కాషాయదళం చేతిలో ఎర్రకార్డు

TS Sudhir Writes an Opinion On Arun Jaitley Comments - Sakshi

బాధ్యత గల ఒక కేంద్రమంత్రి మీడియాలో నక్సల్స్‌ ఉనికి ఉందంటూ తన కుట్ర సిద్ధాంతాన్ని ఆ వ్యవస్థకు ఎలా అంటగడతారు? నా ఆలోచన ప్రకారం భయోత్పాతాన్ని సృష్టించడానికి తీసుకునే చర్యలలో ఇది మొదటిది. రెండవది.. కొందరు వ్యక్తుల మీద ముద్రలు వేయడం, వారిని అపకీర్తి పాలుచేయడం. గడచిన వారం అరెస్టయిన వారంతా ఏ తరహా వ్యక్తులో ఒకసారి పరిశీలిస్తే ‘పట్టణ నక్సల్స్‌’ సిద్ధాంతాన్ని ముందుకు తేవడం వెనుక ఉన్న కారణం ఊహకు వస్తుంది. అలా అరెస్టయిన వారిలో వశీనాథన్‌ ఒకరు. ఆయన న్యాయవాది. ట్యుటికోరన్‌లోని స్టెరిలైట్‌ సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారికి న్యాయ సహాయం అందిస్తున్న వ్యక్తి ఆయనే.

భారత ప్రజాస్వామ్యానికి’ ‘సగం మావోయిస్టు’ ఎంత ప్రమాదకరంగా పరి ణమించాడో చెబుతూ కేంద్రంలో ఏ శాఖా లేని మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ మాసారంభంలో మాట్లాడారు. అజ్ఞాతంలో ఉండి పనిచేసేవారికి ఇలాంటివారు జనజీవన స్రవంతిలో కనిపించే మారు రూపాలేనని కూడా జైట్లీ అభివర్ణించారు. ఎన్డీఏ మీద వ్యతిరేకత ఉన్న కొన్ని పార్టీలు మావోయిస్టును తమ ఆయుధంగా ఎలా చూస్తున్నారో కూడా జైట్లీ ట్వీట్‌ చేశారు. ఇలాంటి అవలక్షణాన్ని ప్రజలు గుర్తించవలసిన సమయం వచ్చిందని కూడా పేర్కొన్నారు. జీహా దీలు, మావోయిస్టులు రాహుల్‌ గాంధీ సానుభూతికి నోచుకున్నారంటూ గత వారంలో కూడా కేంద్రమంత్రి ఒక బ్లాగ్‌ ద్వారా విమర్శలు కురిపించారు. ఇదంతా రాజకీయ వేడి చల్లారిపోకుండా చూడడానికి చేస్తున్న పరోక్ష నింద కింద కనిపిస్తే దీని గురించి ఆలోచించవద్దు. కానీ ఎవరి మీదనైనా జీహాదీ అనుకూలురు, మావోయిస్టు అనుకూలురు అంటూ ముద్రలు వేయడం వెనక ఒక ఉద్దేశమే ఉంది. తద్వారా జాతి వ్యతిరేకులుగా కూడా ముద్ర వేయవచ్చు. 

అరుణ్‌ జైట్లీ ఆరోపణ హాస్యాస్పదమని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అభిప్రాయపడ్డారు. కానీ నేను ఈ రాజకీయ సంఘర్షణ గురించి పట్టించుకోను. కానీ, 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు దరిమిలా రెండు మాసాలలోనే ఆర్థిక సర్జికల్‌ స్ట్రైక్స్‌  ద్వారా మావోయిస్టుల వెన్నెముకను ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా విరిచిందో మాత్రం నాకు గుర్తుకొచ్చింది. అదెలాగంటే మావోయిస్టులు తమ నిధులను అడవులలో దాచిపెడతారు. ఆ సొమ్మును వారు రద్దు దరిమిలా బ్యాంకులలో మదుపు చేయలేకపోయారు. అలాగే నోట్లను మార్చుకోలేకపోయారు కూడా. ఈ వాదన నిజమైతే ఇతర పార్టీలతో షరీకవుతూ భారత ప్రభుత్వానికి మావోయిస్టులు పెద్ద బెడదగా పరిణమించారంటూ జైట్లీ చేస్తున్న ఆరోపణ తర్కానికి నిలవదు. అందులో ఒకటి మాత్రమే నిజం కాగలదు. 

