శాంతి సాధన ఓ ముళ్లబాట...!

Shekhar Gupta Article On Atal Bihari Vajpayee Foreign Policy With Pakistan - Sakshi

పాకిస్తాన్‌ నూతన ప్రధానికి అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటగా, భారత్‌తో శాంతి ప్రక్రియకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ఆలోచన. సైనికాధికారుల తలపై కూర్చుని అలా చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. రెండోది. ఎన్నికైన ఏ ప్రధానమంత్రినీ పాక్‌ సైనిక వ్యవస్థ పూర్తి కాలం పదవిలో కొనసాగడానికి అనుమతించ లేదు. ఇక మూడోది, ఎన్నికైన ప్రతి ప్రధాని ప్రవాసం పాలయ్యారు, జైలుపాలయ్యారు, హత్యకు గురయ్యారు. పాక్‌లో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయడానికి సంకల్పిం చిన ప్రతి ప్రయత్నమూ బెడిసికొట్టింది. ఇవన్నీ దాటుకుని ఇమ్రాన్‌ శాంతిసాధనకు ప్రయత్నించాడంటే, పాక్‌ సైన్యం చెప్పి ఉంటుంది కాబట్టి దానికి పూనుకుంటాడు.

భారత్, పాక్‌ మధ్య శాంతి స్థాపనకు అత్యంత సాహసోపేత, నాటకీయ ప్రయత్నం గురించి తెలియని విషయాలు వెల్లడించ డానికి పాకిస్థాన్‌ 30వ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణం చేస్తున్న రోజే తగిన రోజని భావిస్తున్నా. ఈ ప్రయత్నం చేసిన ఇద్దరు ఎన్నికైన నేతల్లో ఒకరు గురువారం కన్నుమూయగా, రెండో నాయకుడు క్రూరమైన రావల్పిండి జైల్లో మగ్గుతున్నారు. దీనిలో ఈ వ్యాస రచయితకు కూడా చిన్న పాత్ర ఉంది. మియా నవాజ్‌ షరీఫ్‌ 1997లో రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లకే అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇండియాలో అధి కారంలోకి వచ్చింది. అప్పటికి కొంత కాలంగా భారత–పాక్‌ సంబంధాలు మందగించిన స్థితిలో ఉన్నాయి. వాజ్‌పేయి సర్కారు పోఖ్రాన్‌–2 పేరుతో అణుపరీక్ష జరపడంతో ఇవి మరింత క్షీణించాయి. పాకిస్తాన్‌ చాగైలో అణుపరీక్షతో పదునైన జవాబి చ్చింది. 1998 చివరి మాసాల నాటికి రెండు వైపులా ఓర్పు నశించిన సూచనలు కనిపించాయి. ఇద్దరు కొత్త నేతలూ రెండు దేశాల సంబంధాలు మెరుగుప డాలని కోరుకున్నాగాని, పరస్పర అవిశ్వాసం అందుకు అడ్డు నిలిచింది. ఢిల్లీ–లాహోర్‌ బస్సు సర్వీసు ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉభయ దేశాల ఉన్నతాధికారుల వల్ల ముందుకు సాగలేదు.

ఈ దశలో చలికాలం ఆరంభంలో పాకిస్థాన్‌ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నుంచి అని రాసి ఉన్న ఈ లేఖ కవరుపై ఉన్న పోస్టల్‌ ముద్రలను బట్టి చూస్తే ఇది ఢిల్లీ చేరడానికి చాలా వారాలు పట్టిందని అర్థమైంది. మధ్యలో ఈ లేఖ ఎన్వలప్‌ను రెండు దేశాలకు చెందిన వివిధ శాఖలు తెరచి, చదవి మళ్లీ మళ్లీ సీలు చేశాయి. ఎందుకంటే, పాక్‌ ప్రధాని సాధారణ పోస్టులో గతంలో ఉత్తరం పంపలేదు. కొన్ని నెలల క్రితం ఇంటర్వ్యూ కోసం నేను రాసిన లేఖకు జవాబుగా ఆలస్యంగా పంపినా ఆత్మీయంగా పంపిన స్పందన ఇది. నేను ఇస్లామా బాద్‌లోని పాక్‌ ప్రధాని కార్యాలయానికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను. నవాజ్‌ షరీఫ్‌ నాకు ఫోన్‌ చేసి, ఇంటర్వ్యూ చేయడానికి పాకిస్థాన్‌ ఎందుకు రాకూడదని నన్ను అడిగారు. కొద్దిసేపు నేను మాట్లాడాక, ‘‘ఇద్దరు ప్రధానులూ సంబంధాలు ముందుకు సాగ డానికి ఏమీ చేయలేకపోతున్నప్పుడు ఇంటర్వ్యూల వల్ల ప్రయోజనం ఏముంటుంది? పెద్ద ఒప్పందాల సంగతి వదిలేయండి. కనీసం బస్సు సర్వీసు కూడా మొదలు కాలేదు’’ అన్నాను. దీనికి షరీఫ్‌ దౌత్య వేత్తలు మాట్లాడే రీతిలో కొన్ని కారణాలు చెప్పారు. నేను సరదాగా పంజాబీలోనే మాట్లాడుతూ ‘‘ నాకు మీరిచ్చే ఇంటర్వ్యూలోనే బస్సు సర్వీసు ప్రారంభించే విషయం ప్రకటించడంతోపాటు, మొదటి బస్సులో రావాలని మా ప్రధానిని ఎందుకు ఆహ్వానించకూడదు?’’ అని ప్రశ్నించాను. నా సలహాను నవాజ్‌ షరీఫ్‌ సీరియస్‌గా తీసుకుని ఆలోచించారు. నా ఐడియా ఆయనకు నచ్చింది. అయితే, తాను ఆహ్వానించాక భారత ప్రధాని అందుకు నిరాకరిస్తే ఏం చేయాలి? అనే అనుమానం ఆయనను పీడించింది. అదే జరిగితే బావుండదు కదా. నేను విషయం కనుక్కుని చెబుతానని ఆయనతో అన్నాను.

వాజ్‌పేయికీ నచ్చిందీ ప్రతిపాదన!
విషయం తెలియజేయగానే, ఈ ప్రతిపాదన వాజ్‌పేయికి కూడా నచ్చింది. అయితే, పాకిస్తాన్‌ నుంచి తిరిగి వచ్చాకే నేను ఆయనను కలవాలనీ, అప్పటిదాకా ఇది ప్రచురించవద్దని వాజ్‌పేయి చెప్పారు. లాహోర్‌లోని సొంత ఇంట్లో నవాజ్‌ షరీ ఫ్‌ను ఇంటర్వ్యూ చేశాను. మధ్యమధ్యలో భారత– పాక్‌ క్రికెట్‌ టెస్ట్‌ ప్రత్యక్ష ప్రసారంతో మా సంభాష ణకు బ్రేకులు పడ్డాయి. ఆయన తన మాట నిలబెట్టు కున్నారు. బస్సు సర్వీసుకు అంగీకారం తెలపడమే గాక, వాజ్‌పేయిని ఈ బస్సులో రావాలని ఆహ్వానిం చారు. చరిత్రలో నిలిచిపోయేలా తాను భారత ప్రధా నికి స్వాగతం పలుకుతానని షరీఫ్‌ తెలిపారు. షరీఫ్‌తో ఇంటర్వ్యూను ఒక రోజు ఆపాలనీ, తాను విమానంలో లక్నోలో దిగే రోజు అది ప్రచురితమయ్యేలా చాడాలని వాజ్‌పేయి నన్ను కోరారు. ఆనవాయితీగా భారత విదేశాంగశాఖ అనుమానాలు వ్యక్తం చేయక ముందే తాను ఆహ్వానం అంగీకరిస్తానని వాజ్‌పేయి చెప్పారు. ఆ తర్వాత జరిగిదంతా అందరికీ తెలిసిన చరిత్రే. అత్యంత నాటకీయ పరిణామాల తర్వాత అటల్‌ బస్సు యాత్ర జరిగింది. కొన్ని ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి. ముఖ్యంగా వాజ్‌ పేయికి స్వాగతం పలికే సమయంలో ఆయనకు శాల్యూట్‌ చేయడానికి పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ అంగీకరించలేదు. బస్సు దిగాక వాజ్‌పేయి మీనారే పాకిస్తాన్‌ మెట్ల వరకూ వచ్చి, పాక్‌ సుస్థిరతతో సుసపన్నంగా ఉండడం భారతదేశా నికి మేలని ప్రకటించారు. నేను ఈ యాత్రలో భాగం కావడం నాకెంతో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఇది నాకు మొదటి ఏకైక అనుభవం. బస్సు యాత్ర విషయం నేను ఇంటర్వ్యూ ద్వారా ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఓ పక్క ఇద్దరు ప్రధానులూ తమకు పూర్తిగా అవగాహన లేని శాంతి చర్చలు జరుపు తుంటే, మరో పక్క పాకిస్తానీ ఆర్మీ కార్గిల్‌ ప్రాంతం లోని విశాల సరిహద్దు గుండా తన సైనికులు భారత భూభాగంలోకి చొరబడేలా చేసింది. మే నెల మధ్య నాటికి ఉభయ దేశాల దళాల మధ్య తొలి ఘర్షణలు జరిగాయి. మే 26న ఇండియా తన వైమానికి దళాన్ని రంగంలోకి దింపింది. మరుసటి రోజు రెండు భారత మిగ్‌ విమానాలను పాక్‌ సైనికులు భుజాలపై నుంచి ప్రయోగించే క్షిపణులతో కూల్చివేశారు. శత్రు శిబిరం వివరాలు తెలుసుకునే క్రమంలో నెమ్మదిగా పోతున్న మూడో యుద్ధవిమానం ఇంజన్లలో ఒకదానికి క్షిపణి దెబ్బతగిలింది. అయితే, అది అదృష్టవశాత్తూ కూలి పోకుండా తిరిగి తన స్థావరానికి సురక్షితంగా వచ్చే సింది. ఇలాంటి నాటకీయ మలుపునకు ఎవరూ సిద్ధంగా లేరు.

