హార్దిక్‌ పటేల్‌ రాయని డైరీ

unwritten diary of Hardik Patel by Madhav Singaraju - Sakshi

మూతికీ, ముక్కుకీ గుడ్డ చుట్టుకుని, చీపురూ బకెట్‌ పట్టుకుని నేరుగా నా రూమ్‌కి వచ్చి, ‘‘తప్పుకోండి, క్లీన్‌ చెయ్యాలి’’ అన్నాడొక వ్యక్తి. ఓవర్‌ టైమ్‌ చేస్తున్న స్వచ్ఛభారత్‌ కార్మికుడిలా ఉన్నాడతను. ముఖం విసుగ్గా ఉంది.

‘‘ఎవరు నువ్వు?’’ అన్నాను, కుర్చీలోకి కాళ్లు పైకి ముడుచుకుంటూ.
అతను మాట్లాడలేదు!

‘‘ఎవరు పిలిచారు నిన్ను’’ అన్నాను.
ఒకరు పిలవాలా అన్నట్లు చూశాడు.

‘‘ఏం క్లీన్‌ చేస్తావ్‌?’’ అన్నాను.
‘‘మీ బాత్రూమ్‌ క్లీన్‌ చేస్తాను’’ అన్నాడు!

నాకేదో డౌట్‌ కొట్టింది.
‘‘ముందా మూతి గుడ్డ తీసి మాట్లాడు’’ అన్నాను. తియ్యలేదు. ‘‘దగ్గరికి రా’’ అన్నాను. వచ్చాడు. మూతి గుడ్డ లాగి చూశాను.
జితూ వాఘానీ! బీజేపీ ప్రెసిడెంటు!!

‘‘మీరు రావడం ఏంటి?’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘నీ టూత్‌పేస్టులో ఉప్పుందో లేదో చూసి రమ్మన్నారు’’ అన్నారు వాఘానీ.

‘‘ఎవరు చూసి రమ్మన్నారు?’’ అని అడిగాను.
‘‘ఆ సంగతి నాకు తెలీదు. ఎవరో ఎవరికో చూసి రమ్మని చెబితే ఆ ఎవరో నాకు చెప్పారు’’ అన్నారు!

‘‘మీకు చెప్పిన ఆ ‘ఎవరో’ ఎవరో చెప్పండి వాఘానీ’’ అన్నాను.
‘‘చెప్తాను. కానీ ఆ ఎవరోకి ఎవరు చెప్పారన్నది మాత్రం నువ్వు నన్ను అడగ్గూడదు’’ అన్నారు.

‘‘అడగను చెప్పండి’’ అన్నాను.
‘‘నేరుగా చెప్పను. నువ్వే అర్థం చేసుకోవాలి మరి’’ అన్నారు. సరే అన్నాను.
‘‘హూ ఈజ్‌ ద చీఫ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ గుజరాత్‌? అండ్‌.. హూ ఈజ్‌ ద డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ గుజరాత్‌?’’ అన్నారు వాఘానీ.

అర్థమైంది. ‘‘వాళ్లిద్దరికీ చెప్పింది ‘హూ ఈజ్‌ ద ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ఇండియా’ కదా’’ అన్నాను.
‘కుర్రాడివి కరెక్టుగానే క్యాచ్‌ చేశావ్‌’ అన్నట్లుగా బొటనవేలు పైకి లేపి, మూతి గుడ్డను మళ్లీ పైకి అనుకుని నా బాత్రూమ్‌లోకి వెళ్లబోయారు వాఘానీ.

‘‘నా టూత్‌పేస్టులో ఉప్పుందో లేదో చూడ్డానికి ఆ చీపురు, బకెట్, ముక్కు గుడ్డా ఎందుకండీ’’ అని అడిగాను.
వాఘానీ ఇబ్బందిగా చూశారు. ‘‘జనరల్‌గా టూత్‌పేస్ట్‌ ఉండేది బాత్రూమ్‌లోనే కదా’’ అన్నారు. ‘‘ఎవరి బాత్రూమ్‌లోకైనా వెళ్లే ముందు ఇలాగే వెళ్లాలని మాకో నియమం’’ అని కూడా అన్నారు.

‘‘సరే, నా టూత్‌పేస్ట్‌లో ఉప్పు లేకపోతే, గుజరాత్‌కి వచ్చే నష్టం ఏమిటి?’’ అని అడిగాను.
మళ్లీ ఇబ్బందిగా చూశారు వాఘానీ.
‘‘గుజరాత్‌కేమీ నష్టం ఉండదు. నీ దగ్గర ఏదో ఒకటి లేదని చెప్పకపోతే, ‘హూ ఈజ్‌ ద ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ఇండియా’కు గుజరాత్‌ ఎన్నికల్లో నష్టం వస్తుంది’’ అన్నారు.

ఇరవై రెండేళ్లుగా రాష్ట్రాన్ని మురికి పట్టించిన బీజేపీ.. ఇరవై మూడేళ్ల కుర్రాడి బాత్రూమ్‌ క్లీన్‌గా లేదని ప్రచారం చెయ్యబోతోందన్నమాట!

- మాధవ్‌ శింగరాజు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top