంది రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. నాగర్‌కర్నూల్, వరంగల్, గద్వాల్, భూపాలపల్లి, నల్లగొండలో మరి కొంతమందిపై పీడీ కేసులు నమోదు చేయబోతున్నామన్నారు.