మరణించిన చెల్లెలిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కోపంతో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఆమె సోదరుడు.
హైదరాబాద్ : మరణించిన చెల్లెలిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కోపంతో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఆమె సోదరుడు. ఈ ఘటన నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ముస్తఫాఖాన్, ఖుద్దూస్లు వరుసకు సోదరులు. వీరిద్దరి గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. కాగా ముస్తఫా ఖాన్ సోదరి గతేడాది దుబాయిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఆస్తి తగాదాల మధ్యలో చెల్లెలి ఆత్మహత్య విషయంపై ఖుద్దూస్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కోపోద్రిక్తుడైన ముస్తఫాఖాన్.. సోదరుడైన ఖుద్దూస్ పై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.