డ్రగ్స్‌ మూలాలపై దర్యాప్తు ఏదీ?

డ్రగ్స్‌ మూలాలపై దర్యాప్తు ఏదీ? - Sakshi

కెల్విన్‌కు డ్రగ్‌ సరఫరా గుట్టు తేల్చడంపై దృష్టి సారించని ఎక్సైజ్‌ సిట్‌

- డ్రగ్స్‌ దొరకకున్నా కొందరికి నోటీసులు, విచారణ పేరుతో హడావుడి

డార్క్‌ నెట్, కొరియర్‌ రవాణా అంశాలపై నిర్లక్ష్యం

కెల్విన్‌ అరెస్ట్‌ రోజు ఓ ప్రముఖ నిర్మాత ఉన్నాడని చెప్పిన అకున్‌

దర్యాప్తు జాబితాలో ఏ నిర్మాత పేరూ లేని వైనం

ఆ నిర్మాత సహా మరో 14 మంది ప్రముఖులు తప్పించుకున్నట్లేనా?

తీవ్ర ఒత్తిళ్ల కారణంగా వారి విచారణపై సందిగ్ధం

 

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో విచారణ తీరు ఏమిటన్నది గందరగోళంగా మారింది. అసలు డ్రగ్స్‌ మూలాలను పెకలించాల్సింది పోయి.. వాటిని వినియోగించిన వారిని మాత్రమే టార్గెట్‌ చేయడమేమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెల్విన్‌కు డ్రగ్స్‌ ఎక్కడినుంచి సరఫరా అయ్యాయి, కెల్విన్‌ పైన మరింత మంది డ్రగ్‌ పెడ్లర్లు ఉన్నారా? ఉంటే వారెవరు? అసలు డ్రగ్స్‌ సరఫరా మూలాలు ఎక్కడున్నాయి? వాటిని నియంత్రించేదెలా.. వంటి అంశాలన్నీ పక్కదారి పట్టాయి. డ్రగ్స్‌కు బానిసైన వారిని, వినియో గించిన వారిని బాధితులుగా పరిగణిస్తారని... కానీ వారే ప్రధాన నిందితులు అనే స్థాయిలో ఎక్సైజ్‌ సిట్‌ హడావుడి చేయడమేమిటంటూ పోలీసు శాఖ అధికారులే విస్తుపోతున్నారు. ఒకవేళ వారు డ్రగ్‌ పెడ్లర్లుగా భావిస్తే.. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి, డ్రగ్స్‌ ఉంటే స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని.. కానీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించడం ఏమిటని పేర్కొంటున్నారు.

 

డార్క్‌ నెట్‌లపై సిట్‌ మౌనం

కెల్విన్‌ సహా ఇతర పెడ్లర్లు డార్క్‌నెట్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించారని పేర్కొన్న ఎక్సైజ్‌ సిట్‌.. ఆ డార్క్‌ నెట్, వాటి నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరాలను నియంత్రించే అంశంపై దృష్టి పెట్టలేదన్న ఆరోపణ వినిపిస్తోంది. డార్క్‌ నెట్‌ వెబ్‌సైట్ల నియంత్రణకు ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌)కి లేఖ రాయా లి. కానీ ఇప్పటివరకు సిట్‌ అనుమానిత డార్క్‌నెట్‌ సైట్లపై ఎన్‌ఐసీకి లేఖ రాయలేదని సమాచారం. దీనిపై సిట్‌ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించినా.. స్పందన రాలేదు.

 

అసలు గుట్టు తేలేనా?

కెల్విన్‌కు గోవా, జర్మనీల నుంచి డ్రగ్‌ వచ్చిందని సిట్‌ చెబుతోంది. గోవా నుంచే డ్రగ్‌ వస్తోందని తెలిసినప్పుడు ప్రత్యేకంగా ఒక బృందాన్ని గోవాకు పంపించి దర్యాప్తు చేయాల్సి ఉంది. అక్కడి మూలాలను ఛేదిస్తే మొత్తం నెట్‌వర్క్‌ బయటపడేది. కానీ సిట్‌ ఆ దిశగా దృష్టి పెట్టలేదు. అంతేగాకుండా కెల్విన్‌ డ్రగ్స్‌ కొనుగోలు చేసేందుకు ఎక్కడి నుంచి వివరాలు సేకరించాడు? డార్క్‌ నెట్‌ వెబ్‌సైట్ల అంశం అతడికి ఎలా తెలిసిందన్న కోణంలోనూ పరిశీలన జరగడం లేదన్న విమర్శలున్నాయి.

 

బడా నిర్మాత సేఫ్‌..?

డ్రగ్స్‌ వ్యవహారంలో పలు ఇంటర్నే షనల్‌ స్కూళ్ల విద్యార్థులతో పాటు ఓ బడా సినీ నిర్మాత కూడా ఉన్నట్లు కెల్విన్‌ విచారణలో తేలిందని కొద్దిరోజుల కింద అకున్‌ సబర్వాల్‌ వెల్లడించారు. ఆ నిర్మాతకు కూడా నోటీసులిచ్చి విచారిస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ బడా నిర్మాత అంశం మరుగున పడిపోవడం గమనార్హం. దీనిపై సిట్‌ అధికారులెవరూ నోరు మెదపడం లేదు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top