అదే బాబు.. అదే బాట.. అవే తప్పులు!

Ramachandraiah Article On Chandrababu Naidu  - Sakshi

విశ్లేషణ

ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసినా.. టీడీపీ అధినేత చంద్రబాబులో రాజకీయంగా కనీస పరివర్తన, గుణాత్మక మార్పు కనపడటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఏ పార్టీ ఓటమి చెందినా సహజంగా ఓటమికి అధినాయకుడే బాధ్యత స్వీకరిస్తారు. ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో విశ్లేషణ చేసుకొంటామని, తిరిగి ప్రజలకు చేరువ కావడానికి కృషి చేస్తామని ఓటమి చెందిన నాయకులు వినమ్రంగా చెబుతారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబులో మాత్రం తాను తప్పు చేశాననిగానీ,  పరిపాలనలో తప్పులు జరిగాయని గానీ ఒప్పుకొనే నిజాయితీ కొరవడింది. ‘‘ఏం తప్పులు చేశామని ప్రజలు ఇంత ఘోరంగా ఓడించారు?’’ అంటూ నెపాన్ని ప్రజల మీదకు నెట్టేశారు. ఆయనలో ఓటమికి సంబంధించిన అపరాధ భావన ఏ కోశాన ఉన్నట్లు కనపడలేదు. తప్పులు జరిగాయని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. చంద్రబాబులో ఈ లక్షణం భూతద్దం పెట్టి వెతికినా కనపడదు. టీడీపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు రాజకీయాల్ని ఏ తీరుగా నడుపుతున్నారో.. తిరిగి అదే బాటలో అడుగులు వేస్తున్నారు. 

చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో జరిగిన తప్పులు, వైఫల్యాలను పక్కన పెడితే.. ప్రతిపక్ష పాత్రలోకి మారిన ఈ 50 రోజుల వ్యవధిలోనే ఆయన చేసిన తప్పుల జాబితా ఆంజనేయుడి తోకలా అంతకంతకూ పెరిగిపోతోంది. బడ్జెట్‌పై అప్పుడో మాట.. ఇప్పుడో మాట.. ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో తెలుగుదేశం ప్రభుత్వం.. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను రూ. 2,26,117 కోట్లతో ప్రవేశపెట్టింది. కేవలం 3 నెలల ప్రభుత్వ ఖర్చుల ఆమోదం కోసం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉండగా.. తెలుగుదేశం ప్రభుత్వం 2019–20 సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. అయితే, ఎన్నికల్లో ఘనవిజయం సాధించి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సా ర్‌సీపీ 2019–20 బడ్జెట్‌ను రూ. 2,27,975 కోట్లతో ప్రవేశపెట్టింది. ఈ రెండు బడ్జెట్‌లకు వ్యత్యాసం చాలా స్వల్పం. అయితే, ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అంకెలను సమర్థించుకున్న టీడీపీ నేతలు.. ప్రస్తుత బడ్జెట్‌ను అంకెల గారడీ అంటూ ఎద్దేవా చేయడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కనపడుతుంది. రాష్ట్ర సొంత ఆదాయం, ఆర్థిక సంఘం అందించే నిధులు, కేంద్ర గ్రాంట్లు, ఇతర ఆదాయాలను కలుపుకొని వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌లో.. నవరత్నాలకు, ఇతర కీలక రంగాలకు జరిగిన కేటాయింపులను చూసి టీడీపీ ఓర్వలేని తనాన్ని బహిర్గతపర్చుకుని అభాసుపాలైంది. 

స్పీకర్‌ వ్యవస్థకు అగౌరవం
శాసనసభ స్పీకర్‌గా సీనియర్‌ నేత తమ్మినేని సీతారాంను నిలపాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించిన తర్వాత ప్రొటెమ్‌ స్పీకర్‌ నేతృత్వంలో ఆయన ఎంపిక ప్రక్రియ ఏకగ్రీవంగా జరిగింది. ఎన్నిక తర్వాత స్పీకర్‌ ‘చెయిర్‌’ వద్దకు నూతన శాసన సభాపతి తమ్మినేని సీతారాంను తోడ్కొని రావాల్సిందిగా ప్రొటెమ్‌ స్పీకర్‌ అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. అయితే, తనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు ఒక ఉన్నత సంప్రదాయాన్ని కాలరాశారు. ఫ్లోర్‌ లీడర్‌గా ఉండి స్పీకర్‌ను చెయిర్‌ వద్దకు తీసుకువెళ్లే గౌరవాన్ని నిలుపుకోలేకపోయారు. తనకు బదులుగా డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న అచ్చెన్నాయుడికి ఆ బాధ్యతను పురమాయించడాన్ని అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరూ నిర్ఘాంత పోయారు. తొలిరోజు నుంచే చంద్రబాబు తన వికృత రాజకీయ క్రీడను తిరిగి ప్రారంభించారన్నది  అర్థం అయ్యింది. ఇక బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా చంద్రబాబు సభలో తాను చెప్పిందే జరగాలన్నట్లు ప్రవర్తించిన తీరు ఆయనలోని నియంతృత్వానికి పరాకాష్టగా కనిపించింది. శాసనసభలో సభానాయకుడైన సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని, మంత్రులను.. చివరకు స్పీకర్‌ను కూడా నియంత్రించాలని ప్రయత్నించి పలు సందర్భాలలో చంద్రబాబు అభాసుపాలయ్యారు. తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నదని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు.. సభాసంప్రదాయాలను గౌరవించకుండా పాలకపక్షం మీద, స్పీకర్‌ మీద తన అక్కసును, అప్రజాస్వామిక నైజాన్ని బయట పెట్టుకొన్నారు. 

అతని కంటే ఘనుడు..
చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేశ్‌ కౌన్సిల్‌లో, ట్వీట్‌ల ద్వారా చేస్తున్న ప్రకటనల్లో హేతుబద్ధత, వాస్తవాలు లేకపోవడాన్ని అందరూ గమనిస్తున్నారు. లోకేశ్‌ తన అజ్ఞానాన్ని నిజాలుగా నమ్మించడానికి చేసే యత్నాన్ని మాత్రం ఎవరైనా ఖండించాల్సిందే! విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏలు) విషయంలో కూడా నారా లోకేశ్‌ వాదన పప్పులో కాలేసిన చందంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ శాసనసభలో పీపీఏలపై సభ్యులందరికీ అర్థమయ్యేటట్లు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఎలక్ట్రికల్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఈఆర్‌ఏ) అందించిన వివరాలు, విద్యుత్‌ లభ్యతకు సంబంధించిన వాస్తవాలను సభలోనే స్లయిడ్స్‌ ద్వారా ప్రదర్శించారు. తక్కువ ధరకు థర్మల్‌ విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని కంపెనీలకు అనుచిత లాభం అందించడం కోసం ఏవిధంగా అధిక ధరలు చెల్లించి సౌర, పవన విద్యుత్‌ను కొనుగోలు చేశారో ముఖ్యమంత్రి తేటతెల్లం చేశారు.

అయితే, టీడీపీ నాయకులు, ముఖ్యంగా.. నారా లోకేశ్‌ డొల్ల వాదనలను తెరపైకి తెచ్చిన తీరు వారి అజ్ఞానానికి పరాకాష్టగా నిలుస్తుంది. థర్మల్‌ విద్యుత్‌ తక్కువ ధరలో అందుబాటులో ఉన్నప్పటికీ.. పర్యావరణ హితం కోసమే అధికరేటుతో పవన, సౌర విద్యుత్‌ను తాము కొనుగోలు చేసినట్లు.. ఇంత గొప్ప పని తాము చేస్తే అభినందించాల్సిందిపోయి విమర్శిస్తారా? అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకొని.. రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల మేర బొక్క పెట్టడాన్ని స్వాగతించాలంటున్న లోకేశ్‌ను ఏమనాలి? అదేవిధంగా.. అమరావతి నగరం కట్టడానికి అవసరమైన అప్పు మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు నిరాకరించిన ఉదంతాన్ని తమకు అనుకూలంగాను, వైఎస్సార్‌సీపీ మీద బురద జల్లడానికి లోకేశ్‌ ఎంత తాపత్రయపడినా చివరకు అది సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నట్లయింది. అమరావతిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. కేంద్రం సూచన మేరకే తాము రుణాన్ని మంజూరు చేయడం లేదని.. కొత్త ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రపంచ బ్యాంకు చేసిన ప్రకటనతో లోకేశ్‌ తన పరువు పోగొట్టుకున్నారు.

