నయీమ్ చుట్టూ ‘గడాఫీ’ సైన్యం!

రిమాండ్ కు తరలిస్తున్న నయీం ఇంట్లోని మహిళలు - Sakshi


* ఆడవాళ్లే రక్షణ కవచాలు.. డెన్ల రక్షణ బాధ్యతలూ వారికే

* ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు




సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో లిబియాకు నియంత గడాఫీని మించిపోయాడు. గడాఫీ తరహాలో తనకు రక్షణ కవచంగా మహిళలను, యువతులను ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆయుధాల వినియోగంలోనూ శిక్షణ ఇప్పించాడు. అవసరమైన సందర్భాల్లో వారిని ‘ఎర’లుగానూ వినియోగించుకున్నాడు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు మహిళల విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నయీమ్ ఇంట్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఫర్హానా వంట మనిషిగా పనిచేస్తోంది.



అదే పట్టణానికి చెందిన అమీర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య అఫ్సానా అలియాస్ ఇన్షియాద్ నయీమ్ ఇంట్లోనే ఉండేది. వారిద్దరూ నయీమ్‌కు నమ్మినబంట్లు కావడంతో సెల్ఫ్ డిఫెన్స్, తుపాకులు కాల్చడంలో శిక్షణ ఇచ్చాడు. వారికి అత్యాధునిక పిస్టళ్లు, తూటాలు అందజేసి.. భార్య, పిల్లలతో పాటు ఇంటి వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించాడు. ఆయుధాలతో పాటు స్థలాల డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, నగదును కూడా వారి సమక్షంలోనే ఇంట్లోనే దాచేవాడు. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు దాడి చేసిన సమయంలో ఫర్హానా, అఫ్సానా పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. హ్యాండ్ బ్యాగుల్లో పిస్టళ్లు, తూటాలు దొరికాయి.

 

ఆశ్రయం కల్పిస్తామని తీసుకువచ్చి..

నయీమ్ నల్లగొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, తండాల నుంచి ఆడపిల్లల్ని డబ్బు చెల్లించి తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారితో పాటు చిన్న వయసులోనే భర్త చనిపోయిన, అనాథలుగా మారిన వారిని కూడా ఆశ్రయం కల్పిస్తామంటూ తీసుకువచ్చి కొందరు బంధువులు నయీమ్‌కు అప్పగిస్తున్నారని తెలిసింది. సోమవారం నయీమ్ ఇంట్లో పట్టుబడిన ఐదుగురు ఆడపిల్లలూ ఇలానే అక్కడికి చేరి ఉంటారని భావిస్తున్నారు. సెటిల్‌మెంట్ల కోసంగానీ, మరెక్కడికైనాగానీ వెళ్లేటపుడు మహిళలు, యువతులను తీసుకెళ్లేవాడు.



అలాగైతే ఎవరో కుటుంబం మొత్తం ప్రయాణిస్తున్నట్లు పోలీసులు భావిస్తారని.. తనిఖీలు చేయడానికి వెనకడుగు వేస్తారనే నయీం వ్యూహం. అంతేగాకుండా టార్గెట్ చేసిన వారిని ఆకర్షించడం కోసం యువతుల్ని ఎరగా వేస్తాడని పోలీసులు చెబుతున్నారు. ఇక అల్కాపురిలోని ఇంట్లో ఉన్న వంట గదుల్లో వంట చేసిన ఆనవాళ్లేమీ లేవని పోలీసులు చెబుతున్నారు. నిత్యం హోటళ్ళ నుంచి తెచ్చుకుని తినేవారని.. వంట మనిషిగా చెబుతున్న ఫర్హానాను రక్షణ కోసమే వినియోగించారని పేర్కొంటున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top