బినామీ..తినకనేమి..! | Benami ration dealers in the city danda | Sakshi
Sakshi News home page

బినామీ..తినకనేమి..!

Oct 21 2013 3:33 AM | Updated on Sep 5 2018 1:38 PM

ఫిలింనగర్ సమీపంలోగల పారమౌంట్స్ హిల్స్‌కాలనీలో 603 నెంబర్ రేషన్ దుకాణాన్ని అసలు డీలర్‌కు బదులు బినామీ వ్యక్తి కొనసాగిస్తున్నాడు.

 

=నగరంలో బినామీ రేషన్ డీలర్ల దందా
 =దర్జాగా సరుకులను అమ్ముకుంటున్న వైనం
 =పత్తా లేని నిఘా.. పట్టింపులేని అధికారులు

 
సాక్షి,సిటీబ్యూరో: ఫిలింనగర్ సమీపంలోగల పారమౌంట్స్ హిల్స్‌కాలనీలో 603 నెంబర్ రేషన్ దుకాణాన్ని అసలు డీలర్‌కు బదులు బినామీ వ్యక్తి కొనసాగిస్తున్నాడు.  అయితే సదరు డీలరు ప్రతినెలా కొందరికి మాత్రమే బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేసి మిగతావాటిని నల్లబజారుకు తరలిస్తున్నారు. నిఘా ఉంచిన  ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అధికారులు..సుమారు వందక్వింటాళ్ల బియ్యా న్ని తెల్లసంచుల్లో మార్పిడి చేసి శుక్రవారం అర్ధరాత్రి లారీల్లోకి ఎక్కిస్తుండగా  రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీలర్‌పై కేసు నమోదు చేసి షాపును సీజ్‌చేశారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి రానివి అనేకం.
 
మహానగరంలో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పుతోంది. ఎంతో సదుద్దేశంతో పేదలకిస్తున్న రేషన్ సరుకులను అక్రమార్కులు భోంచేస్తున్నారు. పౌరసరఫరాలశాఖ అధికారులు పట్టింపులేనితనం కారణంగా నగరంలో అనేక రేషన్‌దుకాణాలు బినామీల చేతుల్లో నడుస్తున్నాయి. అధికారులు మేమున్నామని చెబుతుండడంతో అక్రమాలకు అడ్డేలేకుండా పోయింది. రేషన్‌కార్డుల కేటాయింపు సంఖ్యకు కూడా ఒక పద్ధతి అంటూ లేకుండా పోయింది. దీంతో నిత్యావసర సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారడంతోపాటు ఏకంగా నల్లబజారుకు తరలుతున్న ఘటనలు కూడా లేకపోలేదు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 12 సివిల్‌సప్లై సర్కిళ్లు ఉండగా..వాటి పరిధిలో సుమారు 1256 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటిలో కేవలం 896 దుకాణాలకు మాత్రమే శాశ్వత ప్రాతిపదికన డీలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 310 దుకాణాలు వివిధ కారణాలతో మూతపడ్డాయి. వాటి పరిధిలోని కార్డుల బాధ్యతను సమీప డీలర్లకు అప్పగించారు. కాగా, శాశ్వత దుకాణాలు కనీసం 20శాతం వరకు బినామీ డీలర్ల నిర్వహణలోనే కొనసాగుతున్నాయి.   
 
కార్డుల కేటాయింపులో..: పౌరసరఫరాల శాఖ అధికారులకు కాసులపై ఉన్న యావ..సరుకుల పంపిణీపై నిఘా లేకుండా పోయింది. అవినీతికి కేరాఫ్ అడ్రస్సయిన వీరి నిర్వాకం వల్ల విలువైన  సరుకులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఎలాగంటే కొన్ని దుకాణాలకు 400 కార్డులుంటే..మరికొన్ని దుకాణాలకు 2500 పైగా కార్డులు ఉండడం ఒక ఉదాహరణ. కాగా డీలర్లలో కొందరు చనిపోవడం, మరికొందరు దీర్ఘకాలిక సెలవుల్లో ఉండడం,కొందరు సస్పెండ్ కావడం లాంటి వివిధ కారణాలతో డీలర్‌షిప్‌లు ఖాళీఅయ్యాయి.

చాలాచోట్ల ఇన్‌చార్జి డీలర్లే కొనసాగుతున్నారు. మూతపడిన షాపుల కార్డులను పక్క డీలర్లకు ఇష్టానుసారంగా బదలాయించారు. దీంతో కార్డుల సంఖ్యకు ఒక పరిమితి లేకుండాపోయింది. డీలర్లు కూడా నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పంపిణీ పూర్తిస్థాయిలో చేయడం లేదు. పంపిణీ తర్వాత మిగిలిన సరుకు నిల్వల వివరాలు చూపడం లేదు. అమ్మకపు రిజిస్ట్రర్‌లో పంపిణీ పూర్తయినట్లు మాత్రం నమోదు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరింతదారుణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement