బ్యాంకుల తీరుపై సర్కారు అసంతృప్తి

Government dissatisfied on banks' style - Sakshi

     గత ఖరీఫ్‌లో 10 జిల్లాల్లో రైతులకు 65 శాతంలోపే పంటరుణాలు 

     రబీలో పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు వ్యవసాయశాఖ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: పంటరుణాల మంజూరులో బ్యాంకర్ల తీరుపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రుణ లక్ష్యానికి అనుగుణంగా రైతులకు రుణాలివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత ఖరీఫ్‌ పంటల రుణ ప్రణాళిక లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా, బ్యాంకులు రూ.21,025 కోట్లు మాత్రమే ఇచ్చాయి. లక్ష్యంలో 88 శాతం రుణాలిచ్చాయి. రుణాలను సకాలంలో ఇవ్వకపోవడమే కాకుండా ఆయా జిల్లాల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. దీనిపై ప్రజాపద్దుల కమిటీ సమావేశంలో వ్యవసాయశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా బ్యాంకర్ల కమిటీలు, జిల్లాస్థాయి రుణ సమీక్ష కమిటీల సమావేశాలు నిత్యం జరగకపోవడం వల్లే ఈ వ్యత్యాసముందని భావించింది. ఆయా కమిటీల సమావేశాలు సక్రమంగా జరపాలని, రబీలో మార్పు తీసుకురావాలని కోరుతూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు.  

10 జిల్లాల్లో 65 శాతం లోపే 
పెద్దపల్లి జిల్లాలో రైతులకు కేవలం 48 శాతం రుణాలిచ్చాయి. ఆ జిల్లా ఖరీఫ్‌ పంటరుణ లక్ష్యం రూ.638 కోట్లు కాగా, రూ.308 కోట్లు మాత్రమే అందజేశాయి. 10 జిల్లాల్లో కేవలం 65 శాతం రుణాలే ఇచ్చారు. మంచిర్యాల జిల్లా 50, వనపర్తి 53, నిజామాబాద్‌ 54, కొమురంభీం 55, జయశంకర్‌ 56, మహబూబ్‌నగర్‌ 58, జోగులాంబ 63, జగిత్యాల, వికారాబాద్‌ జిల్లాలు 64 శాతం చొప్పున రుణాలిచ్చాయి. ఇంత తక్కువ రుణాలివ్వడానికి అధికారులకు, బ్యాంకర్లకు మధ్య సమన్వయలోపమే కారణ మని వ్యవసాయశాఖ అంచనా వేసింది.

మరో పది జిల్లా ల్లో బ్యాంకులు 100 శాతానికిపైగా రుణాలిచ్చి రికార్డు సృష్టించాయి. మేడ్చల్‌ జిల్లాలో 172, భద్రాద్రి జిల్లాలో 162, రంగారెడ్డి 136, యాదాద్రి 134, మహబూబాబాద్‌ 132, రాజన్న సిరిసిల్ల 128, మెదక్‌ 125, కరీంనగర్‌ 117, ఖమ్మం జిల్లాలో 110 శాతం చొప్పున పంటరుణాలు అందించాయి. దీర్ఘకాలిక రుణాలు 25 శాతమే ఇవ్వడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపైనా దృష్టి సారించాలని వ్యవసాయశాఖ కలెక్టర్లను కోరింది.   

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top