
ఆపదలో ఆపద్బంధు
ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మరణిస్తే.. వారికి ఆర్థిక సాయం అందించేందుకు తలపెట్టిన ఆపద్బంధు పథకం నిధుల లేమితో తల్లడిల్లుతోంది.
► మూడేళ్లుగా అందని నిధులు
► జంట జిల్లాల్లో 419 పెండింగ్ కేసులు
► వడదెబ్బ మరణాలదీ ఇదే పరిస్థితి
సాక్షి,సిటీబ్యూరో: ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మరణిస్తే.. వారికి ఆర్థిక సాయం అందించేందుకు తలపెట్టిన ఆపద్బంధు పథకం నిధుల లేమితో తల్లడిల్లుతోంది. మూడేళ్లుగా ఈ పథకానికి పలు కుటుంబాలు అర్హత సాధించినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయలేదు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలు ఆర్థికసాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్-రంగారెడ్డి జంట జిల్లాల్లో ఆపద్బంధు పథకం కింద 419 కుటుంబాలు ఆమోదం పొందాయి. వీటికి రూ. 2.09 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే...సర్కారు నుంచి నిధులు రాకపోవడంతో ఆయా కుటుంబాలకు ఇప్పటికీ ఆర్థికసాయం అందించలేదు. ప్రమాదాల సంఖ్య పెద్దగా ఉన్నప్పటికీ.. అందులో యంత్రాంగానికి అందిన సమాచారం మేరకు కేసులను పరిశీలించి ఆపద్బంధు కింద అర్హతను నిర్ధారిస్తున్నారు.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. వాస్తవానికి ఈ ప్రక్రియలో గరిష్టంగా మూడు నెలల్లోపు సదరు కుటుంబానికి లబ్ధి చేకూర్చాలి. కానీ మూడేళ్లుగా ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిధులివ్వలేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. ప్రత్యామ్నాయ పద్ధతిలోనైనా జిల్లా యంత్రాంగం సర్దుబాటు చేస్తే ఆయా కుటుంబాలకు ఆర్థిక చేయూత దక్కేది. అయితే... నిధులను సాకుగా చూపుతూ సాయంపై అధికార యంత్రాంగం నిమ్మకుండటంతో అర్హత సాధించిన లబ్ధిదారుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది.
వడదెబ్బ మృతులకూ అంతే...
ఈ వేసవి కాలంలో ప్రతీ రోజూ 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2015-16 సంవత్సరంలో జంట జిల్లాల్లో 15 మంది వడదెబ్బతో చనిపోయారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. గుర్తించిన బాధిత కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సాయం అందేలా యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. కానీ... ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో సాయం అందలేదు. ఇదిలావుండగా.. ఇటీవల సీఎం ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆపద్బంధు పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు విడుదల చేయాలని జంట జిల్లాల కలెక్టర్లు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.