ప్రత్యామ్నాయమే పరమావధి | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయమే పరమావధి

Published Thu, Apr 5 2018 12:41 AM

Prof Kodandaram Says Alternative is Compulsory? - Sakshi

సందర్భం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఇలాంటి పరిణామాలను ముందే ఊహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పోరాటం చేయవలసి ఉంటుందని ఆయన ఆనాడే చెప్పారు. వారి ఆదేశాల ప్రకారమే తెలంగాణ జేఏసీ ప్రజలు కేంద్రంగా కల, ప్రజాస్వామిక విలువల పునాది కల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఆచార్య జయశంకర్‌ అన్నట్టు భావవ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ ప్రక్రియతోనే ముగింపు సాధ్యపడుతుంది.

వర్తమాన తెలంగాణలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అందించిన చైతన్యం వెలుగులో రాజకీయాలను పునర్నిర్వచించుకోవలసిన అవసరం ఉన్నది. సరళీకరణ నేపథ్యంలో రాజకీయాలు వికృతరూపాన్ని సంతరించుకున్నాయి. అధికారం వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి పెట్టుబడి లేని వ్యాపారంగా మారిపోయింది. ప్రభుత్వాధికారాన్ని గుప్పెడుమంది కలసి వనరులను కొల్లగొట్టడానికి సాధనంగా వాడుకుంటున్నారు. 

తెలంగాణ ఉద్యమం కేవలం ఒక భౌగోళిక తెలంగాణ ఏర్పాటుకు పరి మితమై సాగలేదు. సరళీకరణ రాజకీయాలనే ఈ ఉద్యమం వ్యతిరేకించింది. సమష్టి సంపద ప్రజలందరికీ ఉపయోగపడాలని, ఆ విధంగా వనరులను ప్రజల అవసరాలు తీర్చే విధంగా వినియోగంలోకి తేవాలని తెలంగాణ వాదం తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు అందరి కోసం పనిచేయాలి. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు అధికారాన్ని ఉపయో గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ ఉద్యమం బలంగా విశ్వసించింది. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చరిత్రాత్మక పంథాలో ఉద్యమం సాగించిన సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి. తరువాత ఉద్యమం నడిపిన సంస్థే రాజకీయ పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ స్ఫూర్తిని విస్మరించి ప్రభుత్వపరంగా నిలబెట్టవలసిన ప్రజా స్వామిక విలువలకు వ్యతిరేకంగా సాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టు పాలకులు మారిపోయారు. కానీ పాలనలో మార్పు రాలేదు. ముఖ్యమంత్రి నిరంకుశంగా, రాచరిక పద్ధతుల్లో పాలన కొనసాగిస్తున్నారు.  

అన్ని పాలనా వ్యవస్థలు, అన్ని సంస్థలు కుప్పకూలిపోయాయి. సచివా లయం నిరర్థకమైంది. నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి నివాసంలో జరుగు తాయి. మంత్రులతో సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి ఆయా శాఖల వ్యవహారాలను సమీక్షిస్తారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేస్తారు. శాసన సభ్యులు, మంత్రులే ముఖ్యమంత్రి దర్శనం కోసం పడిగాపులు పడి ఉండ వలసిన పరిస్థితి. ఇక సాధారణ ప్రజలకు ముఖ్యమంత్రిని కలుసుకునే వెసు లుబాటు ఎక్కడ దొరుకుతుంది? 

ఇక ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి కాగ్‌ బోలెడంత సమా చారం ఇచ్చింది. విద్య, వైద్య రంగాలకు తక్కువ కేటాయింపులు చేశారు. ఇది అవాంఛనీయ పరిణామం. కానీ ఆ తక్కువ కేటాయింపులను కూడా ఖర్చు చేయలేదు. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం మంజూరైన నిధులలో సగం కూడా ఖర్చు కాలేదు. పెట్టుబడి వ్యయంలో 80 శాతం దాకా రోడ్లు, ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులకు వినియోగమ య్యాయి. అయితే అవీ దారి మళ్లాయి. ఎక్కడ బడా కాంట్రాక్టర్లు ఉన్నారో, అక్కడే ఖర్చయినాయి. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుకున్న దాని కన్నా ఎక్కువ ఖర్చయితే, పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం మంజూరు చేసిన నిధులు మురిగిపోయాయి. చెరువుల మరమ్మతుల విషయంలో పూడిక తీత పనులు సగం కూడా పూర్తికాలేదు. 

ప్రశ్నిస్తే తప్పేమిటి? 
తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిదంటూ ఆక్రోశిస్తున్న జనసమూహా నికి ముందు నిలబడి వారి ఆకాంక్షల కోసం పనిచేసిన సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి. కానీ ప్రభుత్వంలోకి ప్రవేశించిన తరువాత అదే సంస్థ ప్రవర్తిస్తున్న తీరు విస్తుపోయేటట్టు ఉంటున్నది. ఉద్యమ సంస్థ పాలనలో ప్రశ్నించడాన్ని భరించలేని వాతావరణాన్ని సృష్టించారు. ప్రభుత్వ పాలనలోని అవకతవకల గురించి గొంతెత్తిన వారిని అణచివేయడానికే తెరాస ప్రభుత్వం పూను కున్నది. హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌ వద్ద చిరకాలం నుంచి ఉన్న ధర్ణా చౌక్‌ను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూసివేశారు. 

బహిరంగ సభల నిర్వహణకు వేదికలు లేవు. సెక్షన్‌ 30, సెక్షన్‌ 144లను అనేక జిల్లాలలో విచ్చ లవిడిగా ఉపయోగిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి, ఉమ్మడి ఆలోచనల వ్యక్తీకరణకు రోడ్ల మీదకు వచ్చిన వారిని అందరినీ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరు నిలదీసినా జైలు పాలవుతున్నారు. అధికారం సొంత ఆస్తి అయినట్టు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. నాటి రాజులు భావించిన తీరులోనేæ ప్రజలకు హక్కులు ఉండవనీ, పాలకులకు వారు లొంగి ఉండి వారి అధికారాన్నీ అదేశాలనూ శిరసావహించడమే ప్రజలు బాధ్యతగా స్వీక రించాలనీ ముఖ్యమంత్రిగారు భావిస్తున్నారు. 

నిరంకుశత్వానికి వ్యతిరేకంగా..
నిరంకుశ పాలనా రీతులను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నది. ఒక వ్యక్తి ఆధిపత్యం సరికాదు, పాలనలో అందరికీ భాగస్వామ్యం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమాజ వనరులు సమష్టి ప్రయోజనాలకే ఉపయో గపడాలి తప్ప గుప్పెడుమంది పాలకుల సొంత ఆస్తి కాకూడదని తెలంగాణ సమాజం ఆశిస్తున్నది. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు నిరంకుశ పాలనకు మధ్య సంఘర్షణ తలెత్తింది. ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో, అదీ సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో రాజకీయాలు ప్రజల ఆకాంక్షల వ్యక్తీక రణకు ఉపయోగపడాలి. అంతేతప్ప ప్రజాస్వామిక సంప్రదాయాలను, ఉద్యమ ఆకాంక్షలను అణచడానికి దారితీస్తే తెలంగాణ సమాజం అంగీకరిం చదని చరిత్ర చెబుతున్నది.

అనేకానేక సమస్యలు ఇవ్వాళ అపరిష్కృతంగా ఉన్నాయి. వ్యవసా యంలో మిగులు లేదని, నష్టాలపాలై పోతున్నామని ఆవేదన చెందుతున్న రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. డిగ్రీ దాకా చదివిన యువతీ, యువకుల్లో అతి ఎక్కువ నిరుద్యోగులున్న రాష్ట్రాలలో అస్సాం, జమ్మూ కశ్మీర్‌ తరువాత మనది మూడవ స్థానం. అయినా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విధానాలు తయారు కాలేదు. ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏ స్థాయిలోను చర్యలు లేవు. వృత్తులను కాపాడటానికి ప్రభుత్వం వ్యూహ రచన చేయనే లేదు. 

నాలుగేళ్లలో కనీస వేతనాలను సవరించే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు రాలేదు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య అపరిష్కృతంగానే ఉన్నది. ఖాయిలా పడిన నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి చర్యలే లేవు. ఈ లోపాలు సరి చేయడానికి తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు అనేక పోరాటాలు చేసినాయి. కానీ ఫలితం దక్కలేదు. అభివృద్ధి నమూనాపై చర్చిం చడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడలేదు. ప్రభుత్వ వైఖరికి మూలకారణం అధికారపార్టీ రాజకీయాలే మూలమనేది స్పష్టం.

ప్రత్యామ్నాయం కోసం యత్నం
సమాజంలో వ్యవస్థల నిర్మాణానికి పునాది వేసేది రాజకీయాలు. అన్ని వనరుల పంపిణీని రాజకీయాలే నిర్ధారిస్తాయి. మార్పునకు మార్గ నిర్దేశన చేసేవే రాజకీయాలు. రాజకీయాలు జవాబుదారీతనంతో, ప్రజాస్వామిక విలువల ప్రాతిపదికన జరిగితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. కాంట్రా క్టర్లు, కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలు కేంద్రంగా రాజకీయాలు సాగితే అప్పుడు ప్రజల ఆకాంక్షలకు గుర్తింపు ఉండదు. మార్పును సాధించగల రాజకీయ నాయకులు పైసల ఆశతో సంతలో పశువులు అమ్ముడు పోయినట్లు అమ్ముడు పోతున్నారు. చాలామంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగి మౌనంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రయత్నం చేయ వలసి వస్తున్నది. అందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలపట్ల జవా బుదారీ తనంతో వ్యవహరించకపోతే, సమష్టి ప్రయోజనాల కోసం ప్రభు త్వాన్ని నడిపించే ప్రయత్నం చేయకపోతే సమాజ రుగ్మతలకు పరిష్కారం దొరకదు. కంచె చేను మేసినట్లు, పాలించేవాడే ప్రజలను విస్మరిస్తే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవు.

ఆచార్య జయశంకర్‌ బాటలో
ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఇలాంటి పరిణామాలను ముందే ఊహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధి కోసం ప్రత్యే కంగా పోరాటం చేయవలసి ఉంటుందని ఆయన ఆనాడే చెప్పారు. వారి ఆదేశాల ప్రకారమే తెలంగాణ జేఏసీ ప్రజలు కేంద్రంగా కల, ప్రజాస్వామిక విలువల పునాది కల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఆచార్య జయశంకర్‌ అన్నట్టు భావవ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ ప్రక్రియతోనే ముగింపు సాధ్యపడుతుంది. రాజకీయరంగంలో ప్రజల ఆకాంక్షలను బలంగా వ్యక్తీకరించగలిగిన వేదిక లేకపోతే అన్ని ప్రయ త్నాలు, ఉద్యమాలు సంపూర్ణ ఫలితాలను సాధించలేవు. రాజకీయ రంగాన్ని విస్మరిస్తే అన్ని ఉద్యమాలు విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఈ అనుభవాల నుంచే తెలంగాణ జేఏసీ గాని, ఇతర ప్రజా సంఘాలు కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలను పాదుకొల్పే ప్రయత్నాన్ని మొదలుపెట్టాయి. 

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వెలుగులో రాజకీయాలను పునర్‌ నిర్వ చించాలి. ఉద్యమ కాలంలో ప్రజలు రాజకీయాలను శాసించారు. తమ వెంట రాని నాయకుల వెంటపడినారు. తెలంగాణ సాధన కోసం నాయకులు కదిలి వచ్చేటట్టు చేయగలిగినారు. ఇవ్వాళ ప్రజాస్వామిక ఆకాంక్షల సాధనకై రాజ కీయాలలో మార్పు తేవాలి. ప్రజలందరూ గౌరవంతో జీవించగల, ప్రజలు కేంద్రంగా కల అభివృద్ధి కోసం మనం రాజకీయాలను మార్చాలి. దాని కోసం తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేస్తున్నాం.ప్రత్యామ్నాయ రాజకీయాలే తెలంగాణ జనసమితి లక్ష్యం. జనం కోసమే జన సమితి–ప్రగతి కోసమే పాలన అన్న నినాదం మాకు మార్గదర్శకం.

ప్రొ‘‘ యం. కోదండరాం
వ్యాసకర్త తెలంగాణ జన సమితి అధ్యక్షులు

Advertisement
 
Advertisement
 
Advertisement