విదేశీ విధానంపై చెరగని ముద్ర.. | Atal Bihari Vajpayee Foreign Policy | Sakshi
Sakshi News home page

విదేశీ విధానంపై చెరగని ముద్ర..

Aug 17 2018 4:52 AM | Updated on Aug 17 2018 4:52 AM

Atal Bihari Vajpayee Foreign Policy - Sakshi

1998–2004 మధ్యకాలంలో ప్రధాని పదవిని నిర్వహించిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి నిలిచారు.  ప్రధానిగా విదేశాంగ విధానంపై వాజ్‌పేయి తనదైన ముద్ర వేశారు. ఈ కాలంలో ప్రధానంగా పోఖ్రాన్‌–2 అణుపరీక్షలు, పాకిస్తాన్‌తో స్నేహసంబంధాల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు, చొరవతో పాటు 1999లో లాహోర్‌ డిక్లరేషన్‌ను రూపొందించడంలోనూ తన ప్రభావాన్ని చూపారు. పోఖ్రాన్‌ అణుపరీక్షల నేపథ్యంలో పాకిస్తాన్‌ కూడా పరీక్షలు జరపడంతో దక్షిణాసియాలో ఉద్రిక్తతలకు దారితీసింది.

భారత్‌ వైఖరిని పశ్చిమదేశాలు ఖండించడంతో పాటు వివిధ రూపాల్లో ఆర్థిక ఆంక్షలు కూడా విధించారు. దీంతో అమెరికా ఇతర ఆర్థికసంస్థల నుంచి అందే ఆర్థికసహాయం కూడా నిలిచిపోయింది. సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా కఠినమైన ఆంక్షలు అమలయ్యాయి. పాక్‌తో పాటు అమెరికాతో కూడా బంధాన్ని పెంచుకునే ప్రయత్నాలు 1998లో మొదలయ్యాయి. ఈ కారణంగా రెండుదేశాల మధ్య మూడేళ్లపాటు ద్వైపాక్షిక చర్చలకు ఆస్కారం ఏర్పడింది. ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడేందుకు ఇవి దోహదపడ్డాయి. అమెరికా ప్రోద్భలంతో భారత–పాక్‌లమధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు పునఃప్రారంభమయ్యాయి.

వాజ్‌పేయి చొరవ కారణంగా 1999 ఫిబ్రవరిలో లాహోర్‌కు బస్సుయాత్రలో వెళ్లి అక్కడ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో లాహోర్‌ ఒప్పందంపై సంతకం చేశారు. రెండుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు అణ్వాయుధాల పోటీకి దిగరాదని, అణ్వాయుధాల వినియోగాన్ని విడనాడాలని, ఇరుదేశాల మధ్య ఘర్షణలు తగ్గించేందుకు కషి చేయాలని నిర్ణయించారు. 1988లో రాజీవ్‌ –బేనజీర్‌ల మధ్య అణ్వాయుధ రహిత ఒప్పందం కుదరగా, దీన్ని రెండోదిగా పరిగణిస్తున్నారు. అయితే నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని ముషార్రఫ్‌ నేతత్వంలోని సైన్యం కూలదోయడంతో ఒప్పందం నిరుపయోగంగా మారింది. తర్వాత కార్గిల్‌ యుద్ధం నేపథ్యంలో దీనికి విలువలేకుండా పోయింది.  

కశ్మీర్‌లోని కార్గిల్‌ మంచుకొండల్లోకి పాకిస్తాన్‌ బలగాలు చొచ్చుకురావడంతో భారత్‌–పాక్‌ల మధ్య పరిమిత యుద్ధానికి దారితీసింది. పాక్‌ దురాక్రమణను అమెరికాతో పాటు పశ్చిమదేశాలు ఖండించాయి.ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కు పిలిపించాల్సిందిగా నవాజ్‌షరీఫ్‌ను అమెరికాకు పిలిపించి మరీ హెచ్చరించారు. ఈ విధంగా రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారిగా భారత్‌ పట్ల అమెరికా అనుకూల వైఖరి తీసుకుంది. 1999 జూలైలో కార్గిల్‌ నుంచి పాక్‌ దళాలు వెళ్లిపోవడంతో భారత సైన్యం ఆపరేషన్‌ విజయ్‌లో విజయం సాధించింది.

1978లో
జిమ్మీకార్టర్‌ భారత్‌లో పర్యటించాక 22 ఏళ్ల అనంతరం 2000లో అమెరికా అధ్యక్షుడి హోదాలో బిల్‌ క్లింటన్‌ మన దేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ‘ఇండియా రిలేషన్స్‌ : ఏ విజన్‌ ఫర్‌ ది 21 ఫస్ట్‌ సెంచరీ’పత్రంపై సంతకాలు చేశారు. ఆ తర్వాతి కాలంలో అమెరికాతో భారత్‌ సంబంధాలు బలపడేందుకు ఈ పర్యటన, తదనంతర పరిణామాలు దోహదపడ్డాయి.  

2001లో
జూలైలో భారత్‌తో సంబంధాల పునరుద్ధరణలో భాగంగా పాక్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ మనదేశాన్ని సందర్శించారు. కశ్మీర్‌ అంశంపై ముషార్రఫ్‌ మొండిపట్టుదల కారణంగా ఆగ్రాలో జరిగిన ఈ శిఖరాగ్రభేటీ నుంచి ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. ‘లుక్‌ ఈస్ట్‌ పాలసీ’లో భాగంగా వియత్నాం, ఇండోనేసియా దేశాల్లో పర్యటించిన వాజ్‌పేయి వ్యాపార, వాణిజ్య అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఆసియాన్‌ దేశాలతో వాజ్‌పేయి ప్రభుత్వం మంచి సంబంధాలు నెలకొల్పగలిగింది. 2000 జూన్‌లో లిస్బన్‌లో మొట్టమొదటి భారత్‌–ఐరోపా దేశాల సంఘం (ఈయూ) శిఖరాగ్ర సమావేశం జరిగింది.  

2003లో
చైనాతో సంబంధాలు మెరగయ్యేందుకు, సరిహద్దు సమస్యలపై చర్చించుకునే దిశలో చర్యలు మొదలయ్యాయి.  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌లో పర్యటించిన సందర్భంగా రెండుదేశాల మధ్య ఆయుధాల సరఫరా, విమానాల కొనుగోలు, తదితర అంశాలపై సైనిక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాతి ఏడాదే వాజ్‌పేయి రష్యాలో పర్యటించినపుడు ఇరుదేశాల మధ్య వాణిజ్య, భద్రతా, రాజకీయ రంగాల్లో సహకారం కోసం ‘మాస్కో డిక్లరేషన్‌’పై సంతకాలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement