ఆదిలాబాద్ మాజీ ఎంపీ మధుసూదన్‌రెడ్డి వుృతి | Ex mp madhusudhan reddy passed away | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ మాజీ ఎంపీ మధుసూదన్‌రెడ్డి వుృతి

Apr 8 2015 12:45 AM | Updated on Jul 11 2019 8:38 PM

ఆదిలాబాద్ మాజీ ఎంపీ టి.మధుసూదన్‌రెడ్డి(71) మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించారు.

రాంగోపాల్‌పేట్ : ఆదిలాబాద్ మాజీ ఎంపీ టి.మధుసూదన్‌రెడ్డి(71) మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఉదయం 11 గంటల సమయంలో బోయిన్‌పల్లిలోని ఆయన నివాసంలో ఉండగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. 12 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. మధుసూదన్‌రెడ్డి ఆదిలాబాద్ ఎంపీగా 2004 నుంచి 2008 వరకు పనిచేశారు. కాగా ఆస్పత్రిలో ఉన్న మధుసూదన్‌రెడ్డి భౌతిక కాయాన్ని మంత్రి హరీశ్‌రావు సందర్శించి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న ఆయన కుమారుడిని ఓదార్చారు.

మధుసూదన్‌రెడ్డి తెలంగాణ మొదటి దశ ఉద్యమంతో పాటు రెండో దశలోనూ కేసీఆర్‌తో ముందుండి నడిచారని హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణకు అనుకూలంగా వివిధ పార్టీల లేఖలు సేకరించడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని కేసీఆర్ పిలుపునివ్వగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజీనామా సమర్పించిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. సమితి ప్రెసిడెంట్‌గా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎంపీగా పనిచేసినా ఆయన ఎప్పుడూ నిరాడంబరంగా ఉండేవారన్నారు.

ఎంపీగా పెద్ద పదవి నిర్వహించినా అటు తర్వాత మళ్లీ న్యాయవాద వృత్తిని స్వీకరించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.  వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆదిలాబాద్‌లో జరిగే ఆయన అంత్యక్రియలకు మంత్రివర్గ సహచరులమంతా హాజరు కానున్నామని తెలిపారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం

ఆదిలాబాద్ మాజీ ఎంపీ మధుసూదన్ రెడ్డి మృతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ పటి ష్టత కోసం పనిచేసిన మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో భాగంగా పదవికి రాజీనామా చేసి నిబద్ధతను చాటుకున్నారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement