పోలీసులు రెచ్చిపోయారు. ఏపీ అంగన్‌వాడీలపై జులుం ప్రదర్శించారు. మహిళలనే కనికరం లేకుండా నడిరోడ్డుమీదే ఈడ్చేశారు. వ్యాన్‌లలో కుక్కేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
పోలీసులు రెచ్చిపోయారు. ఏపీ అంగన్‌వాడీలపై జులుం ప్రదర్శించారు. మహిళలనే కనికరం లేకుండా నడిరోడ్డుమీదే ఈడ్చేశారు. వ్యాన్‌లలో కుక్కేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో ఓ మహిళ వాహనం నుంచి పడిపోయినా పట్టించుకోలేదు. అటు పోలీసులు...ఇటు అంగన్‌వాడీల మోహరింపుతో మంగళవారం నగరంలో పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రాఫిక్ స్తంభించింది.
సాక్షి, సిటీబ్యూరో: జీతాలు పెంచాలంటూ మంగళవారం ఆందోళనకు దిగిన ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమకారులను అడ్డుకున్నారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు అక్కడికి వచ్చిన వారిని వచ్చినట్లే అదుపులోకి తీసుకున్నారు. ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీలోని 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు హైదరాబాద్‌కు వచ్చారు.
వివిధ మార్గాల్లో నగరానికి చేరుకున్న వీరిని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. వందలాది మం దిని గోషా మహల్ స్టేడియంకు తరలించారు.దీన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసు నిర్బంధంలో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పలమనేటి వెంకటరమణ, రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డిలను పోలీసులు స్టేడియం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వారు రో డ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అంగన్‌వాడీలకు సంఘీభావం తెలిపేం దుకు వస్తే లోపలికి అనుమతించ కపోవడమేమిటంటూ పోలీసులు, సీఎం చంద్రబాబుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి గోషామహల్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు.
ఉదయం నుంచే అరెస్టుల పర్వం ...
ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ను ఉదయమే అధీనంలోకి తీసుకున్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లుగా అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. దీన్ని నిరసిస్తూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరస్పరం తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆందోళనకారులను అణచివేసేందుకు పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను. హోంగార్డులను రంగంలోకి దింపారు. వాటర్ కెనన్‌లు, వజ్ర వాహనాలతో ఇందిరా పార్కు వద్ద భయానక వాతావరణాన్ని సృష్టించిన పోలీసులు ధర్నా చౌక్‌కు ఇరువైపులా బారికేడ్లతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారు.
మూడు ప్రైవేట్ బస్సుల్లో ఇందిరా పార్కుకు చేరుకున్న వందలాది మంది అంగన్‌వాడీ కాకర్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బి.వి.విజయలక్ష్మి, ఏపీ ప్రధాన కార్యదర్శి జి.ఓబులేషు, ఆర్.రవీంద్రనాథ్, కార్యదర్శి వై.రాధాకష్ణమూర్తి, అంగన్‌వాడీ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి జె.లలిత, అధ్యక్షుడు హరికష్ణతో పాటు తెలంగాణ శ్రామిక ఫోరం అధ్యక్షురాలు ప్రేమ్‌పావని సహా పలువురిని అరెస్టు చేశారు.
రణరంగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు...
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, ెహ ల్పర్స్ యూనియన్ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’తో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రణరంగాన్ని తలపించింది. పర స్పర తోపులాటలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రాలీ ఆటోలో అక్కడికి చేరుకున్న ఓ మహిళ కిందపడిపోగా, పోలీసులు ఆమెను ట్రాలీలోనే అక్కడి నుంచి పంపించారు. శోభ అనే కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి రోజా, అధ్యక్షులు బేబిరాణి, ఎమ్మెల్సీ గేయానంద్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, సీఐటీయూ నాయకురాలు స్వరూపరాణి, ప్రజాకళాకారుడు బాషా, సీపీఎం రాష్ట్ర కార్యదర్సి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, (వై.వి.)తో పాటు వందలాది మంది కార్యకర్తలు, హెల్పర్లను ఆరెస్ట్ చేశారు.
పాకిస్తాన్‌లో ఉన్నామా?
సమస్యల పరిష్కారానికి ఆందోళనకు దిగిన వారిని అరెస్టు చేయడం దారుణమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పలమనేటి వెంకర మణ , రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. మహిళలని చూడకుండా దారుణంగా రోడ్లపై ఈడ్చుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం పాకిస్తాన్‌లో ఉన్నామో, ఆప్ఘనిస్తాన్‌లో ఉన్నామో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, చిత్తూరు, కడప, కర్నూలు,తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన అంగన్‌వాడీలను చంద్రబాబు పోలీసులతో కొట్టించారని ఆరోపించారు.
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన వక్తం చేశారు. అంగన్‌వాడీలతో అన్ని రకాల సేవలు చేయించుకుంటూ కనీస వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. గతంలో కేంద్రం కేవలం రూ.3 వేలు ఇస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరో రూ.1200 కలిపి రూ.4200కు పెంచారని గుర్తు చేశారు. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో పెంచాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున అసెంబ్లీలో అంగన్‌వాడీల సమస్యలను పెద్ద ఎత్తున లేవనెత్తుతామని వారు పేర్కొన్నారు.