వైఎస్సార్‌సీపీ గూటికి కాసు మహేశ్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ గూటికి కాసు మహేశ్‌రెడ్డి - Sakshi


- పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో భేటీ

- ఈ నెల 16న పార్టీలో చేరిక

 

 సాక్షి, అమరావతి బ్యూరో/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు, కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి మహేశ్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఎలాంటి షరతులు లేకుండా తాను పార్టీలో చేరాలనుకుంటున్నట్లు వివరించారు. కలిసి పని చేద్దాం, పార్టీలోకి రండి అని వైఎస్ జగన్ ఆహ్వానించారని తెలిపారు. తన తండ్రి కాసు కృష్ణారెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి సుదీర్ఘకాలంపాటు ఒకే సిద్ధాంతం కోసం పోరాడారన్నారు. తాను కూడా జగన్‌తో కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. నరసరావుపేటలో ఈ నెల 16న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు ప్రకటించారు.


కాసు మహేశ్‌రెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినట్లు మర్రి రాజశేఖర్ తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గలిగిన కాసు కుటుంబం వైఎస్సార్‌సీపీలో చేరడం పార్టీకి రాష్ట్రంలో ఊపునిస్తుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అందరం కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. మహేశ్ చేరిక జిల్లాలో పార్టీ బలోపేతం కావడానికి తోడ్పడుతుందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కలిసి మెలిసి పని చేయడానికి తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. మహేశ్‌రెడ్డి చేరికను ఆహ్వానిస్తున్నట్లు జంగా కృష్ణమూర్తి చెప్పారు. మహేశ్‌రెడ్డి 2004 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో తన తండ్రి కాసు కృష్ణారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top