జిల్లాలో బర్డ్‌ఫ్లూ దృష్ట్యా మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకందించే కోడిగుడ్డును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం
అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ నిలుపుదల
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో బర్డ్‌ఫ్లూ దృష్ట్యా మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకందించే కోడిగుడ్డును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో వారంలో రెండురోజుల పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఉడికించిన కోడిగుడ్డును అందిస్తున్నారు. అయితే హయత్‌నగర్ మండలం తొర్రూర్ పౌల్ట్రీఫాంలో బర్డ్‌ఫ్లూతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ.. కొద్దిరోజుల పాటు పిల్లలకు కోడిగుడ్డు పంపిణీని నిలిపివేయాలని ఆదేశించింది. కోడిగుడ్డు స్థానంలో అరటి పండు అందించాలని సూచించింది.
ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 2,750 పాఠశాలల్లోనేటి నుంచి కోడిగుడ్డు సరఫరా నిలిచిపోనుంది. అదేవిధంగా జిల్లాలోని 2,793 అంగన్‌వాడీ కేంద్రాల్లో లక్ష మంది చిన్నారులకు, 50 వేల మంది గర్భిణీ స్త్రీలకు ప్రతి రోజు కోడిగుడ్డు సరఫరా చేస్తున్నారు. తాజా పరిస్థితుల నే పథ్యంలో కొన్ని రోజుల వరకు కోడిగుడ్లను కొనుగోలు చేయవద్దని మహిళా,శిశు సంక్షేమ సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు కోడిగుడ్లతో పాటు వారంలో ఒక రోజు చికెన్ అందిస్తుండగా.. తాజాగా ఈ రెండింటిని కొంతకాలం వాయిదా వేసుకోవాలని సంక్షేమశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.