రైతు కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుత్తా!

Gutta Sukendar Reddy as chairmen of Farmers Corporation - Sakshi

ఆయన పేరు ఖరారైందంటున్న ప్రభుత్వ వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో ఏర్పాటు కానున్న రాష్ట్ర రైతు కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన నియామకానికి సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని తెలుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున నల్లగొండ ఎంపీగా ఎన్నికైన గుత్తా 2016లో టీఆర్‌ఎస్‌లో చేర డంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.

దీంతో రైతు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కోసం ఆయన పేరు కొన్ని నెలలుగా ప్రచారంలోనే ఉన్నా సర్కారు సందిగ్ధంలో పడింది. చివరకు దీనిపై ప్రభుత్వం అడ్వొకేట్‌ జనరల్‌ అభిప్రాయం కోరగా ఆయన రెండు పదవులు నిర్వహించడానికి ఇబ్బందులు లేవనీ, రెండూ లాభదాయకమైనవైతేనే సమస్య తలెత్తుతుందని వివరించారు.

ఎంపీగా గుత్తా వేతనం తీసుకుంటున్నప్పుడు కార్పొరేషన్‌ చైర్మన్‌గా కూడా వేతనం తీసుకుంటేనే సమస్య ఎదురవుతుందని, లేకుంటే జోడు పదవులు నిర్వహించడానికి న్యాయపరమైన చిక్కులేవీ ఉండవని అడ్వకేట్‌ జనరల్‌ చెప్పినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. దీంతో గుత్తా ఎంపీ పదవికి రాజీ నామా చేయకుండానే రైతు కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి మార్గం సుగమమైనట్లేనని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

ఈ నెలలోనే కార్పొరేషన్‌ ఏర్పాటు...
రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఇప్పించడం, అవసరమైతే కొనుగోలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సమితులను ఏర్పాటు చేస్తోంది.

ఇప్పటివరకు గ్రామ, మండల రైతు   çసమితుల ఏర్పాటు ప్రక్రియ ముగిసింది. జిల్లా సమితులనూ ఏర్పాటు చేశాక సీఎం రాష్ట్ర రైతు సమితిని నియమిస్తారు. దాన్ని కార్పొరేషన్‌గా ప్రకటిస్తారు. దీనికి రైతు అభివృద్ధి సంస్థ అనే పేరు పరిశీలనలో ఉంది. ఆ సంస్థను రిజిస్టర్‌ చేసి చైర్మన్‌ను నియమిస్తారు. ఈ నెలాఖరులోగా రైతు కార్పొరేషన్‌ ఏర్పాటవుతుందని చెబుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top