కన్నూర్: కేరళలో మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. కన్నూర్ జిల్లా ఇరిట్టిలోని ఎడక్కనడం ప్రాంతంలో కాకుల్లో హెచ్5ఎన్1 లక్షణాలు గుర్తించారు. కన్నూర్ రీజినల్ డయాగ్నస్టిక్ లాబొరేటరీ హెచ్5ఎన్1 లక్షణాలు ధృవీకరించింది. అయితే, ఇప్పటివరకు పెంపుడు పక్షులలో (కోళ్లు, బాతులు) ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ప్రస్తుత దశలో పక్షులను చంపాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. హెచ్5ఎన్1 గుర్తింపు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ కే. విజయన్ ఆ ప్రాంతంలో ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇరిట్టి మున్సిపాలిటీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా వైద్యాధికారి, స్థానిక అధికారులను ఆదేశించారు. కేవలం ఒక కాకిలో మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ గుర్తించినందున, ఎటువంటి ఔట్‌బ్రేక్, సర్వైలెన్స్ జోన్ ప్రకటించలేదని, అలాగే పక్షులను చంపాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
ఒకవేళ పక్షుల కళేబరాలు కనిపిస్తే, భద్రతా నిబంధనలను పాటిస్తూ మున్సిపల్ ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో కాల్షియం కార్బోనేట్‌ను ఉపయోగించి వాటిని తగిన లోతులో పూడ్చిపెడతారని పేర్కొంది. ఈ పారిశుధ్య ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా గ్లోవ్స్, మాస్క్‌లు మరియు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ ధరించాలని సూచించారు. ఆ ప్రాంతంలోని ప్రజల్లో ఎవరికైనా కారణం తెలియని జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉంటే, ఆ కేసులను నిశితంగా గమనించి నివేదించాలని ఆరోగ్య శాఖను కలెక్టర్ ఆదేశించారు.