రాహుల్‌గాంధీని నేను సమర్థించకపోయినా, పార్టీ ఆయనను రక్షిస్తుంది. 2013 మే నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని దర్భా ఘాటీ దగ్గర జరిగిన దాడిలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రముఖులను ఆ పార్టీ కోల్పోయింది. అలాంటి పార్టీని మావోయిస్టు అనుకూల పార్టీ అని పిలవడం పరోక్ష నింద మరీ పరాకాష్టకు చేరినట్టు ఉంది. 2004లోను తరువాత 2006లోను ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిభావంతంగా రాష్ట్రాన్ని మావోయిస్టు బెడద నుంచి విముక్తం చేసింది. అందుకు మంచి వ్యూహంతో, సమర్థులైన అధికారులతో ఉపయోగించారు. అలాంటి చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు నక్సల్స్‌కు ప్రయోజనం చేకూరాలని కోరుతుందా? 
బీజేపీ నాయకుడు అరుణ్‌ జైట్లీ ఒక్కరే మావోయిస్టుల పైన విరుచుకు పడుతున్నారని అనుకోనక్కరలేదు. అలాంటి ఆరోపణలు ఉగ్రవాదులతో నిండి ఉన్న తమిళనాడుకు చెందిన పొన్‌ రాధాకృష్ణన్‌ నాలుక అంచున ఒకటిన్నర సంవత్సరాలుగా నర్తిస్తూనే ఉన్నాయి. తమిళనాడులోని అన్నా డీఎంకే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, రాష్ట్ర నిఘా వ్యవస్థలు కూడా తన ఆరోపణలను తీవ్రమైనవిగా పరిగణించడంలేదని కేంద్ర మంత్రి కూడా అయిన రాధాకృష్ణన్‌ వాపోతున్నారు. తాజాగా ఆయన ఆక్రోశం రైతుల మీద వ్యతిరేకత నుంచి, 277 కిలోమీటర్ల సేలం చెన్నై ఎనిమిది లేన్ల జాతీయ రహదారి మీదకి మళ్లినట్టు కనిపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల జాతీయ రహదారిని విస్తరించినప్పటికీ, తమ పొలాలను తీసుకుని దానిని ఎనిమిది లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిగా మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాల పట్ల రైతులంతా ఆగ్రహంతో ఉన్నారు. నక్సలైట్లు, మావోయిస్టులు, ముస్లిం ఉగ్రవాదులు, తమిళం పేరుతో వేర్పాటువాదాన్ని ప్రేరేపిస్తున్న ఉగ్రవాద ముఠాలు చాలా సంస్థలలోకి చొరబడ్డారని గడచిన వారంలోనే రాధాకృష్ణన్‌ విమర్శలు కురిపించారు. ఆయన ఇంకొక అడుగు వేసి ఇలాంటి వారు మీడియాలోకి చొరబడగలిగారని కూడా ఆరోపించారు. అన్ని పథకాలను పక్క దోవ పట్టించడానికే పెద్ద కుట్ర జరుగుతున్నదని ఆయన అంటున్నారు. కన్యాకుమారి నుంచి ఎన్నికైన ఈ ఎంపీ జల్లికట్టు నిరసనల మీద కూడా విమర్శలు చేశారు. 2017 జనవరిలో చెన్నైలోని మెరీనా బీచ్‌లో జరిగిన ఆందోళన ప్రజల నాడిని పసిగట్టేందుకు తీవ్రవాదులు చేసిన ఒక ప్రయోగమేనని అన్నారాయన.

తీవ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించి అణచివేసేందుకు వీలుగా ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని కూడా ఎంపీ అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కాపాడాలి గానీ తీవ్రవాదులను కాదని, అలాంటి ప్రభుత్వాల అవసరం ప్రజలకు లేదని ఆయన ప్రకటించారు. ఇంతకీ ఎళప్పాడి పళనిస్వామి ప్రభుత్వం రద్దవుతుందని రాధాకృష్ణన్‌ సూచనప్రాయంగా చెబుతున్నారా? రాధాకృష్ణన్‌ మాట లను తీవ్రమైనవిగా పరిగణించడం ఎందుకంటే, ఆయన నరేంద్ర మోదీ మంత్రిమండలిలో సభ్యుడు. ‘ఇలాంటి ప్రభుత్వాల అవసరం లేదు’ అని ఆయన ప్రకటించడం నాకు చాలా వింత అనిపించింది. తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితి డోలాయమానంగా మారిందన్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఆయన మాటలలో ప్రతిబింబిస్తున్నదా? ఆ రాష్ట్రాన్ని తీవ్రవాదులు ఏలుతున్నట్టు చెప్పే సమాచారం ఏదైనా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక సంస్థల ద్వారా సేకరించిందా? అయితే ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వానికి అందచేయవలసిందని తమిళనాడు మంత్రి డి. జయకుమార్‌ రాధాకృష్ణన్‌ను కోరారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం తీవ్రవాదుల పని పట్టకపోతే, రాష్ట్రపతి కార్యాలయం స్పందించవలసి ఉంటుందన్న హెచ్చరిక కూడా రాధాకృష్ణన్‌ మాటలలో ఉందా? స్టెరిలైట్‌ వ్యతిరేకోద్యమకారులను, సేలం ఎక్స్‌ప్రెస్‌ వే వ్యతిరేకులను గడచిన రెండు వారాలుగా వరస పెట్టి అరెస్టు చేయడానికి కారణం ఇదేనా? 

అయితే ఒకటి. బాధ్యత గల ఒక కేంద్రమంత్రి మీడియాలో నక్సల్స్‌ ఉనికి ఉందంటూ తన కుట్ర సిద్ధాంతాన్ని ఆ వ్యవస్థకు ఎలా అంటగడతారు? నా ఆలోచన ప్రకారం భయోత్పాతాన్ని సృష్టించడానికి తీసుకునే చర్యలలో ఇది మొదటిది. తరువాత కొందరు వ్యక్తుల మీద ముద్రలు వేయడం, వారిని అపకీర్తి పాలుచేయడం. గడచిన వారం అరెస్టయిన వారంతా ఏ తరహా వ్యక్తులో ఒకసారి పరిశీలిస్తే ‘పట్టణ నక్సల్స్‌’ సిద్ధాంతాన్ని ముందుకు తేవడం వెనుక ఉన్న కారణం ఊహకు వస్తుంది. అలా అరెస్టయిన వారిలో వశీనాథన్‌ ఒకరు. ఆయన న్యాయవాది. ట్యుటికోరన్‌లోని స్టెరిలైట్‌ సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారికి న్యాయ సహాయం అందిస్తున్న వ్యక్తి ఆయనే. చెరువుల ఉద్యమకారుడు పీయూష్‌ మనుష్‌ (ప్రస్తుతం బెయిల్‌ మీద విడుదలయ్యారు), విద్యార్థి నాయకుడు వాల్రామతి, సేలం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న నటుడు మన్సూర్‌ అలీఖాన్‌లకు కూడా వశీనాథన్‌ న్యాయ సహాయం చేస్తున్నారు. 260 మంది స్టెరిలైట్‌ వ్యతిరేకోద్యమకారులను అరెస్టు చేసి, మే 22వ తేదీన జరిగిన హింసతో సంబంధం ఉన్నవారిగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారి కోసం తన భూమిని తీసుకోవడాన్ని వ్యతిరేకించే ప్రతి రైతును స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బంధిస్తున్నారు. 

