అనుసరించారా? వెంబడించారా?

Sri Ramana Article On Chandrababu Naidu Over TDP - Sakshi

అక్షర తూణీరం

పచ్చ తమ్ముళ్లకి అంతా కొత్తకొత్తగా ఉంది. తూర్పేదో, పడమరేదో ఒక సారి చూసి మరీ ఖరారు చేసుకోవలసి ఉంది. చంద్రబాబు గతంలో కూడా గడ్డుకాలం చూశారు. పదేళ్లపాటు పార్టీని బతికించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఇట్లాంటి దీనావస్థ టీడీపీకి వస్తుందని ఆయన ఊహించలేదు. ఆయన సహచరులైతే అస్సలు శంకించలేదు. జనమంతా మన వెనకాలే ఉన్నారనుకున్నారు. కానీ జనం అనుసరిస్తున్నారా, వెంబడిస్తున్నారా తెలుసుకోలేక పోయారు. ప్రజలు చంద్రబాబు ఓటమి కోసం చాలా చిత్తశుద్ధితో కృషి చేశారు. ఒక గ్రామీణుడు, ‘ఇన్ని సీట్లు కూడా రావల్సిన మాట కాదండీ. చంద్రబాబు ఎందుకు గెలిచాడో, ఎట్లా గెలిచాడో మాకు బొత్తిగా అర్థంకాని విషయం’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. జనం కొన్నిసార్లు ఉత్తినే తీర్పు ఇచ్చి ఊరుకోరు. గుణపాఠం చెప్పి నిశ్శబ్దం వహిస్తారు. ఇప్పుడదే జరిగింది.

పాత అలవాటుగా ప్రతిపక్ష బెంచీల్లో కూచున్నా అధికార బెంచీలనుకుని టీడీపీలు సొంతడబ్బా కొట్టుకుంటున్నారు. ఇంకా గట్టిగా ఆరువారాలు కూడా కాలేదు కొత్త ప్రభుత్వం వచ్చి. అప్పుడే తెలుగుదేశీయులు అయిదేళ్లు ఎప్పుడైపోతాయని వేళ్లుమడిచి లెక్కలేసుకుంటున్నారు. ఓటర్లు విసిగి వేసారి పోయారని మాజీ ముఖ్యమంత్రి బాబు గ్రహించాలి. అసెంబ్లీని చూస్తుంటే టీడీపీ అసహనం ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. నెలరోజులు తిరక్కుండానే రైతులకు విత్తనాలేవి? పరిపాలనా దక్షత లేదంటూ కంఠశోష పడుతున్నారు. నాటిన విత్తుల్లో మొలకలేవి? వచ్చిన మొలకలు దుబ్బు కట్టలేదు. కట్టినా పూత రాలేదు. వచ్చినా పిందె దిగలేదు. ఇదే మా ప్రభుత్వంలో అయితే ఆదివారంనాడు అరటి మొలిచింది చందంగా ఏడో రోజుకి గెలలుకొట్టి పందారాలు చేసే వాళ్లమంటూ జబ్బలు చరుస్తున్న చిన్న ప్రత్యర్థి వర్గాన్ని చూస్తుంటే జాలేస్తోంది.

‘శ్వేతపత్రం’ నిబద్ధతకి దేశం హయాంలో నమ్మకం కోల్పోయింది. ఎన్నికల ముందు అస్త్రా లను సంధించినట్టు గుట్టలు గుట్టలుగా శ్వేతపత్రాస్త్రాలను తెలుగుదేశం జనంమీద కురిపిం చింది. అవన్నీ ఎండుటాకుల్లా నేలకి రాలాయ్‌ ఏ మాత్రం బరువు లేకుండా. చివర చివర్లో చంద్రబాబుకి వయసుమీద పడటంతోబాటు జగన్‌ అనుకూల పవనాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీనికితోడు అదనంగా బిడ్డ బరువొకటి! వృద్ధ కంగారూలా లోకేశ్‌ బాబుని, ఆయన వదిలే అజ్ఞానపు బెలూన్లని మోయడం చంద్రబాబుకి తప్పనిసరి అయింది. దాంతో ఆయన ధోరణిలో మార్పు వచ్చింది. ఇందిరాగాంధీని కీర్తించడం, రాహుల్‌ గాంధీని, సోనియమ్మని నెత్తిన పెట్టుకోవడం లాంటి విపరీతాలు చుట్టుకున్నాయ్‌. మోదీ కుటుంబ విషయాల్లో తలపెట్టి, అసలే దెబ్బతిన్న బుర్రని మరింత చెడగొట్టుకున్నారు.

ఆ తరుణంలో జగన్‌మోహన్‌రెడ్డిని దూషించడానికి చంద్రబాబుకి తిట్లు కూడా కరువయ్యాయి. దాంతో పూర్తిగా దెబ్బతిన్నారు. ఇంకా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. అపోజిషన్‌లో చేరిన చంద్రబాబు ముందు ప్రజల మనసుని అర్థం చేసుకోవాలి. సంయమనం పాటించాలి. వారి అనుచరులను కూడా క్రమమార్గంలో నడిపించాలి. ప్రభుత్వంలోకి వచ్చినవారు కూడా వారి శక్తి సామర్థ్యాల మేరకు ప్రజాహితం కోరి పనిచేస్తారు. అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని అదుపు చేస్తారు. వృథా ఖర్చులు, అస్మదీయులకు పెద్దపీటలు తగ్గుతాయి.

పుటకనించి అడ్డంగా నడవటానికి అలవాటుపడ్డ ఎండ్రకాయ ఈ భూమ్మీద సకల జీవులు అడ్డంగా నడుస్తున్నాయని తెగ విస్తుపోతూ ముక్కు మీద కాలివేలును వేసుకుంటుందిట! ఉన్న నలుగురూ కాస్త ఓర్పు, సహనాలు వహించండి. విత్తనాలు చక్కగా చిలకల్లా మొలకెత్తుతాయ్‌. భూమ్మీద నిలబడి తలవంచి సూర్యభగవానుడికి నమస్కరిస్తాయ్‌. ఇరుగు పొరుగుల్లో స్నేహ సౌరభాలు వెల్లి విరుస్తాయ్‌. ఈ విరామంలో చంద్రబాబు కర్ణాటకని దారిలో పెడితే ఉభయతారకంగా ఉంటుందని కొందరి సూచన.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

శ్రీరమణ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top