సాక్షి, హైదరాబాద్: కర్నూలులో ప్రైవేట్ బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణాశాఖ(Telangana Transport Department) అధికారులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. డ్రంకన్ డ్రైవ్, బీమా, ఫిట్‌నెస్, పర్మిట్ పత్రాలు, బస్సు లోపల భద్రతను పరిశీలించారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.

మరోవైపు.. కూకట్‌పల్లి, హయత్‌నగర్, ఎల్బీనగర్ పరిధిలో కూడా ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వాహనాలపై ఉన్న చలాన్లను పోలీసులు వసూలు చేస్తున్నారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు. ఆరు ప్రత్యేక టీమ్‌లతో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు.

కాగా, కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా మృతిచెందారు. అయితే.. ప్రమాదానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. బస్సులో అనేక లోపాలు ఉన్నాయని కూడా తేలింది. దీంతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది.
రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారుల సోదాలు నిర్వహించారు. ఏపీ నుంచి వెళ్తున్న ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. బస్సులో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను ఆర్టీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అలాగే, ఎల్బీనగర్‌లోని చింతలకుంట వద్ద కూడా ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో నాలుగు బస్సులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.


