పట్టు నిలబెట్టుకున్న మజ్లిస్ | Sakshi
Sakshi News home page

పట్టు నిలబెట్టుకున్న మజ్లిస్

Published Fri, Feb 5 2016 5:54 PM

పట్టు నిలబెట్టుకున్న మజ్లిస్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కొట్టుకుపోగా.. ఎంఐఎం మాత్రం తన పట్టును నిలబెట్టుకుంది. హైదరాబాద్ లో పాతబస్తీ సహా తనకు పట్టున్న ప్రాంతాల్లో ఎంఐఎం విజయకేతనం ఎగురవేసింది. 44 స్థానాల్లో విజయం సాధించింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 43 సీట్లు సాధించి మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం.. తాజా ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది.

తాజా ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు.. టీఆర్ఎస్ తో పాటు ఎంఐఎంను లక్ష్యంగా చేసుకున్నాయి. ఎంఐఎం పై విమర్శల వర్షం కురిపించాయి. పోలింగ్ సందర్భంగా ఎంఐఎం నాయకులు.. అధికార టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నాయకులపై దాడులకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి ఎంఐఎంపై గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశాయి. ఎంఐఎం తనకు బలమున్న ప్రాంతాల్లో అభ్యర్థులను గెలిపించుకుంది. ఓవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ పార్టీ శ్రేణులను చైతన్య పరుస్తూ ప్రచారం చేశారు.

గత ఎన్నికల్లో ఎంఐఎం మూడో స్థానంలో నిలిచినా..  53 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీతో కలసి మేయర్ పీఠం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున బండ కార్తీక రెడ్డి మేయర్గా ఎన్నిక కాగా, ఆనక ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్కు మేయర్ పదవిని అప్పగించారు. 45 కార్పొరేట్ సీట్లతో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ ప్రతిపక్షంలో నిలిచింది. కాగా గ్రేటర్ ఎన్నికల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ పాత్ర పోషించే ఎంఐఎంకు ఈ సారి ఆ అవకాశం రాలేదు. అధికార టీఆర్ఎస్ మెజార్టీ సాధించింది.

Advertisement
Advertisement