నక్సలైట్లు సాధారణంగా అనధికార పంచాయతీల ద్వారా న్యాయం అందిస్తూ ఉంటారు. దురదృష్టం ఏమిటంటే సోషల్‌ మీడియాను ఉపయోగిం చడం ద్వారా అధికార వ్యవస్థ కూడా సరిగ్గా అదే పనిచేస్తున్నది. కొందరు వ్యక్తులకు పట్టణ నక్సల్స్‌ అంటూ, జాతి వ్యతిరేకులు అంటూ ముద్ర వేయడానికి ప్రధానంగా ట్వీటర్‌ను ఉపయోగిస్తున్నారు. పీయూష్‌ను డబ్బు గుంజే వ్యక్తిగా చిత్రీకరించారు. వాల్రామతిపై నక్సలైట్‌ అని ముద్ర వేశారు. వీరందరినీ వెనుక ఉండి నడిపించే వ్యక్తిగా వశీనాథన్‌ను పేర్కొంటున్నారు. 

శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తిని అరెస్టు చేసే అధికారం ప్రభుత్వాలకు లేదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అయితే వ్యక్తులను అరెస్టు చేయడానికి అనుసరిస్తున్న పద్ధతులే కలవరం కలిగిస్తున్నాయి. ఆ అరెస్టులను గమనిస్తే, నిరసన వ్యక్తం చేస్తే చాలు నిర్బంధం తప్పదన్న సంకేతాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. అయితే రెడ్‌ కారిడార్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో నక్సల్‌ అణచివేత చర్యలలో రెండు దశాబ్దాల పాటు పాలు పంచుకున్న ఒక ఐపీఎస్‌ అధికారి తమిళనాడులో నక్సల్‌ జాడలు లేవని చెప్పారు. అడపాదడపా జరిగే సంఘటనలను బట్టి తమిళనాడు–కేరళ జోన్‌లో నక్సల్స్‌ చొరబడ్డారని చెప్పడం రెడ్‌ కార్డును ఉపయోగించుకోవడం తప్ప, మరేమీ కాదని ఆయన అన్నారు. అంటే, ప్రజల గురించి ఎవరు గళం ఎత్తినా, మానవ హక్కులను రక్షించాలని ఎవరు మాట్లాడినా అలాంటి వారందరి మీద పట్టణ నక్సల్స్‌ అంటూ ముద్ర వేస్తున్నట్టు కనిపిస్తున్నది.

శక్తిమంతమైన ఒక కార్పొరేట్‌ సంస్థకు వ్యతిరేకంగా ఆందోళన మొదలుపెట్టిన వారిని భయభ్రాంతులను చేయడానికే యథేచ్ఛగా అరెస్టులు సాగిస్తున్నారని స్టెరిలైట్‌ వ్యతిరేకోద్యమానికి నాయకత్వం వహించిన ఫాతిమా బాబు అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ తన మీద నీచమైన ఆరోపణలు చేస్తూ బురద చల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగాన్ని ఎవరు వ్యతిరేకించినా వారిని వెతికి వెతికి పట్టుకుంటున్నారని హ్యూమన్‌ రైట్స్‌ గ్రూప్‌ పీపుల్స్‌ వాచ్‌ నాయకుడు హెన్రీ టిఫాన్‌ అన్నారు. ఇప్పుడు తాను సేలం వెళితే వెంటనే అరెస్టు చేయడం ఖాయమనీ, తమిళనాడు అత్యంత వేగంగా ఖాకీవనంగా మారిపోతున్నదని, ఈ రాష్ట్రంలో ఎంతమాత్రం ప్రజాస్వామ్యం లేదని చెన్నైలో ఉండే టిఫాన్‌ చెప్పారు. మావోయిస్టు ముద్ర కూడా చాలినంత బలంగా లేదని భావిస్తే, వేదాంతకు చెందిన స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్ర జరిగిందని చెప్పడానికి బాబా రాందేవ్‌ రంగంలోకి దిగుతారు. 


టీఎస్‌ సుధీర్‌, వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు
ఈ–మెయిల్‌ : tssmedia10@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top