బర్డ్‌ఫ్లూతో భయాందోళన వద్దు | Bird flu: Time to worry? | Sakshi
Sakshi News home page

బర్డ్‌ఫ్లూతో భయాందోళన వద్దు

Apr 22 2015 3:50 AM | Updated on Jul 11 2019 5:40 PM

బర్డ్‌ఫ్లూతో భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. చికెన్, గుడ్లు నిర భ్యంతరంగా తినొచ్చని కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు చెప్పారు.

 సాక్షి, హైదరాబాద్: బర్డ్‌ఫ్లూతో భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. చికెన్, గుడ్లు నిర భ్యంతరంగా తినొచ్చని కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు చెప్పారు. మంగళవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కోళ్ల సమాఖ్య అధ్యక్షుడు ఇ.ప్రదీప్‌కుమార్ రావు, కోళ్ల బ్రీడర్స్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి, జాతీయ గుడ్ల పర్యవేక్షణ కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.జి.ఆనంద్, హైదరాబాద్ లేయర్ రైతుల సంఘం అధ్యక్షుడు కె.మోహన్‌రెడ్డి, అఖిల భారత కోళ్ల అభివృద్ధి సేవల జీఎం బాలసుబ్రమణ్యం మాట్లాడారు.
 
  బర్డ్‌ఫ్లూ వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికే కాస్తోకూస్తో సోకే ప్రమాదం ఉందని... అయితే చికెన్ తిన్నవారికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ రంజిత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ వైరస్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్దే చనిపోతుందన్నారు. మన దేశంలో గుడ్లు, చికెన్ వంటకాలను 100 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికిస్తామని... అందువల్ల బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్న చికెన్ తిన్నా ఏమాత్రం ప్రమాదం ఉండదని భరోసా ఇచ్చారు. త్వరలో జరగనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీకి కూడా 4 వేల కేజీల చికెన్, 8 వేల గుడ్లు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
 
  బర్డ్‌ఫ్లూ మనిషికి సోకిన కేసులు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా నమోదు కాలేదన్నారు. దేశంలోనే తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ మొదటిస్థానంలో ఉందన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు అనేకసార్లు బర్డ్‌ఫ్లూ ప్రకటించారని... అయితే రాష్ట్రంలో ఇప్పుడు మూడు రోజుల్లోనే పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంతి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకున్నారన్నారు. హయత్‌నగర్ మండలం తొర్రూరు కోళ్ల ఫారాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకిన మూడు రోజుల్లోనే మళ్లీ సాధారణ స్థితికి వచ్చిందని, దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు.
 
 సాధారణంగా కోళ్లు చనిపోతే బర్డ్‌ఫ్లూ అనుకొవద్దు
 సాధారణంగా వేసవిలో వేడికి కోళ్లు చనిపోతుంటాయని, వాటిని కూడా బర్డ్‌ఫ్లూతో చనిపోయినట్లు ప్రచారం చేయడం శోచనీయమని ప్రదీప్‌కుమార్ రావు చెప్పారు. నిజామాబాద్‌లో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు శాంపిళ్లు సేకరించి బెంగళూరులో పరీక్షించాక తర్వాత భోపాల్ ల్యాబ్‌కు పంపుతారని, అక్కడ నిర్ధారణ జరుగుతుందన్నారు. బర్డ్‌ఫ్లూ ప్రచారం వల్ల హైదరాబాద్‌లో 20 శాతం వరకు పౌల్ట్రీ అమ్మకాలు పడిపోయిన విషయం వాస్తవమేనని, జిల్లాల్లో మాత్రం ఎటువంటి ప్రభావం పడలేదన్నారు. కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి పరిశీలించి ప్రభుత్వ చర్యలకు సంతృప్తి వ్యక్తంచేసిందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయని కె.జి.ఆనంద్ తెలిపారు.
 చికెన్, గుడ్ల వంటకాలు...
 వండే ఉష్ణోగ్రతలు
 చికెన్ ఫ్రై    - 150 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఆపైన
 ఉడికించిన గుడ్డు - 100 డిగ్రీల సెంటీగ్రేడ్లు
 ఆమ్లెట్ -  150 డిగ్రీల సెంటీగ్రేడ్లు
 బేకింగ్ - 130 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఆపైన
 తందూరీ    - 240 డిగ్రీలు ఆపైన సెంటీగ్రేడ్లు
 కూర - 140 డిగ్రీలు ఆపైన సెంటీగ్రేడ్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement