భార్య అలా ప్రవర్తించడం చూడలేక... | Husband commits suicide and write suicide note in alleged wife behaviour | Sakshi
Sakshi News home page

భార్య అలా ప్రవర్తించడం చూడలేక...

Mar 23 2016 7:19 PM | Updated on Nov 6 2018 8:22 PM

భార్య అలా ప్రవర్తించడం చూడలేక... - Sakshi

భార్య అలా ప్రవర్తించడం చూడలేక...

భార్య ప్రవర్తన బాగలేదని మనోవేదనకు గురైన ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇబ్రహీంపట్నం రూరల్: భార్య ప్రవర్తన బాగలేదని మనోవేదనకు గురైన ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధన్‌లాల్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తోపుచర్లకు చెందిన ఆరెండ్ల కృష్ణారెడ్డి(35), స్రవంతి దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు సరూర్‌నగర్ మండలం మీర్‌పేట్‌లోని ప్రశాంత్‌హిల్స్‌లో ఉంటున్నారు. కృష్ణారెడ్డి ఓ బీమా కంపెనీలో ఏజెంట్. స్రవంతి సోమాజిగూడలో ఉన్న ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. పెళ్లి అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కట్నం కూడా కొంత రావాల్సి ఉందని కృష్ణారెడ్డి భార్యతో తగువులాడుతుండేవాడు. రెండు నెలల క్రితం స్రవంతి చెల్లెలు భర్త మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె వీరి వద్దే ఉంటుంది.

ఈ క్రమంలో గొడవలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, స్రవంతి తన కంపెనీలోని తోటి ఉద్యోగులతో తరచూ ఫోన్‌లో మాట్లాడటం కృష్ణారెడ్డికి నచ్చకపోయేది. ఈ నేపథ్యంలో అతడు గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణారెడ్డి గురువారం ఉదయం ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీ ఎదుట ఉన్న ఓ చెట్టు ఎక్కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కిందికి దించి పరిశీలించగా అతడి ప్యాంట్ జేబులో ఓ సూసైడ్ నోట్ లభించింది. దాని ద్వారా పైవివరాలు తెలిశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణారెడ్డి, భార్య, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement