పోలీస్.. పవర్‌ఫుల్‌..!

Huge allocations to the Police Department in budget - Sakshi

బడ్జెట్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట

పోలీసు విభాగానికి భారీ కేటాయింపులు

ప్రగతి పద్దు కింద రూ. 1,389.66కోట్లు

నిర్వహణ పద్దు కింద రూ. 4,400.68 కోట్లు

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేసిన ప్రభుత్వం హోంశాఖలో పోలీస్‌ విభాగానికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ప్రగతి పద్దు కింద రూ.1,389 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.975.95 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద ఈ ఏడాది రూ.4,400.68 కోట్లు కేటాయించగా, గత ఏడాది రూ.3,852.21 కోట్లు కేటాయించింది.కొత్త జిల్లాల్లో పోలీస్‌ కార్యాలయాలు, ఠాణాల నిర్మాణం, హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ మూడో దఫా నిధులు, ప్రతీ జిల్లాలో సిబ్బందికి క్వార్టర్లు, ట్రైనింగ్‌ సెంటర్లు, రాష్ట్ర పోలీస్‌ అకాడమీ ఆధునీకరణ, హోంగార్డుల జీతభత్యాలు, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, సైనిక్‌ వెల్ఫేర్‌ తదితర విభాగాలకు సముచిత స్థానం కల్పిస్తూ నిధులు కేటా యించింది.    – సాక్షి, హైదరాబాద్‌

‘హైదరాబాద్‌’కే అగ్ర తాంబూలం..
రాష్ట్ర పోలీస్‌ శాఖకు కేటాయించిన మొత్తం ప్రగతి బడ్జెట్‌లో రూ.574 కోట్లు హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌ కోసమే కేటాయించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణానికి ఇందులో నుంచి రూ.280 కోట్లు కేటాయించా రు.

ఐటీ బ్యాక్‌బోన్‌ సపోర్ట్, సీక్రెట్‌ సర్వీస్‌ ఫండ్, గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలు, రంజాన్, బక్రీద్, బతుకమ్మ, దసరా తదితర పండగల బందోబస్తుకు రూ.10 కోట్ల మేర నిధులు ఇచ్చారు. స్టాఫ్‌ క్వార్టర్స్, కార్యాలయాలు, నూతన పోలీస్‌ స్టేషన్ల నిర్మాణానికి రూ.40 కోట్లు ప్రగతి పద్దులో ప్రభుత్వం కేటాయించింది. డీజీపీకి గత ఏడాది రూ.304 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది దానిని 98 శాతం పెంచుతూ రూ.604.86 కోట్లు కేటాయించింది.

కొత్త జిల్లాల కార్యాలయాలకు రూ.400 కోట్లు
కొత్త జిల్లాల్లో పోలీస్‌ హెడ్‌ క్వార్టర్ల నిర్మాణానికి ప్రగతి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ఒక్కో జిల్లాకు రూ.20 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇచ్చింది. వరంగల్‌ కమిషనరేట్‌ నిర్మాణానికి మూడో దఫా రూ.20 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కమ్యూనికేషన్స్, నెట్‌వర్క్‌ టెక్నాలజీ కోసం రూ.50 కోట్లు కేటాయించింది.

అన్ని జిల్లాల్లో శిథిలావస్థలో ఉన్న పోలీస్‌ స్టేషన్లకు నూతన భవనాల కోసం రూ.40 కోట్లు, డీజీపీ అకౌంట్‌ కింద సీక్రెట్‌ ఫండ్‌కు రూ.3.22 కోట్లు ఇచ్చింది. పలు జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు కాబోతున్న అగ్నిమాపక కేంద్రాల కోసం రూ.8.9 కోట్లు ప్రగతి బడ్జెట్‌లో కేటాయించగా, పక్కా భవనాలు లేని అగ్నిమాపక కేంద్రాలు, శిథిలావస్థలో ఉన్న కేంద్రాలకు నూతన భవనాలకు రూ.4.33 కోట్లు కేటాయించింది.

ఇంటెలిజెన్స్‌కు రూ. 36.67 కోట్లు
రాష్ట్రానికి కీలక విభాగమైన ఇంటెలిజెన్స్‌కు ప్రగతి పద్దులో తగినన్ని నిధులు కేటాయించింది. మొత్తం రూ.36.67 కోట్లు కేటాయించగా, అందులో ప్రధానంగా అంతర్గత భద్రతకు కావల్సిన ఆయుధాలు తదితర సామగ్రికి రూ.2 కోట్లు ఇచ్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అత్యాధునిక సౌకర్యాల కల్పనకు రూ.6.19 కోట్లు ఇచ్చింది. కేంద్రం నుంచి ఏటా అందే మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్, ఎల్‌డబ్ల్యూఈ(లెఫ్ట్‌ వింగ్‌ ఎక్స్‌ట్రీమిజం) నిధుల కింద రాష్ట్ర వాటాగా ఈ ఏడాది రూ.114.80 కోట్లు కేటాయించింది.

ప్రభుత్వం తోడ్పాటుతో ముందుకెళతాం..
పోలీస్‌ శాఖపై నమ్మకం ఉంచిన రాష్ట్ర సర్కార్‌ గతేడాదికంటే రెట్టింపు బడ్జెట్‌ కేటాయించింది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్త జిల్లాల్లోనూ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు మరింత చేరువగా పోలీస్‌ సేవలందించేందుకు ఈ బడ్జెట్‌ ఎంతో దోహదపడుతుంది.

హైదరాబాద్‌ కమిషనరేట్‌లో చేపట్టిన వినూత్న పద్ధతులను జిల్లాల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రతీ పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్లు ఏర్పాటు చేసి బాధితులకు ఠాణా అంటే భయం లేకుండా స్నేహపూర్వక వాతావరణం సృష్టిస్తాం. సీసీటీవీలు, కమాండ్‌ సెంటర్లు, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ ఇలా అన్ని అమలు చేస్తాం. ప్రభుత్వం సహకారంతో ఈ ఏడాది కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం.     – డీజీపీ మహేందర్‌రెడ్డి  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top