ప్రధాని నుంచి నా హోటల్‌ రూముకు ఫోన్‌!
ఉదయం ఆరున్నరకు ముంబైలో నేను బసచేస్తున్న హోటెల్‌ రూములో ఫోను మోగింది. ప్రధానమంత్రి నాతో మాట్లాడాలనుకుంటున్నారని అవతలి వ్యక్తి చెప్పారు. వెంటనే వాజ్‌పేయి ఫోన్‌లైన్‌లోకి వచ్చి ‘‘యే క్యా కర్‌ రహాహై మిత్ర్‌ ఆప్కా?(మీ స్నేహి తుడు చేస్తున్న ఈ పనేంటి?)’’అని ప్రశ్నించారు. పాకి స్తాన్‌ ఆర్మీ చీఫ్‌ చైనా పర్యటనలో ఉండగా కశ్మీర్‌ ముజాహదీన్ల చేతుల్లోకి క్షిపణులు రావడంపై  అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారని ఆయన అన్నారు. ‘అసలేం జరుగుతోంది? ఈ విషయం మీరు మీ మిత్రుణ్ని అడగగలరా?’ అని ఆయన నన్ను ప్రశ్నించారు. వెంటనే నేను ఇస్లామాబాద్‌లోని నాకు తెలిసిన పాత ఫోన్‌ నంబర్‌కే డయల్‌ చేసి ఓ కబురు పంపాను. ఆ రోజు రాత్రి నాకు పాక్‌ రాజదాని నుంచి ఫోనొచ్చింది. నవాజ్‌ షరీఫ్‌ కూడా వాజ్‌పేయి మాదిరిగానే కలవరపాటుతోనే మాట్లా డారు. ‘‘నేను ఆయనకు ద్రోహం చేయబోనని ఆయ నకు మీరు చెప్పండి. అధీనరేఖపై ఎప్పటిలా కొన్ని మామూలు ఘర్షణలు జరిగాయని నిన్న నాకు చెప్పారు. నేడు గగనతల ఉల్లంఘనలు జరిగాయి. నాకు కూడా ఈ పరిణామాలపై ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ వైమానిక ఘర్షణలను ప్రస్తావిస్తూ షరీఫ్‌ నాతో అన్నారు.

రాజధానికి రాగానే వాజ్‌పేయి, ఆయన సహాయకుడు బ్రజేష్‌ మిశ్రా నాతో ఫోన్లో మాట్లాడారు. జనరల్‌ ముషారఫ్, ఆయన డెప్యూటీ సైనికాధికారి మధ్య జరిగిన సంభాషణలను ‘మన మనుషులు’ రహస్యంగా విన్నారనీ, ఇది పూర్తిగా పాక్‌ చేపట్టిన సైనిక చర్యయేనని తేలిందని వారు నాకు చెప్పారు. ‘‘కాబట్టి, మీరు ఇంటర్వూ్య పేరుతో ఇస్లామాబాద్‌ వెళ్లి, పాక్‌ సైనికాధిపతుల మధ్య జరిగిన ఈ రహస్య సంభాషణ గురించి నవాజ్‌ షరీఫ్‌కు చెప్పగలరా?’’ అని నన్ను అడిగారు. కానీ, నాకు ఈసారి విషయం తీవ్రత అర్థమైంది. నేను మొదట చేసింది నిజమైన ఇంటర్వూ్య. దాని సత్ఫలి తమే బస్సు యాత్ర. వారు చెప్పినట్టు చేస్తే జర్నలిజం పరిధి దాటినట్టే అవుతుందని వారికి తెగేసి చెప్పాను. వారిద్దరూ అర్థం చేసుకున్నారు. వారు అంతటితో ఆగకుండా మాజీ ఎడిటర్‌ ఆర్‌.కె.మిశ్రాకు ఈ పని అప్పగించారు. ఆయన అప్పుడు అబ్జర్వర్‌ ఫౌండే షన్‌లో పనిచేస్తున్నారు. వారు చెప్పినట్టే ఆయన ఇస్లా మాబాద్‌కు అనేకసార్లు వెళ్లొచ్చారు. పాక్‌ సేనల చర్య లకు సాక్ష్యంగా పైన చెప్పిన రహస్య సంభాషణల టేపులను కూడా ఆయన పాక్‌ ప్రధానికి అందజే శారు. దీంతో పాత్రికేయ పరిధిని దాటిన నా సాహసం ఇంతటితో ముగిసింది.

పాకిస్తాన్‌ నూతన ప్రధానమంత్రికి ఇక్కడ అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటగా, భారత్‌తో శాంతి ప్రక్రియకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ఆలోచన. సైనికాధికారులు తలపై కూర్చుని అలా చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. రెండోది. ఎన్నికైన ఏ ప్రధానమంత్రినీ పాక్‌ సైనిక వ్యవస్థ పూర్తి కాలం పదవిలో కొనసాగడానికి అనుమతించలేదు. ఇక మూడోది ఏమిటంటే ఎన్నికైన ప్రతి ప్రధాన మంత్రీ ప్రవాసం పాలయ్యారు, జైలుపాలయ్యారు, హత్యకు గురయ్యారు. గత దశాబ్ది కాలంలో ప్రజా స్వామ్యానికి ఊపిరిపోయడానికి సంకల్పించిన ప్రతి ప్రయత్నమూ ఎదురుదెబ్బ తిన్నది. ఇవన్నీ దాటు కుని ఇమ్రాన శాంతిసాధనకు ప్రయత్నించాడంటే, పాక్‌ సైన్యం చెప్పి ఉంటుంది కాబట్టి దానికి పూను కుంటాడు. అంతే తప్ప సైన్యాన్ని ధిక్కరించి కాదు. చివరగా, ఇరుదేశాల సంబంధాల్లో నూతన శకం మొదలైనట్లయితే అది అందరిలో ఆశలు రేపవచ్చు కానీ కపటత్వంతో కూడి ఉంటుంది. అప్పటికి కూడా అది ఆ తర్వాత ఎప్పుడో చెప్పాల్సిన చక్కటి గాథగా మారవచ్చు. ఈ విషయాలను ఇప్పుడు చెప్పడానికి నాకు నాలుగు కారణాలున్నాయి. వాజపేయి నిష్క్ర మణం, నవాజ్‌ షరీప్‌ జైలు శిక్ష, ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారం, అన్నిటి కంటే ముఖ్యంగా ఆనాటి ఘటన జరిగి ప్రస్తుతం 20 సంవత్సరాలు గడిచిపోయాయి.

శేఖర్‌ గుప్తా(వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌)
twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top