
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి (1956– 2010) వరకు ఎవరు బెస్ట్ సీఎం అని ప్రశ్నిస్తే 64 శాతం మంది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెప్పడాన్ని గమనించాలి. నాడు ఎన్‌టీవీ నీల్సన్ ఓఆర్‌జి సంస్థలు నిర్వహించిన సర్వే వివిధ అంశాలపై ప్రజల నుంచి అభిప్రా యాలు సేకరించిన మొత్తం 85 నియోజక వర్గాల్లోనూ 14,080 మంది నుంచి శాంపిల్స్ తీసుకున్న నేపథ్యంలో అది నేటికి అక్షర సత్యంగా నిరూపితమైందనక తప్పదు. వైఎస్‌ఆర్ పేరిట ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది.
తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వపు పోకడలు అండగా రాజకీయ నాయకులు గ్రామాలకు వెళ్లాలని, వారి స్థితిగతులను పరిశీలించాలని, పల్లెలు పచ్చగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని గాంధీ వాక్కుల స్ఫూర్తితో వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో 2017 నవంబర్ 16వ తేదీ ఇడుపులపాయ నుండి 2019 జనవరి, 9వ తేదీ ఇచ్ఛాపురం వరకు 14 నెలలపాటు రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 125 నియోజక వర్గాల్లో 3,648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు జనహితుడయ్యాడు. ఈ మార్పునకు మూల విరాట్టు వైఎస్సార్ అని చెప్పక తప్పదు.
గతంలో ‘సూర్యస్నానం’ చేస్తూ స్వేదమే వేదంగా, జన చైతన్యమే రణనినాదంగా కదిలాడు వైఎస్‌ఆర్. అలవికాని ఆ యాత్రను 1,460 కిలోమీటర్లు అజేయంగా పూర్తి చేశాడు. రాష్ట్రంలో అదొక చారిత్రక ఘట్టం! రాజశేఖరరెడ్డి, అన్నీ తానై, అంతటా ఒక్కటై మహాశక్తిగా ఎదిగాడు. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న అభిమాన నాయకుడయ్యాడు. ఆయన పాదయాత్ర జైత్రయాత్రగా ముగిసిన రోజే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం విశేషం. ఈ పరిణామాలన్నీ పరిగణనలోనికి తీసుకున్న వైఎస్ జగన్ ఆలోచనలకు వైఎస్‌ఆర్ పాదయాత్ర ఒక దిక్సూచి అయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక ఎన్నో కొత్త ఆలోచనలతో ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెట్టారు. వీటిలో రెండు రూపాయలకు కిలో బియ్యం కొనసాగింపుతోపాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, ఇందిరమ్మ గృహాలు, ఆరోగ్యశ్రీ, గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి నగరాల్లో ఉన్న వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు వీలుగా ప్రవేశపెట్టిన 104, 108ల వంటి మొబైల్ సర్వీసులు ప్రజలకు సేవలందించడం ద్వారా అత్యంత ప్రజాదరణ పొందాయి. అదే పంథాలో వైఎస్‌ఆర్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫెస్టోలో ప్రజా సంక్షేమ పథకాలైన నవరత్నాలకు భారీ స్పందన కలిగి వైఎస్‌ఆర్ పార్టీని, జగన్ మోహన్‌రెడ్డిని గెలిపించుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసు కోవడం విశేషం.
2004 మేలో జరిగిన ఎన్నికల్లో ఎదురులేని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా మొట్ట మొదట వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అదే పంథాలో ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సైతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే ఎన్నికల మ్యానిఫెస్టో నవరత్నాల్లో ఒకటైన అవ్వతాతల పింఛన్ పెంపు హామీపై తొలి సంతకం చేశారు. ‘నవరత్నాలు’ మేనిఫెస్టో ప్రతి మంత్రి వద్ద, కలెక్టర్ల వద్ద, ప్రతి అధికారి వద్ద ఉండాలని సూచించారు. భగవంతుడు మానవునిగా పుట్టించింది తోటి వారికి సేవ చేయడానికేనన్న సిద్ధాంతాన్ని అక్షరాలా నమ్మిన వ్యక్తి వైఎస్‌ఆర్. అదే విధంగా తనయుడు వైఎస్ జగన్ సైతం తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారనడానికి గడచిన 30 రోజుల పాలన నిదర్శనం. తండ్రి వైఎస్సార్ ప్రతి కదలికను నిశిత పరిశీలనతో ఆకళింపు చేసుకుని జగన్ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు.
వ్యాసకర్త వైఎస్‌ఆర్ పథకాలు– రీసెర్చ్ స్కాలర్