పంచకూటాలయానికి కొత్త స్థలం


- మంత్రి చందూలాల్ ఆదేశంతో ఆగమేఘాలమీద గుర్తింపు

గుట్టపై భూమిని సేకరించిన రెవెన్యూ అధికారులు

 

 సాక్షి, హైదరాబాద్: అరుదైన పంచకూటాలయం పునర్నిర్మాణానికి మరో కొత్త స్థలాన్ని సేకరించారు. ఇప్పటికే ఓ స్థలాన్ని గుర్తించి దాదాపు రూ.10 ల క్షలు వ్యయంతో చదునుచేసి నిర్మాణానికి సిద్ధం చేయగా, అది మరో పార్టీ నేతలు ఇచ్చిన భూమి కావటంతో అందులో ఆలయ పునర్నిర్మాణం వద్దంటూ అధికార టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. దాంతో పురావస్తుశాఖ పనులు చేయకుండా చేతులెత్తేసింది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం రామానుజాపురంలో జరిగిన ఈ వ్యవహారాన్ని 4 రోజుల క్రితం ‘పంచకూటాలయంపై పంచాయితీ’ శీర్షికన సాక్షి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో అదేరోజు పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి చందూలాల్ ఇటు పురావస్తుశాఖ, అటు రెవెన్యూ అధికారులను పిలిపించి దీనిపై చర్చించారు.



పంచకూటాలయం పునరుద్ధరణ ఇలా రాజకీయకారణాలతో వివాదాస్పదం కావడంతో వెంటనే పనులు మొదలుపెట్టక తప్పదని మంత్రి ఆదేశించారు. అయితే ఆ స్థలంలో కాకుండా మరోచోట నిర్మాణం చేపట్టాలని ఆదేశించటం విశేషం.  ఆలయ పునర్నిర్మాణానికి సిద్ధం చేసిన స్థలానికి బదులు మరో చోట ప్రభుత్వ భూమిని సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో వెంకటాపురం తహసీల్దార్ రంగంలోకి దిగి రామానుజాపురానికి 5 కి.మీ. దూరంలో 30 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించారు. దాన్ని పురావస్తుశాఖ డిప్యూటీ డెరైక్టర్ రహీంషా అలీ, ఆ శాఖ వరంగల్ ఏడీ ప్రేమ్‌సాగర్‌లు పరిశీలించారు. అందులోనే ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పురావస్తుశాఖకు స్వాధీనం చేయనున్నట్టు సమాచారం.



 మళ్లీ కొత్త ఖర్చు..

 గతంలో గ్రామంలో ఆలయపునర్నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి చదును చేశారు. ఆలయం నుంచి విప్పతీసిన శిల్పాలు, రాళ్లను ఇక్కడికి తరలించారు. కాగా, ఇప్పుడు కొత్తగా గుర్తించిన స్థలం గుట్టప్రాంతం కావటంతో దాన్ని మళ్లీ చదును చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి మళ్లీ భారీగా వ్యయం చేయాల్సి ఉంటుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top