సీఎం సొంత శాఖలో అవినీతి

సీఎం సొంత శాఖలో అవినీతి - Sakshi

  • ముఖ్యమంత్రి సొంత శాఖలో అధికారుల ఇష్టారాజ్యం

  •  పురపాలన, పట్టణాభివృద్ధి శాఖల్లో అక్రమాల జాతర

  •  తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు

  •  11 పురపాలికల్లో నిధుల దుర్వినియోగం

  •  47 మంది అధికారులు, ఉద్యోగుల పాత్ర

  •  కాగ్, స్టేట్ ఆడిట్ శాఖ విచారణల్లో వెల్లడి

  •  అధికారులు, అకౌంటెంట్లు కుమ్మక్కై

  •  కోట్లు స్వాహా.. కొందరిపైనే చర్యలు, కొందరికి మినహాయింపులు

  •  జలమండలిలోనూ కోట్లలో గోల్‌మాల్

  •   సాక్షి, హైదరాబాద్: అవినీతిని సహించేది లేదు.. అక్రమాలకు పాల్పడితే ఎంతటివారైనా వదిలిపెట్టబోం.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తరచుగా చెప్పే మాటలివీ! అయితే సాక్షాత్తూ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలన, పట్టణాభివృద్ధి శాఖలే అవినీతి కంపు కొడుతున్నాయి!! పురపాలికలు, జల మండలిలో జలగలు తిష్టవేశాయి. ప్రజా ధనాన్ని స్వాహా చేస్తున్నాయి. ఈ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతున్నా, స్కాంలు వెలుగు చూస్తున్నా.. సర్కారు మిన్నకుండిపోతోంది. కాగ్, స్టేట్ ఆడిట్ తనిఖీలతో పాటు శాఖాపరమైన విచారణల్లో కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు తేలినా.. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారుల వ్యవహార శైలి కూడా ఇటీవల చర్చనీయాంశమైంది.

     

     అక్రమాల జల మండలి

     హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థను పర్యవేక్షిస్తున్న జల మండలి(హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) అవినీతితో మురికిమయమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై గతంలో జైలు పాలై మళ్లీ పైరవీలతో విధుల్లో చేరిన కొందరు అధికారుల గుప్పిట్లో జల మండలి చిక్కుకుంది. ఇద్దరు అధికారుల మధ్య ఆధిపత్య పోరు ఫలితంగా ఈ సంస్థలో తాజాగా అక్రమాలు బయటకు పొక్కాయి. సంస్థ ఎండీ జగదీశ్వర్ వ్యవహారంపైనా ఆరోపణలు వచ్చాయి. రూ.53.98 కోట్ల అంచనాలతో కొత్త ప్రాజెక్టుల పనుల కోసం ఇటీవల జలమండలి టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమైంది.

     

     ఈ అంచనాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి నర్సింగ్‌రావు రంగంలో దిగి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖతో రహస్య విచారణ జరిపించారు. వాస్తవానికి రూ.37.02 కోట్ల అంచనా విలువ గల పనులకు రూ.53.98 కోట్లతో టెండర్లు పిలిచేందుకు ప్రయత్నించారని, ఏకంగా రూ.16.96 కోట్లను అదనంగా అంచనాల్లో వేశారని ఈ విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇంకా స్పందించ లేదు. ఈ అంచనాలపై టెండర్ కమిటీలోని కొందరు అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పక్కనపెట్టేసి.. ఫైలును సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపించడం గమనార్హం. జల మండలి ఆధ్వర్యంలో ఏటా రూ.3 వేల కోట్లకు పైగా వ్యయంతో పనులు జరుగుతున్నా.. ఎలాంటి తనిఖీలు లేవు. కాగ్, స్టేట్ ఆడిట్ శాఖలు తనిఖీలకు వచ్చినా, రికార్డులను అందించడం లేదు. గత నాలుగేళ్లుగా అంతర్గత ఆడిట్‌ను నిలిపివేశారు.

     

     పురపాలికల్లో ‘కట్ట’ల పాములు..


     పురపాలికల్లో కూడా అవినీతి పెచ్చరిల్లుతోంది. మున్సిపల్ కమిషనర్లు, అకౌంటెంట్లు, ఇతర ఉద్యోగులు కుమ్మక్కై కోట్లాది రూపాయల నిధులను కైంకర్యం చేస్తున్నారు. చివరకు ప్రజల నుంచి వసూలు చేసిన ఆస్తి పన్నులనూ సొంత జేబుల్లో వేసుకుంటున్నారు. కాగ్, స్టేట్ ఆడిట్, శాఖాపరమైన తనిఖీల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో అక్రమాలు వెలుగుచూశాయి. అయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీల్లో జరిగిన అక్రమాలు, ప్రభుత్వ చర్యల వివరాలను ‘సాక్షి’ సేకరించింది. 11 మున్సిపాలిటీల పరిధిలో ఏకంగా 47 మంది అధికారులు, ఉద్యోగులు రూ.5 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలగా, ఇటీవల వారిలో 13 మందిని సస్పెండ్ చేయడంతో పాటు ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మిగిలిన వారిపై చర్యల సంగతిని పక్కనపెట్టేశారు.

     

     అవినీతికి మచ్చుకు కొన్ని..

     - సూర్యాపేటలో జూనియర్ అసిస్టెంట్ జి.దయాకర్ రెడ్డి రూ.23.80లక్షలు, ఎస్సై డి.శ్రీనివాస్ రూ.19,700 స్వాహా చేయగా.. రికవరీతోపాటు వారిపై సస్పెన్షన్ విధించారు.

     - వనపర్తిలో జూనియర్ అసిస్టెంట్ జి.శ్రీనివాసులు రూ.94 వేల అవినీతికి పాల్పడగా రికవరీతో సరిపెట్టారు.

     - నల్లగొండలో ఏకంగా 19 మంది బిల్ కలెక్టర్లు రూ.3.32 కోట్ల ఆస్తి పన్నులను స్వాహా చేసినట్లు తేలినా.. ఇంకా చర్యలు తీసుకోలేదు. రికవరీలు లేవు.

     - సంగారెడ్డిలో గత కమిషనర్లు కేవీవీఆర్ రాజు, వీరారెడ్డి, మేనేజర్ రమేశ్, విక్రమ్‌సింహారెడ్డి, లత తదితరులు రూ.86 లక్షలను దుర్వినియోగం చేశారని కాగ్ బయటపెట్టింది. అక్రమార్కులను తప్పించేందుకు ఏకంగా కాగ్ నివేదికనే తప్పని తేల్చేశారు. నిధులను దారి మళ్లించిన ఆరోపణలపై ముగ్గురిపై కేసు పెట్టి ముగించారు.

     - కామారెడ్డిలో అకౌంటెంట్ కె.లత రూ.3.36 కోట్లు, అటెండర్ జి.భాస్కర్ రూ.5.93 కోట్లు స్వాహా చేయగా.. రికవరీతో సరిపెట్టారు.

     - గజ్వేల్‌లో బిల్ కలెక్టర్ నాగేందర్ రెడ్డి రూ.14.99 కోట్లు కాజేస్తే రికవరీతో సరిపెట్టారు.

     - జగిత్యాలలో ఆర్‌ఓ డి.రాజన్న రూ.9 లక్షల అవినీతికి పాల్పడగా.. సొమ్ము రికవరీ చేసి సస్పెన్షన్ వేటు వేశారు.

     - కొత్తగూడెంలో కేవీ లక్ష్మణ్ రావు, తదితరులు రూ.2 లక్షలకు పైగా దుర్వినియోగం చేయగా.. ఒకరిని సస్పెండ్ చేశారు.

     - జనగాంలో జూనియర్ అసిస్టెంట్ పి.విజయలక్ష్మి రూ.5.99 లక్షలు, యాకుబ్ రూ.56 వేలు, కృష్ణవాస్ రూ.5.51 లక్షలు స్వాహా చేస్తే రికవరీ, సస్పెన్షన్ విధించారు.

     - బెల్లంపల్లిలో ఎన్.రాజ్‌కుమార్ రూ.1.85లక్షలు స్వాహా చేస్తే రికవరీతో సరిపెట్టారు.

     - పాల్వంచలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ గెలాం ముర్తుజా, టీపీబీవో శ్రీనివాసులు, బిల్ కలెక్టర్లు రాములు, సారయ్య, జ్ఞానేశ్వర్, నర్సింహారావులు రూ.3 లక్షలకు పైగా సొమ్ము కాజేయగా.. రికవరీతో సరిపెట్టారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top