‘మదర్’ను నడిపించాడు.. రికార్డు సృష్టించాడు.. | 'Mother' led to record .. .. | Sakshi
Sakshi News home page

‘మదర్’ను నడిపించాడు.. రికార్డు సృష్టించాడు..

Aug 20 2015 12:28 AM | Updated on Aug 21 2018 2:34 PM

‘మదర్’ను నడిపించాడు.. రికార్డు సృష్టించాడు.. - Sakshi

‘మదర్’ను నడిపించాడు.. రికార్డు సృష్టించాడు..

టీనేజర్ అంటే కొండంత ఆవేశం, కాసింత ఆలోచన, పిసరంత ఆచరణ..

టీనేజీ కుర్రాడి కృషికి ‘గిన్నిస్’ గుర్తింపు
లక్షల మందితో ‘రక్తనిధి’ ఏర్పాటు
 

టీనేజర్ అంటే కొండంత ఆవేశం, కాసింత ఆలోచన, పిసరంత ఆచరణ.. అన్నట్టు మారిపోయిన సమకాలీన పరిస్థితుల్లో.. కొండంత ఆశయాన్ని తోడు చేసుకుని సాగిపోతున్నాడు ఓ కుర్రాడు. తోటి కుర్రాళ్లతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసే వయసులో సమాజానికి తనవంతు సాయం చేసేందుకు యజ్ఞం చేస్తున్నాడు. ఇందులో గిన్నిస్ రికార్డును సైతం అందుకున్నాడు. ఆ కుర్రాడి పేరు సాయి ఆకాశ్. చేస్తున్న యజ్ఞం అత్యవసర పరిస్థితిలో రక్తం దొరక్క అల్లాడుతున్న వారికోసం రక్త నిధిని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫిట్‌జీ స్కూల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్నవిజయవాడకు చెందిన ఆకాశ్ (17) గిన్నిస్ రికార్డ్ గుర్తింపు వెనుక అలుపెరగని
కృషి ఉంది.     - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
 
 
కలాం ఫ్లాగ్ ఆఫ్ నుంచి గిన్నిస్ రికార్డ్ దాకా..

మృత్యుముఖంలో ఉన్న స్నేహితుడిని బతికించుకునేందుకు రక్తం కోసం పడిన కష్టం మరో యువకుడిలో అయితే వ్యవస్థ మీద ద్వేషాన్ని పెంచేదేమో. కానీ ఆకాశ్‌ని వ్యవస్థకు ఉపకరించే పటిష్టమైన రక్తనిధిని ఏర్పాటు చేసేందుకు పురికొల్పింది. ‘స్నేహితుడు శశాంక్ ప్రమాదానికి గురై చావు బతుకుల్లో ఉన్నప్పుడు రక్తం విలువ తెలిసింది. కొద్దో గొప్పో స్థాయి ఉన్నవాళ్లకి సైతం అదెంత ప్రియంగా మారిందో అర్థమైంది. అప్పుడే నా ఆచరణకు బీజం పడింది’ అంటూ గుర్తు చేసుకుంటాడు ఆకాశ్. ‘నా ఆలోచన చెప్పగానే నాన్న (ఎం.కె.గుప్తా) శభాష్ అంటూ ప్రోత్సహించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వయంగా వచ్చి నా ‘మదర్ బ్లడ్ బ్యాంక్’ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు’ అంటూ వివరించాడు ఆకాశ్. వెబ్‌సైట్ ప్రారంభించే నాటికి ఈ కుర్రాడి వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అంతేకాదు హైస్కూల్ రోజుల్లోనే ‘ఆసమ్ కంప్యూటెక్’ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించిన ఘనతను కూడా దక్కించుకున్నాడు.
 
రెండు లక్షల మంది రక్తదాతలు..

ప్రస్తుతం ఆకాశ్ ప్రారంభించిన వెబ్‌సైట్ ఠీఠీఠీ.ఝ్టౌజ్ఛిటఛౌౌఛీఛ్చజు.ఛిౌఝలో దాదాపు 2 లక్షల మంది రక్తదాతల వివరాలు నమోదయ్యాయి. ‘రక్తదానంపై యువతకు అవగాహన పెంచేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాం. తద్వారా పెద్ద సంఖ్యలో సభ్యుల్ని చేర్పించగలిగాం’ అని చెప్పాడు ఆకాశ్. గత ఏప్రిల్ 21 నుంచి విజయవాడ మొదలు ఢిల్లీ, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, కోయంబత్తూరు వంటి నగరాల్లో నెల రోజలు పాటు నిర్విరామంగా ఈ కుర్రాడు 102 అవగాహన శిబిరాలను నిర్వహించాడు. వీటి ద్వారా 1,02,015 మందిని రక్తనిధిలో భాగస్వాములను చేసి గిన్నిస్ రికార్డ్ సాధించి అంతకు ముందు 61,902 మందితో ఉన్న రికార్డును చెరిపేశాడు. ‘మా టెక్నికల్ టీమ్, ఫ్రెండ్స్, బంధువులు, ఇంకా ఎందరో ఈ మార్గంలో నాకు చేయూత నిచ్చారు. ఇదంతా రికార్డుల కోసం చేసింది కాదు. రియల్ నీడ్‌ని అటెంప్ట్ చేశాం. దేశంలో రక్త నిధి కొరత తీరే వరకూ మా కృషి కొనసాగుతుంది’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడీ కుర్రాడు. ‘మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు మాత్రమే నేను హెల్ప్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నన్ను ఆర్థికంగా ఎటువంటి హెల్ప్ తను అడగలేదు.. నేను ఇవ్వలేదు’ అంటూ విద్యావేత్తగా పేరున్న ఆకాశ్ తండ్రి గుప్తా గర్వంగా చెబుతున్నారు. ‘ఒక కంపెనీ సీఈఓగా ఆకాశ్‌ను చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో.. అంతకు మించిన ఆనందం ఈ మదర్ బ్లడ్ బ్యాంక్ క్రియేటర్‌గా తనని గుర్తించినపుడు కలిగింది’ అంటారు ఆకాశ్ తల్లి లక్ష్మి. రక్తం అవసరమైన ఎవరైనా సరే ఈ ఆన్‌లైన్ బ్లడ్ బ్యాంక్‌లోకి లాగిన్ అయి వారికి సమీపంలోని రక్తదాతల వివరాలు పొందవచ్చునని ఆకాశ్ చెప్పాడు.
 
మోడీ యోగా యాప్..
ఒక గొప్ప ఆలోచనకు అంతకు మించిన గొప్ప ఆచరణను జతచేసి చిన్న వయసులోనే స్ఫూర్తిదాయక విజయాన్ని సొంతం చేసుకున్న ఆకాశ్.. ఇటీవలే ‘మోడీ యోగా’ పేరుతో ఒక యాప్‌ను కూడా రూపొందించాడు. ఇంట్లో సాధన చేసేందుకు అవకాశం ఉన్న 12 రకాల ఆసనాలను, అవి వేసే విధానాన్ని వివరించే ఈ యాప్‌ను గత అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు విడుదల చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement