గ్రేస్‌ మార్కుల విధానానికి స్వస్తి | Close to Grace Marks policy | Sakshi
Sakshi News home page

గ్రేస్‌ మార్కుల విధానానికి స్వస్తి

Apr 26 2017 12:52 AM | Updated on Sep 5 2017 9:40 AM

పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లలో అదనపు మార్కుల విధానానికి స్వస్తి పలకాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది.

- ఏ రాష్ట్రంలోనూ అమలు చేయొద్దన్న సీబీఎస్‌ఈ
- టెన్త్, ఇంటర్‌లో అదనపు మార్కులు ఇవ్వొద్దని నిర్ణయం
- ఈ విద్యా సంవత్సరం నుంచి గ్రేస్, యాడ్‌స్కోర్, మోడరేషన్‌ బంద్‌


సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లలో అదనపు మార్కుల విధానానికి స్వస్తి పలకాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మోడరేషన్, యాడ్‌ స్కోర్, గ్రేస్‌ మార్కుల పేరుతో ఇస్తున్న అదనపు మార్కులను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయొద్దని నిర్ణయానికి వచ్చింది. ఇటీవల అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికా రులతో సీబీఎస్‌ఈ సమావేశం నిర్వహించగా.. రాష్ట్రం నుంచి ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్, పరీక్షల నియంత్రణాధికారి సుశీల్‌కుమార్, పాఠశాల విద్యా డైరెక్టర్‌ కిషన్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా అదనపు మార్కుల విధానం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని సమావేశంలో దృష్టికి వచ్చింది. ఇంటర్‌తోపాటు ఢిల్లీ, సెంట్రల్‌ వర్సిటీలకు చెందిన కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల్లో మార్కుల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో అదనపు మార్కుల విధానానికి స్వస్తి పలకాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా
పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, కేరళలో కల్చరల్‌ స్పోర్ట్స్‌లో ఉన్న విద్యార్థులకు 10 మార్కుల చొప్పున కలుపుతున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి క్రీడలు ఆడితే, నేషనల్‌ గేమ్స్‌లో పాల్గొంటే కొన్ని మార్కులు కలు పుతున్నారు. మన రాష్ట్రంతోపాటు మరికొన్ని రాష్ట్రా ల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయిన, ప్రశ్నలు కఠినంగా వచ్చిన సందర్భాల్లో ఒకటి, రెండు మార్కులతో పాస్‌ అయ్యే విద్యార్థులకు మార్కులను యాడ్‌ స్కోర్‌గా ఇస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో 3 సెట్ల ప్రశ్నపత్రాలను ఇస్తుండటంతో మార్కుల్లో తేడాలొస్తున్నాయి. ఈ సందర్భాల్లోనూ మోడరేషన్‌ పేరుతో మార్కులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ రకంగానూ మార్కులను అదనంగా ఇవ్వొద్దని అన్ని రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement