'చంద్రబాబు మాయలమరాఠి, మోసగాడు' | Bhumana karunakar Reddy criticise chandra babu on election promises | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు మాయలమరాఠి, మోసగాడు'

Jun 23 2016 10:37 PM | Updated on Aug 14 2018 4:44 PM

'చంద్రబాబు మాయలమరాఠి, మోసగాడు' - Sakshi

'చంద్రబాబు మాయలమరాఠి, మోసగాడు'

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మాయల మరాఠీ అని, వీధి మంత్రగాళ్లను మించిన మాయగాడని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

  •  హామీలు అమలు చేశానని అబద్ధాలు చెబుతున్నారు
  •  రైతుల కళ్లల్లో వెలుగుందని బొంకుతున్నారు
  • హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మాయల మరాఠీ అని, వీధి మంత్రగాళ్లను మించిన మాయగాడని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అయిన రైతుల రుణ మాఫీని అమలు చేయకుండానే చేసేశామని బుధవారం ఒంగోలు సభలో చంద్రబాబు చెప్పారని విమర్శించారు. చంద్రబాబు రుణ మాఫీపై హామీ ఇచ్చినపుడు ఉన్న రుణాల మొత్తం రూ. 87,000 కోట్లు అయితే ఈరోజు ఆ మొత్తం రూ. లక్ష కోట్లకు పైగా పెరిగిందన్నారు. మాఫీ చేసి ఉంటే ఇంత ఎలా పెరిగిందని భూమన ప్రశ్నించారు. ఇప్పటికి రూ.7500 కోట్లు ఒకసారి, రూ.3500 కోట్లు మరోసారి మొత్తం రూ.11000 కోట్లు రుణ మాఫీ చేశానని, మిగతా రూ.13000 కోట్లు వచ్చే మూడేళ్లలో చేస్తానని చంద్రబాబే స్వయంగా చెప్పారని అలాంటపుడు రైతుల రుణాలన్నీ ఎలా మాఫీ అయ్యాయని ఆయన అన్నారు.

    ఇంత పెద్ద అబద్ధాన్ని చెప్పింది చాలక మళ్లీ రైతులు తన పాలనపై సంతృప్తిగా ఉన్నారని వారి కళ్లల్లో వెలుగు కనిపిస్తోందని చంద్రబాబు చెప్పడం మోసపూరితమేనన్నారు. రెండేళ్లలోనే 90 శాతం హామీలు నెరవేర్చేసినట్లు చంద్రబాబు చెప్పడం మరో మాయ అనీ, పైగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాల్సిందిగా టీడీపీ ప్రజా ప్రతినిధులందరినీ కోరడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు. ఆయన ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, తొలి ఐదు సంతకాల అమలు కూడా అంతా డొల్లేనని పేర్కొన్నారు. ఇది చాలదన్నట్లు ప్రతి రోజూ ఏదో ఒక సమావేశంలో చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి మభ్య పెట్టే యత్నం చేస్తున్నారన్నారు. అందుకే తాము జూలై 8 నుంచి ‘గడప గడపకూ వైఎస్సార్ సీపీ’  పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు ఏ మేరకు జరిగిందో తెలుసుకుంటామన్నారు. డ్వాక్రా మహిళల రుణాలను కూడా మాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానన్న హామీని నెరవేర్చక పోగా ఉద్యమించిన ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబీకులను ఎంత క్షోభపెట్టారో ప్రజలంతా చూశారని ఆయన అన్నారు.

    గిట్టుబాటు ధర అడిగితే వెటకారమా?
    ఒంగోలులో ఓ రైతు లేచి గిట్టుబాటు ధర ఇప్పించండి అని అడిగితే చంద్రబాబు ఎంత వెటకారంగా మాట్లాడారో అందరూ చూశారని ఆయన అన్నారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలని, ప్రశ్నించిన వారిని అంతం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఇది చాలా దారుణమని ఆయన అన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మి 2014లో ప్రజలు ఓట్లేశారు కనుక మళ్లీ మాయ మాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు ఒకసారి నమ్మొచ్చు గానీ మళ్లీ మళ్లీ నమ్మే పరిస్థితి ఉండదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ అసంతృప్తితో ఉన్నారని, వెళ్లిన వారు తప్పు చేశామనే భావనతో ఉన్నారని భూమన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిబంధనలకు మించి ఎక్కువగా ఎన్నికల వ్యయం చేసి స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన పదవికి రాజీనామా చేయాలని లేదా ఎన్నికల కమిషన్, కోర్టులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement