ని‘వేదన’లే..! డబ్బులు గుంజుతున్న అధికార పార్టీ నేతలు | Land issues across Andhra Pradesh encroachments by TDP leaders | Sakshi
Sakshi News home page

ని‘వేదన’లే..! డబ్బులు గుంజుతున్న అధికార పార్టీ నేతలు

Aug 27 2025 5:14 AM | Updated on Aug 27 2025 5:21 AM

Land issues across Andhra Pradesh encroachments by TDP leaders

పరిష్కారం లేదు.. సీఎం స్వీకరించిన ఫిర్యాదులకే దిక్కులేదు 

రెవెన్యూలో పేరుకుపోతున్న భూముల విజ్ఞాపనలు

కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువు  

‘పీజీఆర్‌ఎస్‌’లో 80 శాతం ఫిర్యాదులు భూ సమస్యలపైనే 

90 శాతం పరిష్కరించేసినట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు 

అదే నిజమైతే అవే అర్జీలతో బాధితులు మళ్లీమళ్లీ ఎందుకొస్తున్నట్లు? 

బ్రోకర్ల అవతారం ఎత్తి డబ్బులు గుంజుతున్న అధికార పార్టీ నేతలు  

ప్రతి సోమవారం కలెక్టరేట్లు సహా అన్ని చోట్లా మొక్కుబడి తంతుగా గ్రీవెన్స్‌ డే  

సమస్య తీర్చకుండానే పరిష్కారమైపోయినట్లు మెసేజ్‌లు..

బాపట్ల జిల్లా చీరాల ఈపూరుపాలేనికి చెందిన పిట్టు నాగేశ్వరమ్మ, పిట్టు వెంకట్రావులకు సర్వే నెంబర్‌ 746–2లో  1.55 ఎకరాలు, సర్వే నెంబర్‌ 746–3లో 1.46 ఎకరాల భూమి ఉంది. కొనుగోలు ద్వారా సంక్రమించిన ఈ భూమిని ప్రభుత్వం ఇటీవల జీరో (ఎవరికీ చెందనిది) ఖాతాలో చేర్చడంతో తహసీల్దార్, కలెక్టరేట్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇంతకాలం సక్రమంగానే ఉన్న తమ భూమి రికార్డులు మార్చడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అవసరానికి అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు.    

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పాపిశెట్టిపల్లిలో టీడీపీ నేతల అండదండలతో గ్రామ కంఠం భూములను ఆక్రమించడంపై గ్రామస్థులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకు తమపై దౌర్జన్యానికి తెగబడుతున్నారని, తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు.   

ఈనాం భూమిగా నమోదుతో.. 
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గొండుపాలెం గ్రామం సర్వే నెంబర్లు 340/1, 340/2, 3లో మొత్తం 82 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. రీ సర్వే తర్వాత ఎల్‌పీఎం నెంబర్లు ఇచ్చినప్పుడు 340/2, 3 సర్వే నెంబర్లలో ఉన్న రెండు సెంట్ల భూమిని సర్వీస్‌ ఈనాంగా తప్పుగా నమోదు చేశారు. దీంతో మొత్తం భూమంతా సర్వీస్‌ ఈనాంగా రికార్డుల్లో నమోదు కావడంతో ఫ్రీ హోల్డ్‌ చేసినట్లు చూపారు. ఇప్పుడు ఫ్రీ హోల్డ్‌ భూములన్నింటినీ కూటమి ప్రభుత్వం 22 ఏ జాబితాలో పెట్టేసింది. దీంతో భూ యజమాని అమ్ముదామంటే రిజిస్ట్రేషన్‌ జరగడం లేదు. 

ఫ్రీహోల్డ్‌గా తప్పుగా పేర్కొన్న 2 సెంట్లను మినహాయించి మిగిలిన 80 సెంట్ల జిరాయితీ భూమిని ఆంక్షల జాబితా నుంచి తొలగించాలని ఏడాదిగా బాధిత రైతు వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తహసీల్దార్‌ నుంచి సీసీఎల్‌ఏ,  స్థానిక ఎమ్మెల్యేకు దీనిపై ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం కాలేదు. పీజీఆర్‌ఆర్‌ఎస్‌లో అర్జీ పెట్టుకున్నా స్పందన లేదు. ఫ్రీహోల్డ్‌ భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ దీనిపై ఏమీ చేయలేమని సీసీఎల్‌ఏ అధికారులు చేతులెత్తేశారు.   

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు స్వయంగా తమ ఫిర్యాదును తీసుకున్నారంటే ఇక ఆ సమస్య కచ్చితంగా పరిష్కారమైనట్లేనని అర్జీదారులు కొండంత భరోసా పెట్టుకుంటారు! మరి అవే బుట్టదాఖలవుతున్నాయంటే ఇక సామాన్యుల గోడు తీర్చెదెవరు? రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలు, టీడీపీ నేతల ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులతో ప్రభుత్వ పెద్దలే ముఖం చాటేస్తే ఇక బాధితులకు న్యాయం చేసేదెవరు? రాష్ట్రంలో భూములకు సంబంధించిన ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. 

వెల్లువలా వస్తున్న అర్జీలపై ఆరా తీయకుండానే పరిష్కరించేసినట్లు ప్రభుత్వం ప్రకటించుకోవడంపై బాధితులు నివ్వెరపోతున్నారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్లలో భూములకు సంబంధించి లక్షలాది ఫిర్యాదులు వస్తున్నా ఒక్కటీ పరిష్కారానికి నోచుకోవడంలేదు. భూ సమస్య అంటేనే అధికారులు దాన్నో పెద్ద భూతంగా, సివిల్‌ పంచాయితీగా చూస్తుండడంతో భూ యజమానులు దిక్కు తోచక దళారుల బారిన పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు బ్రోకర్ల అవతారం ఎత్తి పనులు చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్నారు. 

గ్రామ, మండల స్థాయిలో పరిష్కరించే సమస్యలను సైతం రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యేనో, అధికార పార్టీ నేతలో పురమాయిస్తే గానీ వినతిపత్రాలు సైతం తీసుకోవడంలేదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లు సహా అన్ని కార్యాలయాల్లో జరుగుతున్న గ్రీవెన్స్‌ డే (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌) కేవలం మొక్కుబడి తంతుగా ముగుస్తోంది. అధికారులంతా విందు భోజనానికి వచ్చినట్లు కూర్చుని రశీదులు ఇప్పిస్తున్నారు. 

కొద్ది రోజుల తర్వాత సమస్య పరిష్కారమైపోయినట్లు బాధితులకు మెసేజ్‌లు రావడంతో విస్తుపోతున్నారు. వాస్తవానికి సమస్య అలాగే ఉంటోంది. అధికారులు మాత్రం అది ముగిసిపోయినట్లు నివేదిక ఇచ్చేస్తున్నారు. దీంతో బాధితులు ఎప్పటి మాదిరిగానే కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కలెక్టరేట్లు, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ సమస్యలు పరిష్కారం కాని రైతులు, భూ యజమానులు, బాధితులు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. 

రికార్డుల్లో తప్పులు.. రైతులకు శాపాలు  
పలు చోట్ల భూమి ఒకరి పేరు మీద ఉంటే పట్టాదారు పాస్‌బుక్‌ ఇతరుల పేరు మీద రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పట్టాదారుల పేర్లలో తప్పులు, సర్వే లేదా ఎల్‌పీఎం నెంబర్లలో తప్పులు, భూమి స్వభావంలో తప్పులు లాంటి వాటికైతే లెక్కే లేదు. జాయింట్‌ ఎల్‌పీఎంల సమస్య ఇటీవల తీవ్రం కావడంతో సబ్‌ డివిజన్ల ద్వారా చక్కదిద్దకుండా సబ్‌ డివిజన్‌ చేసుకుంటే చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.50 నుంచి రూ.550కి ప్రభుత్వం పెంచేసింది. డబ్బులు కట్టకపోతే సబ్‌ డివిజన్‌ జరగడంలేదు. ఇలా రెవెన్యూలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చేయడంలేదు.  

చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద తమ ఆవేదనను వెల్లడిస్తున్న చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం పాపిశెట్టిపల్లి గ్రామస్తులు  

సీఎం స్వయంగా తీసుకున్నా అంతే..!
‘పీజీఆర్‌ఎస్‌’కు వచ్చే ఫిర్యాదుల్లో 80 శాతం భూ సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబే చాలాసార్లు వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో వారంలో రెండు మూడు రోజులు బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకుంటుండగా అందులో 70 నుంచి 80 శాతం భూముల సమస్యలే ఉంటున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌, రెవెన్యూ శాఖ మంత్రి, ఇతర మంత్రులు తీసుకున్న వినతిపత్రాలు సైతం పరిష్కారానికి నోచుకోవడంలేదు. 

కొద్దిరోజుల క్రితం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించి ఐదు వేల వినతులు వచ్చినట్లు ప్రకటించారు. కానీ అందులో పది శాతం కూడా పరిష్కారం కాలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కుప్పలు తెప్పలుగా వస్తున్న అర్జీలను చూసి సీఎం వాటిని తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తానని చెప్పి రాకుండా ముఖం చాటేస్తున్నారు. 

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12 లక్షలు అర్జీలు అందగా అందులో మెజారిటీ రెవెన్యూ శాఖకు సంబంధించినవే. భూముల సమస్యల్లో దాదాపు అన్నింటినీ పరిష్కరించేసినట్లు ఇటీవల రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే అంతకుముందు 15 రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రంగా పక్షం రోజుల్లోనే అవన్నీ పరిష్కారమైపోయినట్లు ప్రకటించేశారు.  

తిరగలేక విసిగిపోయా
ఎన్టీఆర్‌ జిల్లా విసన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో 131/1ఏ, 132/ 2ఏ సర్వే నంబర్లలో నాకు 3.04 ఎకరాల భూమి ఉంది. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసు పుస్తకాలున్నాయి. నా భూమిలో 0.44 సెంట్లను ఇతరులు ఆక్రమించుకుని కంచె వేశారు. కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి ఆరు సార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. తహశీల్దార్‌  కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయా.   
    – మేడా సత్యనారాయణ

70 ఏళ్ల వయసులో నాకేంటీ తిప్పలు 
1993లో ప్రభుత్వం 40 సెంట్ల భూమిని నా భార్య కొల్లి చిట్టమ్మ పేరుతో ఇచ్చింది. నా భార్య చనిపోవడంతో ఆ భూమికి నా పేరుతో పాస్‌బుక్‌ ఇవ్వాలని కాళ్లరిగేలా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్‌లో రెండుసార్లు అర్జీ ఇచ్చా. 70 ఏళ్ల వయసులో తిప్పలు పడి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. 
    – కొల్లి ప్రకాశం, నాగంపల్లి, సీతానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా

కాళ్లు అరిగేలా తిరుగుతున్నా.. 
నాకు ఐదు ఎకరాల పొలం ఉండగా 2.47 ఎకరాలను రజని అనే వ్యక్తికి విక్రయించా. అనంతరం అతడి నుంచి దాన్ని కొనుగోలు చేసిన పాండు మొత్తం భూమి తనదేనంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. నాకు న్యాయం చేయమని భూమి పత్రాలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా. సర్వే చేయాలని మొర పెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోవడం పోలేదు.  
    – రామచంద్రనాయుడు, ఊటుకూరు గ్రామం, రాజంపేట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement