వంటనూనెల కొరతతో చిక్కులు!

Sarampally Malla Reddy Article On Edible Oil Productivity In India - Sakshi

విశ్లేషణ

2017–18లో దేశీయ వంటనూనెల వినియోగం 2.5 కోట్ల టన్నులు కాగా ఇందులో 1.5 కోట్ల టన్నులు దిగుమతులు చేస్తున్నారు. దేశీయ ఉత్పత్తి 80 లక్షల టన్నులు దాటడం లేదు. భారత్‌లో తలసరి నూనెల వాడకం సంవత్సరానికి 17 కే.జీ.లు ఉండగా ప్రపంచంలో 25 కే.జీ.లు ఉన్నది. 2030 నాటికి నూనెల వినియోగం 3.40 కోట్ల టన్నులు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నూనెల దిగుమతుల కోసం ప్రస్తుతం రూ.83,669 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఇందులో కోటీ 20 లక్షల టన్నుల వంట నూనెలకు క్రూడాయిల్‌ కోసం రూ.69,669 కోట్లు వెచ్చిస్తుండగా, 29 లక్షల టన్నుల రిఫైన్డ్‌ ఆయిల్‌ దిగుమతులకు గాను, రూ. 14 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రస్తుతం నూనె గింజల ఉత్పత్తికి 6.65 కోట్ల ఎకరాలు దేశంలో సాగవుతున్నది. వినియోగంలో 46 శాతం పామాయిల్, 16 శాతం సోయా, 14 శాతం మస్టర్, 24 శాతం ఇతర నూనెలు వాడుతున్నాం.

భారతదేశం వంటనూనెల దిగుమతులపై అత్యధిక నిధులు వెచ్చిస్తున్నది. దేశంలో 8 కోట్ల సాగునీటి భూమి బీళ్ళుగా మారింది. బీళ్ళుగా మారిన భూమిలో నూనె గింజలు, పప్పుధాన్యాలు పండాల్సింది. కానీ, ఈ రోజు వంట నూనెలతో పాటు 50 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయ అవసరాలకు 2.35 కోట్ల పప్పు ధాన్యాలు అవసరం కాగా, ప్రస్తుతం మన ఉత్పత్తులు 1.85 కోట్ల టన్నులకు మించడం లేదు. పౌష్టిక, కీలక ఆహార సరుకులను దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది తప్ప, బీడు భూములను సాగు చేసి, పైసరుకులలో స్వయంపోషకత్వం కావడానికి ఎలాంటి కృషి జరగడం లేదు. దినదినం నూనెగింజల విస్తీర్ణం తగ్గుతూ ఉంది. నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం బడ్జెట్‌లో అతి తక్కువ మొత్తాన్ని కేటాయిస్తోంది. ప్రయోగాల ద్వారా నూనె గింజలను పెంచాలని నిధులు విడుదల చేసినా ఎక్కడా దేశంలో నూనె గింజల ఉత్పాదకతకు ఎలాంటి ప్రయోజనాలు రావడం లేదు.

ప్రపంచంలో 5 దేశాలు పామాయిల్‌ ఉత్పత్తిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. 2017–18లో ప్రధమ స్థానంలో ఇండోనేíసియా  2.1 కోట్ల టన్నులు, మలేసియా 1.95 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచ ఉత్పత్తిలో ఈ రెండు దేశాలు 85 శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండోనేసియా, మలేసియా నుండి భారతదేశం వంట నూనెలు దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా నేటికీ 7 లక్షల ఎకరాలలో మాత్రమే పామాయిల్‌ తోటలు వేశారు. తోటల విస్తరణకు 90 శాతం రాయితీ ఇస్తూ ప్రోత్సహించాలని పథకాలు రూపొందిస్తున్నారు. దళిత, గిరిజనులకు 100 శాతం ఇస్తున్నారు. కానీ, చాలా వరకు ఈ సబ్సిడీ పథకాలు దుర్వినియోగం జరుగుతున్నాయి. కష్టపడి తోటలు వేసే వారికి మాత్రం లభించడం లేదు.

తోటల మంజూరుకు పైరవీలు చేయలేక చాలా మంది విరమించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత సంవత్సరం 13.478 ఎకరాలలో పామాయిల్‌ తోటలు తీసివేయగా ప్రస్తుతం 3,58,331 ఎకరాలలో మాత్రమే తోటలు ఉన్నాయి. తెలంగాణలో 40,110 ఎకరాలలో తోటలు వేశారు. దేశంలో 68 వేల ఎకరాలను లక్ష్యంగా నిర్ణయించుకొని, 36 వేల ఎకరాలలో మాత్రమే తోటలు వేశారు. ఏపీలో పామాయిల్‌ తోటల విస్తరణ లక్ష్యం 31 వేల ఎకరాలు కాగా 13 వేల ఎకరాలకు, తెలంగాణలో 5 వేల ఎకరాలు లక్ష్యం కాగా, 1,162 ఎకరాలను మాత్రమే నాటారు. దీనిని బట్టి చూస్తే దేశంలో పామాయిల్‌ తోటల విస్తరణ పెంచడానికి, ప్రభుత్వ పథకాలు అమలు జరపడానికి అధికార యంత్రాంగం, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు.

దేశీయ అవసరాలకు ఉత్పత్తికన్నా దిగుమతులు ఎక్కువగా వున్నాయి. ఇక్కడున్న కొద్దిపాటి ఉత్పత్తికి కూడా నిర్ణయించిన ధర ఇవ్వకుండా మధ్యదళారీలు రైతులను నష్టపరుస్తున్నారు. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకాన్ని రూపొందించి పామాయిల్‌ తోటల పెంపకాన్ని వృద్ధి చేయడం ద్వారా నూనె కొరతను తీర్చవచ్చు. ప్లాంటేషన్‌ తోట లన్నింటిలో కొనుగోలుదారులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. మధ్యదళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏజెన్సీ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలి. ప్రస్తుతం టన్నుకు రూ. 10,000లు అమ్మినప్పటికీ ఒక సందర్భంలో 6 వేలకు ధరలు తగ్గాయి. ధరల స్థిరత్వం లేకపోవడం వల్ల రైతులలో తోటల పెంపుదలపై ఉత్సాహం కనపర్చడం లేదు. కనీసం టన్నుకు రూ. 15,000 ధర నిర్ణయించడం ద్వారా రైతులకు కొంత ప్రోత్సాహం కలుగుతుంది. కనీస అవసరాలమేరకైనా ప్రతి వ్యక్తీ నూనెల వాడకానికి కావలసిన ఉత్పత్తిని దేశీయంగా చేయాలి. అందుకనుగుణంగా ప్రభుత్వం పథకాలు రూపొందించి ప్రత్యేక శ్రద్ధతో తోటల విస్తరణ చేసి, నూనె దిగుమతులను పూర్తిగా తగ్గించాలి.


సారంపల్లి మల్లారెడ్డి
వ్యాసకర్త ఉపాధ్యక్షులు, అఖిల భారత
కిసాన్‌ సభ 94900 98666

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top