మరో ఐదుగురు ‘ఐసిస్’ సానుభూతిపరులు! | Another five in the state of 'Isis' sympathizers! | Sakshi
Sakshi News home page

మరో ఐదుగురు ‘ఐసిస్’ సానుభూతిపరులు!

Jan 26 2016 4:18 AM | Updated on Aug 15 2018 7:18 PM

రాష్ట్రంలో ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) సానుభూతిపరుల కోసం వేట కొనసాగుతోంది. హైదరాబాద్‌లో నాలుగు రోజుల క్రితం

వేట ముమ్మరం చేసిన పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలు
 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) సానుభూతిపరుల కోసం వేట కొనసాగుతోంది. హైదరాబాద్‌లో నాలుగు రోజుల క్రితం జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థకు చెందిన నలుగురిని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పీటీ వారెంట్ మీద తీసుకెళ్లిన నలుగురు ఉగ్ర సానుభూతిపరులైన మహ్మద్ నఫీస్ ఖాన్, షరీఫ్ మొయినుద్దీన్, మహ్మద్ ఒబేదుల్లాఖాన్, అబు అన్స్‌లను ఎన్‌ఐఏ అధికారులు విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నగరంలో ఐసిస్ సానుభూతిపరులు ఐదుగురు ఉన్నట్టు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సిరియా వెళ్లిపోయారనీ వీరు బయటపెట్టారు. జునూద్ అధినేత మునబిర్ ముస్తాఖ్ ఆదేశాల మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసానికి ప్రణాళికలు రచించినట్లు అధికారులు గుర్తించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేలుళ్లు జరపడానికి పలు ప్రాంతాల్లో రెక్కీ సైతం నిర్వహించారు. అయితే ఎన్‌ఐఏ దాడులతో వారి కుట్ర భగ్నమైంది. అయితే తప్పించుకుని తిరుగుతున్న మిగతా వారిని అదుపులోకి తీసుకోవడానికి నిఘా బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కేంద్ర నిఘా వర్గాల నుంచి రాష్ట్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నాయి.

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అనుమానిత ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచాయి. ఉగ్ర సానుభూతిపరుల కదలికలను కనిపెట్టేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్, క్విక్ రెస్పాన్స్ టీంలు 24 గంటలూ దృష్టిసారించాయి. ఉగ్ర చర్యలన్నీ సోషల్‌మీడియా, పలు వెబ్‌సైట్ల ద్వారా విస్తృతమవుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అందుకు అనుగుణంగా ఐసిస్ సానుభూతిపరమైన వెబ్‌సైట్లను నియంత్రిస్తున్నాయి. తాజాగా దేశంలో 94 వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్లు మహారాష్ట్ర ఏటీఎస్ ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడా ఐసిస్ సానుభూతిపరులు విస్తృతంగా బయటపడుతుండటంతో కౌంటర్ ఇంటెలిజెన్స్, సైబర్ పోలీసులు గట్టి నిఘా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement