ప్రియతమ నేత

Sri Ramana Article On Atal Bihari Vajpayee - Sakshi

అక్షర తూణీరం

ఒక మంచి మనిషి, గొప్ప కవి, మహానేత, దార్శనికుడు, హృదయవాది, భరతమాత ముద్దుబిడ్డ శాశ్వతంగా కన్ను మూశారు. అటల్‌ బిహారీ వాజ్‌ పేయి మహా శూన్యాన్ని సృష్టించి వెళ్లిపోయారు. దాదాపు దశాబ్దంగా ఈ కర్మ యోగి యోగనిద్రలో ఉన్నట్టుగా ఉన్నారు. ప్రజాజీవితానికి దూరంగా ఉన్నా.. ప్రభుత్వాలు, ప్రజలు ఆయన్ని తలుచుకోని క్షణం లేదు. విలక్షణమైన వ్యక్తిత్వం. అనుకరణీయుడేగానీ అనుసరణకు అసాధ్యుడు. ‘‘మీరు ప్రధాని అయ్యారు. రేపట్నించి జన సామాన్యంలోకి వెళ్లలేరు. బోలెడు సెక్యూరిటీ కంచెలుంటాయ్‌’’ అని ఒక పాత్రి కేయుడు వ్యాఖ్యానించినప్పుడు, అటల్‌జీ దుఃఖిస్తూ కంటనీరు పెట్టారు. ‘‘నాకు శిఖరంలా ఎదగాలని లేదు, నలుగురిలో నలుగురితో ఉండాలని ఉంది. కొండ శిఖ రాల మీద రాళ్లు రప్పలు తప్ప పచ్చదనం ఉండదు. చెమ్మ అసలే ఉండద’’ని కవితామయంగా అన్నారు. సభల్లో, సమావేశాల్లో వాజ్‌పేయి నోరు విప్పితే అమృతం కురిసేది. వేద రుక్కులు, ఉపనిషత్‌ వాక్యాలు సందర్భోచితంగా వచ్చి వర్షించేవి. ఇంగ్లిష్, హిందీ, సంస్కృత మాధ్యమాలలో డిగ్రీ తీసు కున్నారు. రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. తర్వాత ఆ శాస్త్రానికి ఆయనే పాఠ్యగ్రంథంలో నిలిచారు. కవితలు ఆశువుగా భావోద్వేగంతో చెప్పడం తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నానని చెప్పుకు న్నారు. కబీర్‌ రామచరితమానస్, మహాదేవి వర్మ ‘గీత’ తనకి గొప్ప ప్రేరణనిచ్చాయనేవారు. అటల్‌జీపై అవిశ్వాసం పెట్టినప్పుడు, పదవి నుంచి దిగిపోతూ ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగం, ప్రపంచంలోనే అతి గొప్ప విశ్లేషణాత్మక సందేశంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న విశ్వాసానికి కూడా ఆ సన్నివేశం నిదర్శనం.

వాజ్‌పేయి మేథలో సరస్వతీ, హృదయంలో సిద్ధార్థుడు కొలువుతీరి ఉన్నారని పెద్దలు అంటారు. ఆయన ప్రసంగాలు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసేవి. అటల్‌జీ ‘సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌’ గురించి చెప్పాలంటే వెయ్యి సందర్భాలు ఉటంకించాలి. ఆయన పరిపాలనా దక్షతకి, వాజ్‌పేయి హయాంలో దృష్టిపెట్టిన రోడ్లు, కరెంటు, నీళ్లు ఈ మూడు మౌలిక అంశాలను చెబుతారు. పోఖ్రాన్‌ అణుపరీక్షని గుర్తు చేసుకుంటారు. కార్గిల్‌ యుద్ధం మన సేనల్లో ఆత్మ స్థయిర్యం పెంచింది. ప్రైవేటైజేషన్‌లో ఆయన వేయించిన ముందడుగులు దేశ ఆర్థిక స్థితిని మార్చాయి. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా, పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో చిత్రకారుడు బాపు రచించిన రామాయణ వర్ణచిత్రాలు వాజ్‌పేయి ఆవిష్కరించారు. ‘‘రాముడు మనుషుల్లో దేవుడు. ఆదర్శప్రాయుడు. అందుకే ఆయనకు గుళ్లు కడతాం. ఆయన సన్మార్గానికి, ఆయన ఆదర్శాలకు చిహ్నంగా కడతాం. యుగాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. రాముడు దేవుడు కాదు కాబట్టి నాస్తికులు కూడా దణ్ణం పెట్టుకోవచ్చు. తప్పులేదు’’ అని సభలో నవ్వులు పూయించారు.

‘అజాత శత్రువు’ అనే మాట ద్వాపరయుగంలో ధర్మరాజుకి చెల్లిపోయింది. మళ్లీ కలియుగంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయికి చెల్లింది. అందరూ ఆమోదించారు. వాజ్‌పేయికి ప్రాంతం వర్తించదు. పూర్తిగా దేశవాసి. కనుకనే అన్ని ప్రాంతాలనించి గెలిచి సభకి వచ్చారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఆయనకు మిత్రులంటే మిత్రులే! అటల్‌జీ ఇంట్లో పీవీ ఫొటో ప్రముఖంగా ఉండటం చూసి, ఇదేమిటని అడిగారట ఒకాయన. రాజకీయ లబ్ధి కోసం మిత్రులను వదులుకోలేను అని జవాబు ఇచ్చారట.

‘‘ఒక పల్లెటూరి బడిపంతులు కొడుకునైన నా వంటి సాధారణ పౌరుడికి ప్రధాన పదవి కట్ట బెట్టారు. మన ప్రజాస్వామ్య శక్తికిది నిదర్శనం. ఈ దేశంలో వంశపాలనకు కాలం చెల్లింది’’ అంటూ హెచ్చరించారు. దీని వెనుక ఒకే ఒక్క ఓటు బలంతో ఆయనను గద్దె దింపిన సంఘటన తాలూకు ఉద్వేగం ఉంది. రోషం ఉంది. ‘‘నా విధి నిర్వహణలో విజయం వరించినా, అపజయం ఎదురైనా జంకను. రెంటినీ స్వీకరిస్తా. ఎందుకంటే రెండూ నిజమే కాబట్టి’’ ఇదీ అటల్‌జీ మనోభావం. భారతీయత ఆయన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. హిమాలయాల్లోని కులుమనాలి ప్రాంతం అంటే ఆయ నకు ఇష్టం. విశ్రాంతికి వెళ్లాలంటే మనాలిని కోరుకునే వారు. నాట్యం, సంగీతంపట్ల అభిరుచి ఆసక్తి ఉన్నవారు. మంచి భోజనప్రియులు. తెలుగువాళ్లం గర్వంగా చెప్పుకో తగింది– వాజ్‌పేయికి మన పుల్లారెడ్డి మిఠాయిలంటే పరమ ఇష్టం. తెలుగువారితో ఆయనిది తీయని అను బంధం. తరచూ ఆయన కవితా రచనలలో మృత్యువుతో పరిహాసమాడేవారు. సవాళ్లు విసిరేవారు. ఆ మహా మనీ షిని ఏ మృత్యువూ తీసికెళ్లలేదు. కోట్లాదిమంది హృద యాలలో అటల్‌జీ నిలిచే ఉంటారు.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top