సెల్ఫ్‌ గోల్స్‌
అసెంబ్లీ సమావేశాలలో అధికార వైఎస్సార్‌సీపీని ఇరుకున పెట్టడానికి టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ‘‘కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 5% రిజర్వేషన్లపై మీ వైఖరి ఏమిటి?’’ అంటూ టీడీపీ సభలో లేవనెత్తింది. దానిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాపులను బీసీలుగా గుర్తించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిన చంద్రబాబు.. అగ్రకులాల్లోని పేదలకు కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్లలో తనకులేని అధికారాన్ని ఆపాదించుకొని, న్యాయస్థానం ముందు నిలబడదని తెలిసి కూడా 5% రిజర్వేషన్లు కల్పించడంలో అర్థం ఏమిటి? కాపులు బీసీల కోటాలోకి వస్తారా? అగ్ర కుల పేదల కోటాలోకి వస్తారా? అని సీఎం జగన్‌ నిండు సభలో నిలదీస్తే.. చంద్రబాబుకు మాటలు కరువయ్యాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని భావించిన తెలుగుదేశం తనకుతానే సెల్ఫ్‌ గోల్‌ కొట్టుకొంది.

తెరపైకి మళ్లీ ఎస్సీ వర్గీకరణ అంశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ కోసం ఒకసారి తీర్మానం చేసి, ఆర్డినెన్స్‌ కూడా జారీ చేసిన చంద్రబాబు 2014–19 కాలంలో.. ఆ అంశాన్ని అటకెక్కించారు. ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మంద కృష్ణ మంగళగిరిలో సభ నిర్వహణకు అనుమతి కోరితే నిరాకరించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఎన్డీఏతో కలిసి ఉన్న నాలుగేళ్లూ టీడీపీ కేంద్రానికి కనీసం విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వలేదు. ప్రతిపక్షంలోకి రాగానే మళ్లీ చంద్రబాబుకు ఎస్సీ వర్గీకరణ అంశం గుర్తొచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై తన వైఖరి స్పష్టం చేయాలంటూ.. టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

పరోక్ష యుద్ధం
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ప్రత్యర్థులతో నేరుగా తలపడే ధైర్యం ఎన్నడూ లేదు. రాజకీయ ప్రత్యర్థులను దొంగ దెబ్బలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ ప్రత్యర్థుల మీద, పార్టీల మీద ప్రజల్లో అపోహలు సృష్టించడానికి తన అనుకూల మీడియా ద్వారా, తన సోషల్‌ మీడియా ద్వారా చంద్రబాబు అనేక నీలి వార్తలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మీద బురదజల్లే కార్యక్రమాన్ని చాప కింద నీరులా విస్తరింపజేస్తున్నారు. ఇప్పటికే.. బీజేపీలోకి పంపిన తన బినామీల ద్వారా.. బీజేపీ మీద పరోక్షంగా పట్టు సాధించి.. ఆ పార్టీని వైఎ స్సార్‌సీపీ మీద ఎగదోయాలని కుట్రలు పన్నుతున్నారు. చంద్రబాబులో ఏమాత్రం మార్పు లేకపోవడాన్ని గ్రహించిన చాలా మంది నాయకులు ఇప్పటికే తమదారి తాము చూసుకుంటున్నారు. బాబును, ప్రత్యేకించి ఆయన పుత్రరత్నం నాయకత్వాన్ని భరించే స్థితిలో పార్టీ శ్రేణులు లేవు. ఉనికిని, అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు ఎంతకైనా తెగి స్తారు. ఈ పరిణామాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ ఎంపీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top