
తెలంగాణ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి, హైదరాబాద్ నగర మాజీ పోలీస్ కమిషర్ సీవీ ఆనంద్ మంచి క్రికెటర్ అన్న విషయం మనలో చాలామందికి తెలీకపోవచ్చు.
సీవీ ఆనంద్ అండర్-19 క్రికెట్‌లో భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. అలాగే అండర్-19, 22 విభాగాల్లో హైదరాబాద్ జట్టుకు కూడా ఆడారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో చాలా టోర్నీల్లో పాల్గొన్నారు.
ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపిక కావడంతో సీవీ ఆనంద్ క్రికెటింగ్ కెరీర్‌కు బ్రేక్ పడింది. అయినా వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్ ఆడుతుంటారు.
తాజాగా సీవీ ఆనంద్ హెచ్‌సీఏ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో సికింద్రబాద్ క్లబ్‌కు ఆడుతూ మెరుపు సెంచరీ చేశారు. వారం రోజుల వ్యవధిలో అతనికి ఇది రెండో సెంచరీ.
గత ఆదివారం బేగంపేటలో హెచ్‌పీఎస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 89 బంతుల్లో 111 పరుగులు చేసిన ఆనంద్.. తాజాగా సికింద్రబాద్ క్లబ్‌లో తారకరామ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 94 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌లో సికింద్రబాద్ క్లబ్ జట్టు 36 పరుగుల తేడాతో తారకరామ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సికింద్రబాద్.. సీవీ ఆనంద్ శతక్కొట్టడంతో 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరగులు చేసింది. ఛేదనకు దిగిన తారకరామ జట్టు 34.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.