డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ | Admissions to Degree Online Notification | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్

May 17 2016 2:39 AM | Updated on Apr 7 2019 3:35 PM

డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ - Sakshi

డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ఉమ్మడి షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ ప్రవేశాలను చేపట్టేందుకు ఉన్నత విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

♦ ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు
♦ దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు
♦ ‘డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విద్యాశాఖ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ఉమ్మడి షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ ప్రవేశాలను చేపట్టేందుకు ఉన్నత విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అనేక ఆందోళనలు, సందేహాలు, తర్జనభర్జనల తరువాత ఎట్టకేలకు ఈ నోటిఫికేషన్ జారీ అయింది. అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ‘డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (డీవోఎస్‌టీ)’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్ (http://dost.cgg.gov.in)ను ప్రారంభించింది. షెడ్యూల్, దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు సహా మొత్తంగా ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ, కరీంనగర్‌లోని శాతవాహన, నిజామాబాద్‌లోని తెలంగాణ, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు, నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అటానమస్ కాలేజీల్లో సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం విద్యార్థులు రూ.100ను క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చని తెలిపింది. రూ.500 ఆలస్య రుసుముతో వచ్చే నెల 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించింది.

 ముఖ్యమైన సూచనలివీ..
► ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు సమకూర్చుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలను చెక్‌లిస్టు పేరుతో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
► దరఖాస్తు చేసుకునే విధానాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా సూచించారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తీరును అందుబాటులో పెట్టారు. వీడియో డెమో కూడా అందుబాటులో ఉంది.
► అర్హతలు, ప్రవేశాల విధానం, కాలేజీల జాబితా, కోర్సుల జాబితాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
► ఒక్కో యూనివర్సిటీ పరిధిలో 5 నుంచి 10 వరకు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల షెడ్యూల్:
 మే 20 నుంచి జూన్ 6 వరకు: రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు
 జూన్ 7, 8 తేదీల్లో: రూ.500 ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు
 10వ తేదీన: సీట్ల కేటాయింపు
 10 నుంచి 20వ తేదీ వరకు: కాలేజీల్లో రిపోర్టింగ్ (చేరడం)
 22వ తేదీ నుంచి తరగతుల ప్రారంభం
 జూన్ 21 నుంచి 23 వరకు: రెండో దశ వెబ్ ఆప్షన్లు
 25వ తేదీన: సీట్ల కేటాయింపు
 25 నుంచి 30 వరకు: కాలేజీల్లో రిపోర్టింగ్
 30 నుంచి జూలై 1 వరకు: చివరి దశ వెబ్ ఆప్షన్లు
 3వ తేదీన: సీట్ల కేటాయింపు
 4 నుంచి 7 వరకు: కాలేజీల్లో రిపోర్టింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement