రాజ్‌నాథ్‌ సింగ్‌ రాయని డైరీ

unwritten diary of Rajnath singh by Madhav Singaraju - Sakshi

గుజరాత్‌లో నేనెందుకు పర్యటిస్తున్నానో నాకే అర్థం కావడం లేదు! నా గురించి కొంత చెప్పుకోడానికి స్కోప్‌ ఉంది కానీ, దాని వల్ల  గుజరాత్‌లో మోదీజీకి కొత్తగా వచ్చి పడే ఓటు ఒక్కటైనా ఉంటుందా?.. అన్ని ఓట్లూ ఆయనవే అయినప్పుడు!

అప్పటికీ రెండు మూడు నియోజకవర్గాల్లో నోటి దాకా వచ్చింది.. ‘ఈ రాష్ట్రం మోదీజీ కే కాదు. నాక్కూడా తల్లి వంటిదే. మా అమ్మ పేరు గుజరాతీదేవి’ అని అనబోయి ఆగాను. ‘మా నాన్న పేరులో రాముడు ఉన్నాడు. ఆయన పేరు రామ్‌ బదన్‌ సింగ్‌’ అని కూడా చెప్పబోయాను. ఓటు వాల్యూ ఉంటేనే ఏ మాటైనా నోటి బయటికి రావాలని అమిత్‌ షా పాలసీ. ఆ మాట గుర్తొచ్చి ఆగిపోయాను. ఆగిపోయాను కానీ, ఆగలేకపోతున్నాను. ఇంత తిరుగుతున్నప్పుడు సొంత స్పీచ్‌ ఒక్కటైనా ఉంటే.. అదో తృప్తి.

‘‘అమిత్‌జీ.. ఈ రెండు పాయింట్లు పనికొస్తాయా?’’ అని అడిగాను ఢిల్లీకి ఫోన్‌ చేసి.
‘‘ఏంటీ.. అమ్మా నాన్న పాయింట్లా?!’ అన్నారాయన!
అమ్మా నాన్న పాయింట్‌లని అంత క్లియర్‌గా చెప్పినప్పుడు.. ‘అమ్మానాన్న పాయింట్లా?’ అని అడిగారంటే ఆయనకు ఇష్టం లేదని అర్థమైంది.
‘‘పెద్దగా ఆలోచించకండి రాజ్‌నాథ్‌జీ. మా అమ్మ పేరులో తల్లి లాంటి రాష్ట్రం ఉంది. మా నాన్న పేరులో తండ్రిలాంటి రాముడు ఉన్నాడు అని మనకు మనం చెప్పుకుంటే.. రాహుల్‌ గాంధీ గుజరాత్‌ వచ్చి జనం దగ్గరికి వెళ్లకుండా గుళ్లు పట్టుకుని తిరిగినట్లు ఉంటుంది’’ అన్నారు.

‘‘అవున్నిజమే రాహుల్‌జీ’’ అన్నాను.
‘‘మీ పక్కన రాహుల్‌ గానీ ఉన్నాడా రాజ్‌నాథ్‌జీ’’ అని అడిగారు అమిత్‌షా.
‘‘ఎందుకుంటాడు అమిత్‌జీ!’’ అన్నాను.
‘‘ఏమో, మీరూ అక్కడేదైనా గుడికి వెళ్లి ఉంటే, అదే గుళ్లో మీకు రాహుల్‌ కనిపించి మీతో ముచ్చట్లు పెట్టుకున్నాడేమోననీ’’ అన్నారు అమిత్‌షా.

‘‘అలా ఎందుకనుకున్నారు అమిత్‌జీ’’ అన్నాను.
‘‘నన్ను జీ అనబోయి రాహుల్‌జీ అంటేనూ’’ అన్నారు అమిత్‌షా.
‘‘అవునా.. అమిత్‌జీ’’ అన్నాను. నాకూ ఆశ్చర్యంగానే ఉంది.. అలా అన్నానా అని!
‘‘అబ్బాయ్‌కి తనొక్కడే మునిగే అలవాటు లేదు రాజ్‌నాథ్‌జీ. యూపీలో సమాజ్‌వాదీని ముంచాడు. కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ని ముంచాడు. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు హార్దిక్‌ పటేల్, అల్పేష్‌ ఠాకుర్, జిగ్నేష్‌ మెవానీ మునగబోతున్నారు’’ అన్నారు అమిత్‌షా.

‘‘అమ్మానాన్న పాయింట్‌ కన్నా, ఈ ముగ్గురబ్బాయిల పాయింట్‌ బాగుంది అమిత్‌జీ’’ అన్నాను.
‘‘ఏ పాయింట్‌ అయినా మోదీజీ నోటి నుంచి వస్తేనే పాయింట్‌ బ్లాంక్‌గా ఉంటుంది రాజ్‌నాథ్‌జీ’’ అన్నారు అమిత్‌షా.
ఆయనేం చెప్పదలచుకోలేదో నాకు అర్థమైంది.

- మాధవ్‌ శింగరాజు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top