‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి తక్షణ సాయంగా రూ.300 కోట్లు కేటాయించాలని నిర్ణయించాం’.. ఇటీవల ఆర్టీసీ పరిస్థితిని సమీక్షించిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇది.
- సీఎం హామీని పాత బకాయి కింద జమకట్టిన తీరు
- గత నెల ‘తక్షణ సాయంగా రూ.300 కోట్లు’ ప్రకటించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి తక్షణ సాయంగా రూ.300 కోట్లు కేటాయించాలని నిర్ణయించాం’.. ఇటీవల ఆర్టీసీ పరిస్థితిని సమీక్షించిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇది. మెడమీద కత్తిలా వేలాడుతున్న బకాయిలను ఈ మొత్తంతో వెంటనే తీర్చేయొచ్చని ఆశపడ్డ ఆర్టీసీకి అసలు విషయం ఇప్పుడు తెలిసి ఉసూరుమంది. అది ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కాదని, పాత బకాయిని చెల్లించేందుకు ఇచ్చే మొత్తమేనంటూ తాజాగా ఆర్థిక శాఖ తేల్చింది. పైగా ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి ఇవ్వబోమని, విడతల వారీగా ఇస్తామని చెప్పేసరికి ఆర్టీసీ కంగుతింది.
ఇదీ నేపథ్యం..
గతేడాది మే నెలలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను సవరిస్తూ 44% ఫిట్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్టీసీపై వేతన సవరణ భారం పడొద్దన్న ఉద్దేశంతో నెలకు రూ.75 కోట్ల చొప్పున ఈ ఏడాది మార్చి వరకు పది నెలల కాలానికి రూ.750 కోట్లు చెల్లించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రూ.450 కోట్లు చెల్లించిన ప్రభుత్వం మిగతా రూ.300 కోట్లు పెండింగులో పెట్టింది. దీంతో జీతాల చెల్లింపులకు ఇబ్బంది ఏర్పడింది. ఆ మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా ఆర్టీసీ పలుమార్లు కోరినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. గత నెలలో ఆర్టీసీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఆర్టీసీకి తక్షణ సాయం కింద రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో గ్రాంటు రూపంలో ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తుందని ఆర్టీసీ భావించింది. కానీ గతంలో ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిపడ్డ రూ.300 కోట్లు.. సీఎం ప్రకటించిన రూ.300 కోట్లు ఒకటేనని ఆర్థిక శాఖ చెప్పేసరికి కంగుతినటం అధికారుల వంతైంది. పోనీ ఆ మొత్తం ఒకేసారి ఇస్తారనుకుంటే అదీ జరగలేదు. కేవలం రూ.150 కోట్లు మాత్రమే ఇస్తామని పేర్కొంటూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది.